ఆక్సిజన్ ట్యాంకర్ దొంగిలించిన ఢిల్లీ ప్రభుత్వం !
ఢిల్లీ గుండా ఫరీదాబాద్ వస్తున్న ఓ ఆక్సిజన్ ట్యాంకర్‌ను ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం దొంగతనంగా తీసుకెళ్ళిందని హర్యానా ఆరోగ్య శాఖ మంత్రి అనిల్ విజ్ ఆరోపించారు. అనిల్ విజ్ బుధవారం ఓ వార్తా సంస్థతో మాట్లాడుతూ, హర్యానాలోని ఫరీదాబాద్‌కు వస్తున్న ఆక్సిజన్ ట్యాంకర్లలో ఒకదానిని ఢిల్లీ ప్రభుత్వం మంగళవారం దొంగతనం చేసిందన్నారు. ఇకపై అన్ని ట్యాంకర్లకు పోలీసులు రక్షణ ఉండాలని ఆదేశించానని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వాలే ఇటువంటి కార్యకలాపాలకు ప్పాడితే, ఇక ఆరోగ్య సంరక్షణ రంగంలోని మౌలిక సదుపాయాలు దెబ్బతింటాయని చెప్పారు. అనిల్ విజ్ హర్యానా హోం మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వహిస్తున్నారనే విషయం గమనార్హం. హర్యానాకు ఆక్సిజన్ తగిన స్థాయిలో ఉందని, ఢిల్లీకి ఆక్సిజన్‌ను పంపించడానికి సుముఖంగా ఉన్నామని, అయితే రాష్ట్ర అవసరాలను తీర్చుకున్న తర్వాత మాత్రమే అది సాధ్యమవుతుందని ఆయన చెప్పారు. ‘‘మా ఆక్సిజన్‌ను ఢిల్లీకి ఇవ్వాలని మాపై ఒత్తిడి వస్తోంది’’ అని చెప్పారు. హర్యానా రాష్ట్రానికి వస్తున్న అన్ని ఆక్సిజన్ సిలిండర్ల వాహనాలకు పోలీసు రక్షణ కల్పించాలని ఆదేశించామన్నారు. అనిల్ విజ్ ఆరోపణపై ఇప్పటి వరకూ ఢిల్లీ ప్రభుత్వం స్పందించలేదు. చూడాలి ఈ వ్యవహారం ఎలాంటి ముపు తిరుగుతుందో !


