ఆగముక్తంగా సంకల్పసిద్ధి యాగం
- 93 Views
- wadminw
- September 6, 2016
- తాజా వార్తలు
తిరుపతి, సెప్టెంబర్ 6 (న్యూస్‌టైమ్): చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి అనుబంధంగా ఉన్న శ్రీభరద్వాజేశ్వరస్వామి ఆలయంలో వినాయక చవితి సందర్భంగా సంకల్పసిద్ధి యాగాన్ని ఆగముక్తంగా నిర్వహించారు. నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణపనులు ఎలాంటి విఘ్నాలు లేకుండా వేగవంతంగా జరగాలని దేవాలయ శాఖ అన్ని ఆలయాల్లో ఈ యాగాన్ని నిర్వహించేందుకు సంకల్పించింది. 9 రోజుల పాటు జరిగే ఈ యాగాన్ని పురస్కరించుకొని ఆలయంలోని గణనాధునికి విశేష అభిషేకాలు, యాగపూజలు, గణపతి హోమాన్ని జరిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త మండలి అధ్యక్షుడు పోతుకుంట గురవయ్యనాయుడు, ఈవో బ్రమరాంభతో పాటు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఇదిలావుండగా, వినాయక చవితిని పురస్కరించుకుని తిరుపతి గ్రామీణ మండలం తుమ్మలగుంటలోని కల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయ ఆవరణలో 40 అడుగుల నారికేల వినాయకుని విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.
ఈ విగ్రహం మొత్తం టెంకాయలతో రూపుదిద్దుకుంది. దీని కోసం పది వేల టెంకాయలను ఉపయోగించారు. వారం రోజులుగా పలువురు కళాకారులు టెంకాయలతో గణనాథుడిని రూపొందించారు. ఈ విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలువనుందని నిర్వాహకులు, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి పేర్కొన్నారు. మరోవైపు, కాణిపాకం స్వయంభు వరసిద్ధి వినాయకస్వామి ఆలయంలో మంగళవారం ధ్వజారోహణం సందర్భంగా ముక్కంటి ఆలయం తరఫున పట్టువస్త్రాలను సమర్పించారు. ఈ విశేషోత్సవంలో ఆలయ ధర్మకర్తల మండలి అధ్యక్షుడు పోతుగుంట గురవయ్యనాయుడు, ఈవో భ్రమరాంబతో పాటు ధర్మకర్తల మండలి సభ్యులందరూ పాల్గొన్నారు. ముక్కంటి ఆలయానికి అనుబంధంగా ఉన్న నవసంధి వినాయకులకు ఏటా వినాయక చవితి సందర్భంగా ఆలయం తరఫున ఆలయానికి అనుబంధంగా పట్ట్టణ వీధుల్లో ఉన్న నవసంధి వినాయకులకు సారెను అందజేయడం ఆనవాయితీగా వస్తోంది. ముక్కంటి ఆలయంలో బాలాలయ స్థాపన కారణంగా ఆలయంలో గణపతిహోమాలు, ప్రత్యేక ఉత్సవాలు నిర్వహించకపోయినప్పటికీ సాధారణ అభిషేకాలు మాత్రం కొనసాగించారు.


