ఆదర్శ మానవ వనరులు దేశానికి అవసరం: చినరాజప్ప
- 120 Views
- wadminw
- September 3, 2016
- తాజా వార్తలు
కాకినాడ, సెప్టెంబర్ 3 (న్యూస్‌టైమ్): ఉత్తమ విలువలు, సామాజిక స్పృహ కలిగిన ఆదర్శ మానవ వనరులను దేశానికి అందించాలని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, హోమ్ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప ఉపాధ్యాయులను కోరారు. ఈ నెల 5వ తేదీన భారత మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి పురస్కరించి జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో శనివారం ఉదయం స్థానిక కాకినాడ జేఎన్టియు అలుమిని హాలులో గురుపూజోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించి 104 ఉత్తమ ఉపాధ్యాయులను సత్కరించారు.
ఈ సందర్భంగా స్థానిక శాసన సభ్యులు వనమాడి వెంకటేశ్వరరావు అధ్యక్షతన నిర్వహించిన సభా కార్యక్రమానికి రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, హోమ్ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప ముఖ్య అతిధిగాను, అమలాపురం ఎంపి పండుల రవీంద్రబాబు, జిల్లా పరిషత్ చైర్మన్ నామన రాంబాబు, జిల్లా కలెక్టర్ హెచ్.అరుణ్‌కుమార్, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పిల్లి అనంత లక్ష్మి విశిష్ట అతిధులుగా హాజరైయ్యారు. తొలుత అతిధులు జ్యోతిప్రజ్వలన చేసి, డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ విగ్రహానికి పూలమాలలు అలంకరించగా, ప్రార్ధనా గీతంతో కార్యక్రమంలో ప్రారంభమైంది.
ఈ సందర్భంగా మంత్రి చినరాజప్ప ప్రసంగిస్తూ ముందుగా ఉపాధ్యాయులు అందరికీ గురుపూజోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యకు ప్రత్యేక ప్రాధాన్యత పాటిస్తూ పాఠశాల భవనాలు, ఫర్నచర్, మరుగుదొడ్లు, ప్రహరీలు తదితర మౌళిక వసతులు కల్పిస్తోందన్నారు. చాలీచాలని జీతాలతో బతక లేక బడిపంతులు అనే పాతకాలపు రోజులు, నానుడులు పోయాయని, బ్రతికించే వాడు, బ్రతుకు నేర్పేవాడుగా ఉపాధ్యాయుడిని నిలుపుతూ మెరుగైన వృత్తి వాతావరణం ప్రభుత్వం కల్పిస్తోందన్నారు.
ప్రపంచ స్థాయి పోటీకి ధీటుగా బోధనలో ఆధునిక సాంకేతికతను ప్రవేశ పెట్టి డెజిటల్ తరగతి గదులతో ఈ లెర్నింగ్ వసతుల విస్తరణ రాష్ట్ర పభుత్వం చేపట్టిదని, మారుతున్న అవసరాల కనుగుణంగా ఉపాధ్యాయులు తమ నైపుణ్యాలను పెంపొందించు కోవాలని కోరారు. మెరిట్ ఆధారంగా ప్రభుత్వ పాఠశాలల్లో నియమితులౌతున్న ప్రతిభావంతులైన ఉపాధ్యాయులు ఉత్తమ బోధన, శిక్షణలతో ప్రభుత్వ పాఠశాలల పట్ల తల్లిదండ్రుల విశ్వాసాన్ని సాధించాలని సూచించారు. మంచి సమాజానికి పునాది పాఠశాలల్లోనే ఉంటుందని, ఉత్తమ విలువలు, సామాజిక స్పృహ కలిగి న మానవ వనరులను జాతికి అందించే గురుతర బాధ్యతను ప్రతి గురువు అంకితభావంతో చేపట్టాలని మంత్రి చినరాజప్ప కోరారు.
విశిష్ట అతిధి అమలాపురం పార్లమెంట్ సభ్యులు పండుల రవీంద్ర బాబు మాట్లాడుతూ కేవలం మంచి నేర్వడమే విద్య కాదని, చెడును విడనాడడం కూడా నేర్పినపుడే విద్య పరిపూర్ణమౌతుందన్నారు. దేశం గురించి, సమాజం గురించి ఆలోచించే పౌరులను విద్యావ్యవస్థ అందించాలని కోరారు. శాసన మండలి సభ్యులు రెడ్డి సుబ్రమణ్యం మాట్లాడుతూ పూజనీయమైన వృత్తి ఉపాధ్యాయ వృత్తి ఒక్కటేనని, జ్ఞానాన్ని, జీవితాన్ని అందించే గురువులే కనిపించే దేవతలన్నారు.
జిల్లా కలెక్టర్ హెచ్.అరుణ్‌కుమార్ మాట్లాడుతూ ఉత్తమ ఫలితాలు, మంచి జిపిఏ రాంకులతో జిల్లా విద్యరంగంలో ముందు నిలుస్తోందన్నారు. జిల్లాలో ఏ విద్యార్థి 100 మీటర్లు దాటి నడచి వెళ్లనవసరం లేకుండా సుమారు 4 వేల పాఠశాలలు, ఆదర్శ విద్యార్థి- ఉపాధ్యాయ నిష్పత్తితో నిర్వహించడం జరుగుతోందన్నారు. దాదాపు నాలుగున్నర లక్షల మంది విద్యార్థులకు అవసరమైన అన్ని వసతులు పాఠశాలల్లో కల్పించామన్నారు. కేవలం వసతులు ఒక్కటే సరిపోవని, ఉపాధ్యాయులు అంకిత భావంతో పనిచేసినపుడే ప్రభుత్వ పాఠశాలల నమ్మకం పెరుగుతుందన్నారు. విద్య అంటే కేవలం సిలబస్ బోధన కాదని,పవిత్రమైన జాతి నిర్మాణ కార్యక్రమమని ఉపాధ్యాయులు గుర్తించాలని కోరారు.
జిల్లా పరిషత్ చైర్మన్ నామన రాంబాబు మాట్లాడుతూ జిల్లాలో విద్యా వసతుల అభివృద్దికి చేపట్టిన కృషిని వివరించారు. సభాధ్యక్షులు వనమాడి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ప్రాపంచిక విద్యతో బాటు ఆధ్యాత్మిక విద్యను అందించిన డా.సర్వేపల్లి రాధాకృష్ణ బాటలో ప్రతి ఉపాధ్యాయుడు నడచి రాష్ట్రాన్ని విజ్ఞాన సమాజంగా నిలిపాలనే ప్రభుత్వ లక్ష్యాన్ని సాకారం చేయాలని కోరారు. జిల్లా విద్యాశాఖాధికారి ఆర్.నర్శింహారావు మాట్లాడుతూ ఈ నెల 5 వ తేదీన వినాయక చవితి పండుగ వచ్చిన దృష్ట్యా 3వ తేదీనే గురుపూజోత్సవం నిర్వహిస్తున్నామన్నారు.
అందుబాటులో ఉన్న వనరులతో జిల్లాలో నాణ్యమైన, ఉత్తమ ప్రమాణాల విద్యను అందించేందుకు ఉపాధ్యాయులు అందరూ పునరంకితం కావాలని కోరారు. కార్యక్రమంలో గురుపూజోత్సవం సందర్భంగా ఈ యేడాది ఉత్తమ ఉపాద్యాయులుగా ఎంపికైన 104 మంది ఉపాధ్యాయులను మంత్రి నిమ్మకాయల చినరాజప్ప, అతిధులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్-2 జె.రాధాకృష్ణమూర్తి, ఉప విద్యాశాఖాధికారులు ఆర్.ఎస్.గంగాభవానీ, అబ్రహం, డి.నాగేశ్వరరావు, దడాల వాడపల్లి, ఎయంసి చైర్మన్లు యం.గంగసూర్యనారాయణ, బి.సత్తిబాబు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.


