ఆదివాసి జిల్లా కోసం డిమాండ్
ఖమ్మం, అక్టోబబర్ 4 (న్యూస్‌టైమ్): భద్రాద్రి పుణ్యక్షేత్రమైన భద్రాచలాన్ని ఆదివాసీ జిల్లాగా ప్రకటించాలని డిమాండు చేస్తూ సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో అశ్వారావుపేట పట్టణంలో మంగళవారం బంద్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంగళవారం ఉదయం నుంచే పట్టణంలో దుకాణాలు, పెట్రోలు బంకులు, పాఠశాలలు మూతపడ్డాయి. కార్యకర్తలు పురవీధుల్లో ప్రదర్శన చేస్తూ బంద్ నిర్వహించారు. కార్యక్రమంలో సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ జిల్లా నాయకులు ప్రభాకర్, కల్లయ్య, పీవైఎల్ జిల్లా అధ్యక్షుడు రామారావు తదితరులు పాల్గొన్నారు. మరోవైపు, కొత్తగూడెం జిల్లా ఏర్పాటుపై కొత్తగూడెం ఎమ్మెల్యే జలగం వెంకట్రావు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఈ సందర్భంగా భద్రాచల శ్రీరామునికి ప్రత్యేక పూజలు చేసేందుకు మంగళవారం కాలినడకన బయలు దేరారు. రెండు రోజులపాటు సాగే ఈ పాదయాత్ర కొత్తగూడెం గణేశ్ ఆలయంలో పూజలు చేయటంతో మొదలైంది. పలువురు ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేకు సంఘీభావం ప్రకటించారు. యాత్ర ఇల్లందు క్రాస్‌రోడ్డు మీదుగా పాల్వంచ పెద్దమ్మగుడి వద్దకు సాయంత్రానికి చేరుకుంటుంది. రాత్రి అక్కడ బస చేస్తారు. తిరిగి బుధవారం ఉదయం 7 గంటలకు ప్రారంభమై బూర్గంపాడు మీదుగా సాయంత్రానికి భద్రాచలానికి చేరుకుంటుంది.
మరోవైపు, జూలూరుపాడు మండలాన్ని కొత్తగూడెం జిల్లాలో విలీనం చేయడంపై గిరిజనేతరులు వందలాదిగా తరలివచ్చి జూలూరుపాడులో మంగళవారం స్వచ్ఛందంగా ఆందోళనకు దిగారు. ఖమ్మం జిల్లాలోనే జూలూరుపాడును కొనసాగించాలని డిమాండ్ చేస్తూ భారీ ప్రదర్శన నిర్వహించారు. అనంతరం ప్రధాన రహదారిపై బైఠాయించి రాకపోకలను అడ్డుకున్నారు. సుమారు 2 గంటలపాటు రాస్తారోకో నిర్వహించడంతో కిలోమీటరు పొడవునా వాహనాలు నిలిచిపోయాయి. ఈ సందర్భంగా జిల్లా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎంపీ శ్రీనివాస్‌రెడ్డిల దిష్టిబొమ్మలను ఆందోళనకారులు దహనం చేశారు.


