ఆర్టీసి కార్మిక పరిషత్‌కు కందుల సంఘీభావం
ఒంగోలు, సెప్టెంబర్ 6 (న్యూస్‌టైమ్): కార్మిక పరిషత్ ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా మార్కాపురం ఆర్టీసి డిపో గేటు వద్ద మంగళవారం ధర్నా కార్యక్రమం నిర్వహించారు. మాజీ శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి ఈ ధర్నా కార్యక్రమానికి సంఘీభావం తెలిపి అనంతరం డిపో మేనేజర్‌తో చర్చించి భవిష్యత్తులో కార్మిక పరిషత్ యూనియన్‌కు పక్షపాతం చూపితే సహించేది లేదని హెచ్చరించారు. పరిషత్ నాయకులు షేక్ దస్తగిరి ఎం కాశయ్య మాట్లాడుతూ డ్రైవర్ కెఆర్ఎస్ బాబు అక్రమ సస్పెన్షన్‌ను ఎత్తివేయాలని డిపో యందు స్వచ్ఛభారత్ కార్యక్రమంను నిర్విరామంగా జరపాలని, ఓడిలను సీనియారిటీ ప్రాతిపదికన ఇవ్వాలని హయ్యర్ బస్సులకు కండెక్టర్లను ఇవ్వాలని, అన్ని కేటగిరిల్లో ఖాళీలను పూరించాలని డిమాండ్ చేశారు. మాజీ శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి డిపో మేనేజర్‌తో మాట్లాడిన తరువాత ఆయన యూనియన్ చేసిన డిమాండ్లపై సానుకూలంగా స్పందించి సమన్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పరిషత్ రాష్ట్ర కార్యదర్శి షేక్ జిలాని, రీజనల్ ఉపాధ్యక్షులు జివి నారాయణ, డిపో కార్యదర్శి మల్లయ్య, ఎం లాభాన్, ఎం మోహన్‌రావు, కాశింసాహెబ్, వైవి రమణ, తదితరులు పాల్గొన్నారు.
నవ్యాంధ్రకు ప్రత్యేక హోదాకు ‘ఆప్’ డిమాండ్
ఒంగోలు, సెప్టెంబర్ 6 (న్యూస్‌టైమ్): నవ్యాంధ్ర ప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ ఆమ్ఆద్మీ పార్టీ ప్రకాశం జిల్లా యూత్ కన్వీనర్ వి సుదర్శన్ కోరారు. విభజనచట్టం హామీలో బీజేపి, టిడిపిలా ఎన్నికల వాగ్ధానాలను అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. మంగళవారం కార్యకర్తల సమావేశం నిర్వహించి ఆయన మాట్లాడుతూ ఈ నెల 9వ తేదీన యర్రగొండపాలెం నియోజకవర్గ కేంద్రం నుండి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు పాదయాత్ర చేపట్టడం జరుగుతుందని అన్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కారణమైన ప్రత్యేక హోదా వెంటనే ఇవ్వాలని, విభజన చట్టం హామీని వెంటనే అమలు పరచాలని, యువతకు చంద్రబాబు ఇచ్చిన నిరుద్యోగ భృతి హామీలను అమలు చేయాలని ప్రకాశం జిల్లాను వెనుకబడిన జిల్లాగా ప్రకటించాలని వెలుగొండ ప్రాజెక్టు నిర్మాణానికి సరిపడ నిధులు కేటాయించాలని, అలాగే త్వరితగతిన పూర్తి చేయాలని లేకపోతే ఆమ్ఆద్మీ పార్టీ ఆధ్వర్యంలో మరిన్ని ఆందోళన కార్యక్రమాలు చేస్తామని హెచ్చరించారు. జిల్లాలోని అన్ని రాజకీయ పార్టీ నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు, యువజనులు మహిళలు, ఉద్యోగస్తులు, అధికారులు, సమైక్యాంధ్ర ఉద్యమ కారులు, కార్మికులు, కర్షకులు, రైతులు ఈ పాదయాత్రలో పాల్గొని జయప్రదం చేయాలని ఆయన కోరారు.
పౌష్టికాహారంపై అవగాహన సదస్సు
ఒంగోలు, సెప్టెంబర్ 6 (న్యూస్‌టైమ్): ప్రకాశం జిల్లా కందుకూరు పట్టణంలోని 10,11 వార్డుల్లో గల అంగన్వాడీ కేంద్రంలో ఐసిడిఎస్ సూపర్వైజర్ ప్రభావతి ఆధ్వర్యంలో పౌష్టికాహారంపై మంగళవారం అవగాహన సదస్సు జరిగింది. ఈ సందర్భంగా ప్రభావతి పౌష్టికాహార విలువలు, అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందజేయబడుతున్న పౌష్టికాహారం గురించి సంపూర్ణ అవగాహనను తల్లులు, గర్భవతులకు కల్పించారు. ఈ కార్యక్రమంలో కార్యకర్తలు పుష్ప, సునీత, షాకీరా, ఈశ్వరమ్మ, ఆయాలు, తల్లులు, చిన్నారులు, గర్భవతులు పాల్గొన్నారు. కాగా, వర్షాలు లేనందున సీజనల్ పంటలైన వరికి నీరు సరిపడ ఉండనందున వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలైన పెసర, మినుము, బొబ్బర్లు వంటి పంటలు వేసుకుంటే మంచిదని ఎఓ దేవిరెడ్డి శ్రీనివాసులు మంగళవారం పొదిలి, మల్లవరం గ్రామాల్లో నిర్వహించిన పొలంపిలుస్తుంది కార్యక్రమంలో రైతులతో అన్నారు. ఆరుతడి పంటలైన పెసర, మినుము, బొబ్బర్లు పంటలు వేయడం వలన నీటిని ఆదా చేయవచ్చని అంతేకాకుండా అధిక దిగుబడులు వస్తాయని అన్నారు. సూక్ష్మ పోషకాలైన జింకు, జిప్సం, బోరాన్‌లను వ్యవసాయశాఖ ద్వారా తీసుకుంటే 50 శాతం రాయితీ పొందవచ్చని రైతులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని తెలిపారు. ఈయన వెంట ఎంపిఇఓలు గంగయ్య, గురుబ్రహ్మం, రైతులు ఉన్నారు.


