ఆలోచనల్లో మార్పుతో వివక్షత దూరం చేయాలి: ఏయూ రిజిస్ట్రార్
సమాజంలోని వ్యక్తుల ఆలోచనలల్లో మార్పును తీసుకురావడం ద్వారా వివక్షతలను దూరం చేయడం సాధ్యపడుతుందని ఏయూ రిజిస్ట్రార్ ఆచార్య వి.ఉమా మహేశ్వరరావు అన్నారు. ఏయూ రాజనీతిశాస్త్ర విభాగంలో నిర్వహించిన ప్రత్యేక ప్రసంగ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. వ్యక్తి పుట్టుక ఆధారంగా కులాన్ని ఆపాదించడం, వివక్షత చూపడం ఎంతమాత్రం తగదన్నారు.ప్రాంతీయ, కుల, వర్ణ, లింగ, ప్రాంతీయ వివక్షత లేని సమ సమాజం అవసరమన్నారు.నేటికీ భారత్‌లో కొందరు సమాజంలో అంటరానివారిగా పరిగణించబడుతూ వివక్షతను చూపడం జరుగుతోందని, ఇటువంటి సంఘటనలు విచారకరమన్నారు.
జెఎన్యూ(న్యూఢిల్లీ) ఆచార్యుడు, సెంటర్ ఫర్ స్టడీ ఆఫ్ డిస్క్రిమినేషన్ అండ్ ఎక్స్క్యూజన్(సిడిఎస్ఇ) చైర్పర్సన్ ఆచార్య వై.చిన్నారావు ‘డైమెన్షన్స్ ఆఫ్ సోషల్ ఎక్స్‌క్లూజన్- థియరీస్ అండ్ ప్రాక్సిస్’ అంశంపై ప్రసంగించారు. సమ్మిళితం చేసుకోవడమనే ఆలోచన 1970వ దశకంలో ప్రారంభమైనదన్నారు. విదేశాలలో, భారత్‌లో వివక్షతను వివరించారు. కార్యక్రమంలో సోషల్ ఎక్స్‌క్లూజన్ కేంద్రం సంచాలకులు డాక్టర్ పి.సుబ్బారావు, రాజనీతి శాస్త్ర విభాగాధిపతి డాక్టర్ పి.ప్రేమానందం, విభాగ ఆచార్యులు, పరిశోధకులు పాల్గొన్నారు.
కాగా, సోషల్ ఎక్స్‌క్లూజన్ ఇంక్లూజివ్ పాలసీ స్టడీస్ సంచాలకులు డాక్టర్ పి.సుబ్బారావు సంపాదకం చేసిన ‘స్టేటస్ ఆఫ్ దళిత్ వుమెన్ ఇన్ ఇండియా-స్ట్రాటజీస్ ఫర్ ఇంక్లూజివ్ డెవలప్మెంట్’ పుస్తకాన్ని ఏయూ వీసీ ఆచార్య జి.నాగేశ్వరరావు తన కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ పుస్తకంలో దళిత మహిళలకు సంబంధించిన 16 పరిశోధన అంశాలను పొందుపరిచారు. వీటిని దేశ వ్యాప్తంగా పలువురు పరిశోధకులు అందించారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ ఆచార్య వి.ఉమామహేశ్వరరావు, ఆచార్య వై.చిన్నారావు, డాక్టర్ పి.ప్రేమానందం తదితరులు పాల్గొన్నారు.


