ఆవిష్కరణలకు విశ్వవిద్యాలయాలే వేదిక: సీఎం చంద్రబాబు
విశాఖపట్నం, సెప్టెంబర్ 14 (న్యూస్‌టైమ్): ఆవిష్కరణలకు విశ్వవిద్యాలయాలే వేదికగా మారాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. బుధవారం సాయంత్రం ఏయూ స్నాతకోత్సవ మందిరంలో నిర్వహించిన ఏయూ సైన్స్ అండ్ టెక్నాలజీ కళాశాల వార్షికోత్సవాన్ని ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ విద్య ఆత్మవిశ్వాసాన్ని, విజ్ఞానాన్ని అందిస్తుందన్నారు. విద్యార్థులు సమాజాన్ని అనుసంధానించి క్షేత్ర స్థాయిలో పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు.ప్రతీ విద్యార్థి శాస్త్రవేత్తగా మారాల్సిన అవసరం ఉందన్నారు. మీ ఆలోచనలతో ప్రపంచాన్ని మార్చండని పిలుపునిచ్చారు. సృజనాత్మకంగా, ఆవిష్కరణల దిశగా పయనించాలన్నారు.
జీవితం మొత్తం నేర్చుకుంటూనే ఉండాలన్నారు. అన్నీ తెలుసనే భావన పతనానికి నాందిగా నిలుస్తుందన్నారు. యువతతరం ఆలోచనలు తనకు కావాలన్నారు. ఏపిని తీర్చిదిద్దే కార్యక్రమం వర్సిటీ నుంచి ఆరంభం కావాల్సి ఉందన్నారు. విశాఖ ప్రజలకు ఆత్మవిశ్వాసం మెండని స్వయంగా ప్రధాని నరేంద్రమోదీ కితాబిచ్చారన్నారు. గ్రీనరీకి ప్రాధన్యం ఇచ్చిన విశాఖను ఎప్పటికీ మరచిపోనన్నారు. సాంకేతిక తనకు మంచి స్నేహితుడు వంటిదన్నారు.ఇన్నోవేటివ్ సొసైటీని తీర్చిదిద్దుతానన్నారు. ఆవిష్కర్తలుగా, నాయకులుగా యువతరం మారాలన్నారు. సమాజ ఉపయుక్తంగా ప్రాజెక్టులు, అధ్యయనం చేసే వారికి తగిన మార్కుల వెయిటేజీ ఇచ్చే ఆలోచన ఉందన్నారు.
సముద్ర అలలను మించిన ఆలోచనలతో ముందుకు సాగాలన్నారు. వర్సిటీ పాలక మండలి సభ్యులుగా పారిశ్రామిక వేత్తలను నియమించామన్నారు. విశ్వవిద్యాలయాలలో యువతను భాగస్వాములను చేస్తూ డైనమిక్ కార్యక్రమాలు చేపట్టాలన్నారు. వీటికి అవసరమైన ఆరేడు కోట్ల రూపాయలు అందిస్తామన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు అడిగిన పలు ప్రశ్నలకు ముఖ్యమంత్రి స్వయంగా సమాధానమిచ్చారు. విశాఖనగరంలో బయో టెక్నాలజీ పార్క్‌ను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ విద్యార్థులు తాము చదువుకున్న అంశాలను కార్యరూపంలో చూపాలన్నారు.
సమాజ పునర్నిర్మాణంలో యువతరం పాత్ర ఎంతో కీలకమన్నారు. శౌచాలయాలు, మౌళిక వసతుల కల్పను చేస్తూ విద్యా రంగానికి రూ 5 వేల కోట్లు కేటాయించడం జరిగిందన్నారు. విద్యార్థులు బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదగాలన్నారు. ఏయూ వీసీ ఆచార్య జి.నాగేశ్వరరావు మాట్లాడుతూ విద్యార్థులు సమాజానికి ఏ విధంగా ఉపయోగపడాలనే విషయం ఆలోచించాలన్నారు. పరిశోధన కేంద్రం, ఇంక్యుబేషన్ కేంద్రాలు ఏర్పాటు చేసే దిశగా కృషిచేస్తున్నామన్నారు. యువతరం పారిశ్రామిక వేత్తలుగా నిలవాలన్నారు. అభ్యసన వాతావరణాన్ని వర్సిటీలో పూర్తిస్థాయిలో కల్పనకు ప్రాధాన్యం కల్పిస్తున్నామన్నారు. వర్సిటీ రిజస్ట్రార్ ఆచార్య వి.ఉమా మహేశ్వరరావు మాట్లాడుతూ మల్టీ డిసిప్లేనరీ విశ్వవిద్యాలయంగా ఏయూ నిలుస్తోందన్నారు.ఇన్నోవేషన్ టెక్నాలజీ పార్క్ అభివృద్ది చేస్తామన్నారు.
డిసెంబర్ 10 సిఆర్ రెడ్డి జయంతి రోజును పూర్వవిద్యార్థుల సమావేశం నిర్వహిస్తామన్నారు. వర్సిటీ ప్రగతికి వివరించారు. సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య సి.వి రామన్ మాట్లాడుతూ ప్లాస్టిక్‌ను పూర్తిస్థాయిలో నియంత్రించడానికి చర్యలు తీసుకోవాలన్నారు. పర్యావరణంలో కార్బన్ శాతం విపరీతంగా పెరిగిందని, దీనిని నియంత్రించాలన్నారు. వర్సిటీ క్యాంపస్ విద్యార్థులకు స్కాలర్షిప్లు పెంచాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో మంత్రులు చింతకాయల అయ్యన్నపాత్రుడు, ఎంపీ ఎం.శ్రీనివాసరావు, ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్,ఎమ్మెల్సీలు పప్పల చలపతి రావు, గాదె శ్రీనివాసుల నాయుడు, మాజీ వీసీ ఆచార్య జి.ఎస్.ఎన్ రాజు, పాలక మండలి సభ్యులు ఎం.ప్రసాదరావు, ఎస్.విజయ రవీంద్ర, పి.సోమనాథ రావు, జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్, జెసి నివాస్, వెంకట రెడ్డి, ఏయూ సైన్స్ కళాశాల మాజీ ప్రిన్సిపాల్స్, డీన్లు, ఆచార్యులు, పెద్దసంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును వర్సిటీ తరపున సత్కరించి జ్ఞాపికను బహూకరించారు. అనంతరం విద్యార్థుల సాంసృతిక కార్యక్రమాలు అలరించాయి. గత కొన్ని రోజులుగా నిర్వహించిన వివిధ పోటీలలో విజేతలుగా నిలచిన వారికి బహుమతులను ప్రథానం చేశారు.


