ఆసక్తిరేపినా ఆకట్టుకోని ‘జాగ్వార్’!
ఏదైనా సినిమా ప్రేక్షకుల్ని మెప్పించడం అంత తేలిక కాదు. ఈ సినిమాలో సత్తా అయినా ఉండాలి. లేదా ప్రేక్షకుల్ని ఆకట్టుకునే బలమైన కథనమైనా ఉండాలి. అప్పుడు తప్ప మరే చిత్రం కొత్త నటులతో రూపొందించింది విజయవంతమైన దాఖలాలు లేవు. రాజకీయంగా బాహ్య ప్రపంచంలో తన కుటుంబం బహుగా బాగున్న సమయంలో కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి తనయుడు హెచ్.డి. కుమారస్వామి గౌడ తనయుడు నిఖిల్ గౌడ హీరోగా రూపొందిన ‘జాగ్వార్’ గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
విడుదలకు ముందు నుంచీ ఈ సినిమా వార్తల్లో ఉంది. మాజీ ప్రధానమంత్రి దేవగౌడ మనవడు, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి తనయుడు కథానాయకుడిగా అరంగేట్రం చేసిన చిత్రమిది. జగపతిబాబు, రమ్యకృష్ణ ప్రధాన పాత్రలు పోషించడంతో పాటు, తమన్నా ఓ ప్రత్యేక గీతంలో కనిపించడంతో ఈ సినిమా పట్ల ఆకర్షణ బాగా పెరిగింది. పైగా ‘బాహుబలి’ రచయిత విజయేంద్ర ప్రసాద్ కథ అందించారు. దాంతో పాటు ప్రచార చిత్రాలూ ఆకట్టుకొన్నాయి. అలా ‘జాగ్వార్’ ప్రేక్షకుల దృష్టిని తన వైపు తిప్పుకునేలా చేసింది. కొత్త హీరో నిఖిల్ గౌడ ఎలా నటించారు? అని ప్రశ్నించడం కన్నా కూడా ఈ చిత్రం ఎంత వినూత్నంగా తెరకెక్కించే ప్రయత్నంచేశారన్నదే ప్రధానం.
ఓ ముసుగు వీరుడు (నిఖిల్ గౌడ) న్యాయమూర్తి (ఆదిత్యమేనన్)ని చంపడంతో ఈ కథ మొదలవుతుంది. చంపడమే కాదు ఇదంతా ఎస్.ఎస్. టీవీ ఛానల్లో లైవ్‌గా చూపిస్తాడు. ఆ ఛానల్ ప్రసారాల్ని హ్యాక్ చేసి మర్డర్‌ని లైవ్‌గా చూపిస్తాడు. దాంతో రాష్ట్రమంతా కలకలం రేగుతుంది. ఈ మర్డర్ మిస్టరీని ఛేదించడానికి ప్రభుత్వం ఓ సీబీఐ అధికారి (జగపతిబాబు)ని నియమిస్తుంది. ఆ ముసుగు వీరుడికి సీబీఐ ఆఫీసర్ పెట్టిన పేరే జాగ్వార్. మరోవైపు ఎస్.ఎస్. మెడికల్ కాలేజీలో చేరతాడు కృష్ణ (నిఖిల్‌గౌడ). చాలా హుషారైన కుర్రాడు. తన సీనియర్లని కూడా ఆట పట్టిస్తాడు. తనతో పాటు చదువుతున్న ప్రియ (దీప్తి)ని ప్రేమిస్తాడు. ఎస్.ఎస్ ఛానల్ అధినేత శౌర్య ప్రసాద్ (సంపత్ రాజ్).
విద్య.. వైద్యాన్ని వ్యాపారాలుగా చూస్తాడు. తన కాలేజీలో జరుగుతున్న అరాచకాలకు వ్యతిరేకంగా ఆర్య (అవినాష్) అనే విద్యార్థి గళం ఎత్తుతాడు. దాంతో ఆర్యని అడ్డు తొలగించుకోవాలని భావిస్తాడు శౌర్య ప్రసాద్. ఎన్కౌంటర్ శంకర్ (కాట్రాజు)ని దింపి చంపించాలనుకొంటాడు. ఆ పోలీస్ ఆఫీసర్నీ జాగ్వార్ చంపేస్తాడు. ఈలోగా జాగ్వార్‌కి సంబంధించిన ఓ కీలకమైన సమాచారం సీబీఐ ఆఫీసర్‌కి అందుతుంది. అదేంటి? ఆ జాగ్వార్ ఈ కృష్ణ ఒక్కడేనా? ఇదంతా ఎవరు చేస్తున్నారు? ఎందుకు చేస్తున్నారు? అనేదే ‘జాగ్వార్’ కథ.
దర్శకుడు ప్రేక్షకుల్ని కథలోకి తీసుకెళ్లిన విధానం ఆసక్తి రేపేలా ఉంటుంది. ‘జాగ్వార్’ ఎంట్రీతో పాటు సీబీఐ ఆఫీసర్ రంగ ప్రవేశం ఇలా అన్ని ఒకటి తర్వాత ఒకటి ఆకట్టుకునేలా ఉంటాయి. కథ ఎప్పుడైతే కాలేజీలోకి ఎంటర్ అవుతుందో అప్పటి నుంచి లైటర్లోకి వెళ్లిపోతుంది. మధ్య మధ్యలో జాగ్వార్ ప్రస్తావన ఇటు కాలేజీ సన్నివేశాలు వీటితో కాలక్షేపం అయిపోతుంది. కాలేజీ ఎపిసోడ్స్ కాస్త నెమ్మదిగా నడవడం, సాగదీతతో సాగటంతో ట్రాక్‌లోకి ఎక్కదు. అయితే జాగ్వార్‌కి సంబంధించిన ఎపిసోడ్స్ ఎప్పుడొచ్చినా మళ్లీ ఆసక్తి మొదలవుతుంది. యాక్షన్ సన్నివేశాల్ని ఆకట్టుకునేలా తెరకెక్కించారు. విశ్రాంతి ఘట్టం ద్వితీయార్థంపై అంచనాలు పెంచుతుంది.
ద్వితీయార్థం మొదలైనా జాగ్వార్ ఎవరు? ఇదంతా ఎందుకు చేస్తున్నారు? అనేది తెలియనివ్వలేదు. బ్రహ్మానందం పాత్రని రంగ ప్రవేశం చేయించి కామెడీ పిండాలనుకొన్నారు కానీ అది అతకలేదు. సినిమా మరో పది నిమిషాల్లో ముగుస్తుందనగా ‘ఇదీ అసలు కథ’ అని ఫ్లాష్‌బ్యాక్ చెప్పించారు. కథలో కొత్తదనం లేకున్నా భారీగా ఖర్చు చేసిన తీరు కనిపిస్తుంది. సినిమాలోని భారీతనం ప్రతీ ఫ్రేములోనూ కనిపిస్తుంది. లైవ్‌లో మర్డర్ చేయడం ఆసక్తి రేపేదే. కుక్క మందు కొట్టడం, బొమ్మలు వేయడం లాంటివి ప్రేక్షకుల్ని కన్విన్స్ చేసేలా ఉండవు.
హీరోకీ, విలన్‌కి మధ్య ఎపిసోడ్లు మరింత పోటాపోటీగా ఉంటే ఆకట్టుకునేలా ఉండేది. ఈ కారణంతోనే రసవత్తరంగా సాగాల్సిన పోరు వన్‌సైడ్ వార్‌లా మిగిలిపోయింది. ఇక, నిఖిల్ గౌడని హీరోగా చూపించాలన్న ప్రయత్నంతో భారీగా ఖర్చు పెట్టి తీశారు. మన హీరోల్ని చూడటం అలవాటైన తెలుగు ప్రేక్షకులకు నిఖిల్ అలవాటు కావటానికి సమయం పడుతుంది. నటన, డ్యాన్స్.. ఫైట్స్ అలా అన్నింటిలోనూ సంతృప్తికరమైన మార్కులే పడతాయి హీరోకి. ఈజ్ కూడా ఉంది. దీప్తి పాత్రలో కథానాయిక చేసిందేమీ లేదు. పాటల్లో మాత్రమే కనిపిస్తుంది.
జగపతిబాబుని సరిగా వాడుకోలేదు. సంపత్‌రాజ్, రావు రమేష్ ఆకట్టుకొంటారు. తమన్ ఇచ్చిన ఆర్.ఆర్. సన్నివేశాల్ని బాగా ఎలివేట్ చేసింది. పాటలు సో సోగా ఉన్నాయి. యాక్షన్ దృశ్యాలూ, ఛేజింగులు బాగా తెరకెక్కించారు. మనోజ్ హంస ఫొటోగ్రఫీ సినిమాకు కొండంత అండ. తెలిసిన కథే కావటం, కొత్తదనంగా ఫీల్ అయ్యే అవకాశం తక్కువ. ప్రారంభ సన్నివేశాలు, యాక్షన్ ఎపిసోడ్స్‌తోపాటు తమన్నా ప్రత్యేక గీతం ఆ చిత్రానికి బలమైతే, రొటీన్ కథ, కథనం బలహీనతలుగా చెప్పవచ్చు. ఈ సినిమాలో హీరో నిఖిల్‌కుమార్ కొత్తవాడైనా నటన పరంగా పరావాలేదనిపించాడు. డ్యాన్సులు, ఫైట్స్ పరంగా ఆకట్టుకున్నాడు. హీరోయిన్ దీప్తి సేథీ తనపాత్రకు న్యాయం చేసింది.
సిబిఐ ఆఫీసర్‌గా రగ్డ్ లుక్‌తో జగపతిబాబు నటన బావుంది. జగపతిబాబు సింపుల్‌గానే తన పాత్రలో ఒదిగిపోయాడు. ఇక ముఖ్యంగా చెప్పుకోవాల్సింది సంపత్‌నంది, ఆదిత్యమీనన్ గురించే. ఇలాంటి విలనీజాలను వీరు చాలా చిత్రాల్లో చేసుండటం వల్ల జాగ్వార్లో విలనీజంలో కొత్తగా కష్టపడిందేమీ లేదు. పాపులారిటీ పద్మనాభంగా బ్రహ్మానందం నవ్వించాలనే ప్రయత్నం పెద్దగా సక్సెస్ కాలేదు. రమ్యకృష్ణ చిన్న పాత్రలో కనపడి మెప్పించింది. హీరోయిన్ కేవలం పాటలకు మాత్రమే పరిమితమైపోయింది. దీప్తి పాత్రకు పెద్ద ఇంపార్టెన్స్ కనపడదు.
కార్పొరేట్ హాస్పిటల్స్‌లో జరిగే వైద్యం అనే పాయింట్‌తో పాటు, ఒక మెట్టు ఎక్కడానికి పదిమందికి మొక్కడానికైనా, వందమందిని తొక్కడానికైనా నేను రెడీ..అనే లైన్ బేస్ చేసుకుని విజయేంద్రప్రసాద్ కథను రాసుకున్నాడు. కథలో కొత్తదనం లేకపోవడం ప్రేక్షకుడికి నిరాశను కలిగిస్తుంది. అయితే మంచి టీం సపోర్ట్ తో సినిమాకు ఓ గ్రాండియర్ వచ్చింది. ముఖ్యంగా మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫీ ఎక్సలెంట్. ప్రతి ఫ్రేమ్‌లో రిచ్‌నెస్ కనపడింది. ముఖ్యంగా యాక్షన్ పార్ట్‌ను తనదైన సినిమాటోగ్రఫీతో మనోజ్ తెరపై అద్భుతంగా ఆవిష్కరించాడు.
చిన్నా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఆకట్టుకుంది. రూబిన్ ఎడిటింగ్ పరావాలేదు. కమర్షియల్ సినిమాకు తగిన విధంగా ఎడిటింగ్ వర్క్ స్రీన్‌పై కనపడుతుంది. తమన్నా స్పెషల్‌సాంగ్ బావుంది. థమన్ ట్యూన్ ఆకట్టుకోకపోయినా తమన్నా చమక్కులు అభిమానులను అలరిస్తుంది. థమన్ ట్యూన్స్ గందరగోళంగా ఉన్నాయి. అయితే చిన్నా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకు వెన్నుదన్నుగా నిలిచింది. మేకింగ్ వాల్యూస్ సూపర్బ్. బాహుబలి, భజరంగీ భాయ్‌జాన్ వంటి చిత్రాలకు కథను అందించిన విజయేంద్రప్రసాద్ వంటి రచయిత ఇలాంటి కథను అందించాడా అనే సందేహం కూడా సగటు ప్రేక్షకుడికి కలుగుతుంది.


