ఆ సంతోషం… క్రీడాకారులందరికీనా?
సచిన్ టెండూల్కర్ రిటైర్ అయిన మరుక్షణంలోనే భారతరత్న పురస్కారం వచ్చేసింది… సంతోషం! క్రీడాకారులు ఈ పురస్కారానికి అర్హులే అని చెప్పేందుకు తగు సవరణలు చేశారు ఇదివరకే… చాలా సంతోషం! అయితే క్రీడాకారుల విషయానికొస్తే టెండూల్కర్ కన్నా అర్హులు చాలామందే ఉన్నారు మన దేశంలో. టెండూల్కర్ క్రికెట్లో చాలా గొప్పవాడే కాదనలేము.. బోలెడన్ని రోజులు క్రికెట్ ఆడి.. ఇంకా బోలెడన్ని పరుగులు చేసి క్రికెట్ ప్రపంచంలో ఒక సంచలనం సృష్టించాడు.. అది ఎవరు కాదనలేము. అయితే క్రికెట్ ఏపాటి ఆట? ఎన్ని దేశాల్లో ఆడతారు? ఒలింపిక్స్‌లో కూడా అర్హత లేని ఆట.
క్రికెట్ ఆడే దేశాలు మహా అయితే నాలుగు పున్జీలు ఉంటాయేమో! మన జాతీయ క్రీడ హాకీ. అది ఎవరు కాదనలేని సత్యం. మరి హాకీని ఒలింపిక్స్‌లో ఒక ఊపు ఊపిన మహనీయులు ఎందరో ఉన్నారు. ధ్యాన్ చాంద్ అందులో అగ్రగణ్యుడు. సైన్యంలో పనిచేస్తూ దేశానికీ బంగారు పతకాలు సాధించడమే కాకుండా అతని అట చూసి ముగ్ధుడైన హిట్లర్ తన సేనలో చేరితే పెద్ద పదవి ఇచ్చి సత్కరిస్తానన్నప్పటికి దాన్ని తిరస్కరించిన దేశ భక్తుడు. హాకీలో క్రీడాకారుడు జట్టు కోసం ఆడతాడు, క్రికెట్లో వ్యక్తిగత ప్రతిభకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. సచిన్ ఇన్ని పరుగులు చేశాడు.. ఇన్ని ఇన్నింగ్స్ ఆడాడు లేదా ఈ రికార్డు బద్దలుకొట్టాడు అని అంటారే కానీ, సచిన్ వాళ్ళ జట్టు ఇన్ని సార్లు నెగ్గింది, ఇన్ని సార్లు ఓడింది అని ఎప్పుడూ అనరు.
భారతరత్న సచిన్‌కి ఇవ్వకూడదని కాదు వాదన, క్రీడాకారులని కూడా అర్హులుగా గుర్తించినప్పుడు, సచిన్ కంటే ముందు ధ్యాన్ చాంద్ ఉంటాడు. అతనికి ఈ సత్కారం జరిగిన తరువాతనే ఎవరికైనా జరగాలి. అందులో రెండు అభిప్రాయాలు ఉండడానికి వీలు లేదు. క్రికెట్లో గ్లామర్ ఉంది.. బహుమతి గ్లామర్‌కి కాకుండా ప్రతిభకి కదా ఇవ్వాల్సింది? అలాంటప్పుడు ధ్యాన్ చంద్ పేరు అగ్రభాగంలో ఉంటుంది. మన దేశానికీ గుర్తింపు తెచ్చిన వారిలో ధ్యాన్ చాంద్ తరువాత, పిటి ఉష, కరణం మల్లేశ్వరి, విశ్వనాథన్ ఆనంద్, కోనేరు హంపి… ఇలా చాలా పేర్లు వస్తాయి. ఎన్నికల ముందు యువతని ఆకర్షించడానికో, మరో మరో కారణానికో ఏమైనా చేయవచ్చు కానీ ధ్యాన్ చంద్‌ని మరఛి పోవడం నేరం. కొన్ని సందర్భాలలో అలా జరుగుతుంటుంది.
మన దేశానికి ఆఖరి వైస్రాయ్ గవర్నర్ జనరల్ చక్రవర్తి రాజగోపాలాచారి. మాములుగా అయితే రాష్ట్రపతి పదవికి ఆయనే అభ్యర్థి. కానీ కొన్ని విశేష కారణాల వలన ఆయన మద్రాస్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వెళ్ళవలసివచ్చింది. వరుసలో రెండో పేరైన రాజేంద్ర ప్రసాద్ రాష్ట్రపతి అయ్యారు. నెల్సన్ మండేలా, మదర్ థెరిసా, ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్ ప్రపంచంలో అందరికీ తెలుసు. అలాగే సచిన్ టెండూల్కర్ అందరికి తెలుసు అని అనుకుంటే అభ్యంతరం లేదు. రాజ్యసభ సభ్యత్వం ఇచ్చినా, మరో రకమైన సన్మానాలు చేసినా ఎవరికీ అభ్యంతరం ఉండదు. క్రీడలు ఇదివరకు భారత రత్న జాబితాలో లేవు. దాన్ని కొత్తగా చేర్చారు. అలాంటప్పుడు కళ్ళముందు కనిపించే వారేగాని పాత తరంలో క్రీడలకు సేవ చేసినవాళ్ళ గురించి పట్టించుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది.
సచిన్‌కి కూడా స్ఫూర్తినిచ్చిన క్రీడాకారులు ఉండే ఉంటారు. వారిలో ఆస్ట్రేలియాకు చెందినా డాన్ బ్రాడ్‌మన్ ఒకరు. బ్రిటిష్ రాజవంశం అతనికి నైట్ హుడ్ అంటే సర్ అనే బిరుదును ఇచ్చి సత్కరించింది. అతని తరువాత వెస్ట్ ఇండీస్ బాట్స్మన్ వివియన్ రిచర్డ్స్‌కి ఈ పురస్కారం లభించింది. సచిన్‌ను అమితంగా ఆదరించి, అభిమానించిన సునీల్ గవాస్కర్‌కు రిచర్డ్స్ ఆదర్శప్రాయుడు. సర్ అన్న బిరుదు బ్రాడ్‌మన్ తరువాత జాన్ హోబ్స్, జార్జ్ బ్రౌనింగ్, లేన్ హుంటన్, రిచర్డ్ హాడ్లీ, వెస్లీ హాల్స్, మన రాష్ట్రానికి చెందిన విజ్జి మొదలైన వారికీ లభించింది. కపిల్ దేవ్ భారతదేశ మువ్వన్నె జెండాను అంతర్జాతీయ క్రికెట్ సౌధం పైన ఎగురవేశాడు. మొదటి ప్రపంచ కప్ గెలుచుకుని రెండోసారి అవకాశం వచ్చినప్పుడు ఫైనల్స్‌లో సచిన్ ఘోరంగా విఫలమవడం వాళ్ళ ఆస్ట్రేలియా ఫైనల్ మ్యాచ్ గెలిచి కప్ కైవసం చేసుకుంది. మళ్లీ మహేందర్ సింగ్ ధోని నాయకత్వంలో ఆ కప్‌ని గెలుచుకుంది.
సచిన్‌కు సంబంధం ఉన్నా లేకున్నా క్రికెట్ జెంటిల్మెన్ గేమ్ కాదని తేలిపోయింది చాల ఏళ్ళ క్రితమే మ్యాచ్ ఫిక్సింగ్‌లు రావడంతో. ‘చక్ దే ఇండియా’ వంటి చిత్రాలు వచ్చి జాతీయ క్రీడ అయిన హాకీకి కొద్ది ఊరట కలిగించినా ధ్యాన్ చంద్‌ని విస్మరించి సచిన్‌కు భారత రత్న ఇవ్వడం ఎంత వరకు సబబో ఆలోచించవలసిన విషయం.


