ఇంజాపూర్‌లో దొంగలు బీభత్సం
హైదరాబాద్, సెప్టెంబర్ 30 (న్యూస్‌టైమ్): వనస్థలిపురం ఇంజాపూర్‌లో శుక్రవారం అర్థరాత్రి దోపిడి దొంగలు బీభత్సం సృష్టించారు. పురాతన శ్రీవెంకటేశ్వరస్వామి వారి ఆలయంలో దొంగలు చోరీ చేశారు. ఆ క్రమంలో అడ్డువచ్చిన వాచ్మెన్పై దాడి చేశారు. పురాతన పంచలోహ విగ్రహాలను అపహరించారు. అనంతరం వారు అక్కడి నుంచి పరారైయ్యారు. వాచ్మెన్ తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు స్పందించి సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని.. చోరీ జరిగిన తీరును పరిశీలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విగ్రహాలు చాలా పురాతనమైనవి అని స్థానికులు తెలిపారు. సొత్తు విలువ రూ. 1.50 లక్షలు ఉంటుందని అంచనా. గతంలో కూడా ఇదే తరహాలో ఈ దేవాలయంలో చోరీలు జరిగాయని, ఆ విగ్రహాలు ఇప్పటికీ రికవరీ కాలేదని పోలీసులు తెలిపారు.
జీహెచ్ఎంసీ ఉద్యోగి ఆత్మహత్య
హైదరాబాద్, సెప్టెంబర్ 30 (న్యూస్‌టైమ్): జీహెచ్ఎంసీ ఔట్సోర్సింగ్ ఉద్యోగి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన కేపీహెచ్‌బీ పోలీస్‌స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటుచేసుకుంది. కేపీహెచ్‌బీ కాలనీకి చెందిన ఎలిజాల బాలస్వామి కూకట్పల్లి సర్కిల్ కార్యాలయంలో ఎంటమాలాజీ విభాగంలో ఔట్స్సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. కాగా శుక్రవారం ఉదయం విధులకు హాజరైన బాలస్వామి రమ్య సెంటర్ సమీపంలోని వార్డు కార్యాలయంలో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీనిని గమనించిన తోటి ఉద్యోగి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఉన్నతాధికారుల వేధింపుల కారణంగా ఆత్మహత్యకు పాల్పడినట్లు మృతుని బంధువులు ఆరోపిస్తున్నారు. ఆర్ధిక ఇబ్బందులు, ప్రేమ వ్యవహారమే కారణమై ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
నటుడు చలపతిరావుకు అక్కినేని అవార్డు
హైదరాబాద్, సెప్టెంబర్ 30 (న్యూస్‌టైమ్): తెలుగు చలనచిత్ర రంగంలో నాలుగు దశాబ్దాలుగా తనకంటూ ప్రత్యేక శైలిని చాటుకున్న చలపతిరావు స్వయం కృషితో ఉన్నత స్థానానికి ఎదిగిన మనసున్న మంచి మనిషి అని రచయిత్రి డాక్టర్ నందమూరి లక్ష్మీ పార్వతి అన్నారు. తేజస్విని కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం త్యాగరాయ గానసభలో జరిగిన అక్కినేని గీతామృత వర్షిణి, అక్కినేని విశిష్ఠ పురస్కార ప్రదానోత్సవ సభకు ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నాలుగు తరాల నటులతో నటించే అరుదైన అవకాశం చలపతి రావుకు దక్కిందన్నారు. ఆయన క్రమశిక్షణ నేటి యువ నటులకు ఆదర్శమన్నారు. డాక్టర్ ఓలేటి పార్వతీశం మాట్లాడుతూ స్వర్గీయ ఎన్.టి.ఆర్కు అత్యంత సన్నిహితులైన చలపతిరావు విలన్‌గా, కారెక్టర్ నటుడిగా ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్నారన్నారు. అనంతరం చలపతిరావును అక్కినేని విశిష్ట పురస్కారంతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో డాక్టర్ కె.వి.కృష్ణకుమారి, జె.నారాయణ రావు, డాక్టర్ విజయలక్ష్మి, రవికుమార్, యస్.యన్.సుధారాణి, పురస్కార గ్రహీత చలపతిరావు తదితరులు పాల్గొన్నారు.


