ఇంధనపొదుపుపై సామాన్యుల్లోనూ అవగాగహన: కలెక్టర్
ఏలూరు, డిసెంబర్ 14 (న్యూస్టైమ్): పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రతీ ఇంటా విద్యుత్తు పొదుపు చేసే ఫ్యాన్లు, యల్ఇడి లైట్ల వినియోగాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించడానికి త్వరలోనే ఒక పటిష్టప్రణాళిక అమలు చేస్తామని, తద్వారా 40 శాతం వరకూ విద్యుత్తును ఆదాచేయగలుగుతామని జిల్లా కలెక్టరు డాక్టర్ కాటంనేని భాస్కర్ చెప్పారు. స్ధానిక కలెక్టరు కార్యాలయం వద్ద బుధవారం ఇంధనపొదుపు వారోత్సవాల ర్యాలీని కలెక్టరు ప్రారంభించారు. ఈ సందర్భంగా భాస్కర్ మాట్లాడుతూ విద్యుత్తుత్పతిలోనూ, పొదుపులోనూ ప్రపంచవ్యాప్తంగా పోటీతత్వం పెరిగిందని ప్రతీ మనిషీ విద్యుత్తు పొదుపుచర్యలు చేపట్టి సమాజంలో ఇతరులకు విద్యుత్తుకాంతులు అందేలా సహకరించాలని కోరారు.
జిల్లాలోని 10.48 లక్షల గృహవినియోగదారులకు గతేడాది 2 యల్ఇడి బల్భ్లను ప్రతీఇంటా ఉచితంగా అందజేసామని ఈఏడాదికూడా ప్రతీ ఇంట్లో వినియోగించే బల్భ్లన్నీ యల్ఇడిగా మార్పు చేయాలని నిర్ణయించామని అయితే యల్ఇడి బల్భ్ల ఉత్పత్తిలో జాప్యంవల్ల బల్భ్లపంపిణీ సాధ్యపడలేదని త్వరలోనే ప్రతీ ఇంటా యల్ఇడి బల్భ్ల వినియోగాన్ని పెంచుతామని కలెక్టరు చెప్పారు. జిల్లాలో ప్రస్తుతం నరసాపురం డివిజన్ పరిధిలో తక్కువ విద్యుత్తు వినియోగంతో హైస్పీడ్ ఫ్యాన్ల వినియోగాన్ని ప్రోత్సహిస్తున్నామని త్వరలోనే జిల్లా వ్యాప్తంగా తక్కువ విద్యుత్తు వినియోగంతో పనిచేసే ఫ్యాన్లను ప్రోత్సహిస్తామని కలెక్టరు చెప్పారు.
జిల్లాలోనూరు శాతం ఇళ్లకు విద్యుత్తు కనెక్షన్లు అందించడంలో భారతదేశంలోనే అగ్రస్ధానంలో నిలిచామని క్రొత్తగా కట్టే ఇళ్లకు కాలనీలకు అక్కడికక్కడే కనెక్షన్లు అందించి నూరుశాతం గృహావసర కనెక్షన్లు అందించే విధానాన్ని నిరంతరం కొనసాగించాలని డా. భాస్కర్ చెప్పారు. జిల్లాలోని పురపాలకసంఘాల పరిధిలో వీధిలైట్లన్నీ యల్ఇడి బల్భ్లుగా మార్పు చేసామని అదేవిధంగా జిల్లాలోని 902 పంచాయతీలలో కూడా వీధిలైట్లను యల్ఇడి పరిధిలోనికి తీసుకువచ్చి విద్యుత్తు పొదుపును ప్రోత్సహిస్తామని కలెక్టరు చెప్పారు.
జిల్లాలో లోఓల్టేజీ సమస్యలేకుండా నాణ్యమైన విద్యుత్తును ప్రజలకందించేందుకు ట్రాన్స్కో ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని కలెక్టరు చెప్పారు. పోలవరం ప్రాజెక్టు పూర్తయితే 900 మెగావాల్ట్ల జలవిద్యుత్తును ఉత్పత్తి చేసే పరిస్ధితులు ఏర్పడతాయని తద్వారా భవిష్యత్తులో విద్యుత్తు కోత ఉండబోదని డా. భాస్కర్ చెప్పారు. పశ్చిమ గోదావరి జిల్లాలో వ్యవసాయ వినియోగదారులకు 4.29 లక్షల రూపాయల విలువైన సోలార్ విద్యుత్తు మోటారును రైతుకు కేవలం 55 వేల రూపాయలకు మాత్రమే అందించే నూతన విధానాన్ని అమలు చేస్తున్నామని రైతులు సోలార్ విద్యుత్తు పంపుసెట్లు వైపు దృష్టి కేంద్రీకరించాలని కలెక్టరు చెప్పారు.
జిల్లాలో సోలార్ విద్యుత్తును పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తామని ఇటీవల 5 మెగావోల్ట్ల సోలార్ విద్యుత్తు ఫ్లాంటును ముఖ్యమంత్రి చంద్రబాబు జిల్లాలో ప్రారంభించారని మరికొన్ని క్రొత్త సోలార్ ప్రాజెక్టుల రూపకల్పనకు చర్యలు తీసుకుంటున్నామని భాస్కర్ చెప్పారు. ప్రభుత్వ కార్యాలయాల్లో, వీధిలైట్ల నిర్వాహణలో నిర్లక్ష్యం కనిపిస్తోందని విద్యుత్తును పట్టపగలుకూడా వినియోగిస్తున్నారని దీనివలన ఒకవైపు డబ్బు వృధా మరోవైపు విద్యుత్తుకూడా ఎ ంతో నష్టపోతున్నామని కలెక్టరు చెప్పారు.
వీధిలైట్ల నిర్వాహణ తీరును రాష్ట్రవ్యాప్తంగా డిజిటలైజేషన్ చేయడం జరిగిందని అదేవిధంగా గ్రామపంచాయతీల వీధిలైట్ల నిర్వాహణకూడా డిజిటలైజేషన్ చేసి ఒక క్రమపద్ధతిలో వీధిలైట్లను ఆన్ అండ్ ఆఫ్ చేసే ప్రక్రియ అమలు చేస్తామని డా. భాస్కర్ చెప్పారు. ప్రభుత్వ కార్యాలయాలలో అవసరంమేరకే లైట్లు, ఫ్యాన్లు, కంప్యూటర్లు వినియోగించుకోవాలే తప్ప వృధాగా వాటిని వదిలివెళ్లరాదని డా. భాస్కర్ హితవు పలికారు. ట్రాన్స్కో యస్ఇ సిహెచ్. సత్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ ఒక యూనిట్ విద్యుత్తును పొదుపుచేస్తే రెండు యూనిట్ల విద్యుత్తును ఉత్పత్తి చేసినట్లవుతుందని కావున ఇంధన పొదుపును ప్రతీఒక్కరూ బాధ్యతగా పాటించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో నెడ్ క్యాప్ డియం ప్రసాద్, ట్రాన్స్కో డిఇ అంబేద్కర్, నాగేశ్వరరావు, సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు. ఈ ర్యాలీ కలెక్టరు కార్యాలయం నుండి ఆర్అండ్బి, ఫైర్ స్టేషన్ సెంటర్ మీదుగా ట్రాన్స్కో యస్ఇ కార్యాలయానికి చేరుకుంది.


