ఇక తెలుగులోనూ డొమైన్ నేమ్!
- 80 Views
- wadminw
- January 8, 2017
- Home Slider అంతర్జాతీయం
అవును. ఇకమీదట దేశీయంగానే కాదు, అంతర్జాతీయంగా కూడా మాతృ భాషలో డొమైన్ బుక్ చేసుకునే వెసులుబాటు మరింత సులభతరం కానుందట. ఇప్పటికే ఈ విధానం ప్రయోగాత్మకంగా అమలులోకి వచ్చినప్పటికీ ఆంగ్లంలోనే ఎక్కువగా పేర్లను వినియోగించడం జరుగుతోంది. అభివృద్ధి చెందిన దేశాలలో కూడా ఇదే విధానాన్ని అనుసరిస్తుండడంతో ప్రాంతీయ భాషల్లో డొమైన్లు పెద్దగా విస్తరించలేదు. ఇళ్లకి చిరునామాలు లేదా విలాసాలు ఉన్నట్లే ఈ వెబ్ సైట్లకి (ఆటపట్లకి) కూడా చిరునామాలు ఉంటాయి.
చిరునామాలో వ్యక్తి పేరో, సంస్థ పేరో ఉండడమే కాకుండా, ఊరు పేరు దేశం పేరు ఉంటాయి అన్న విషయం మరచిపోకండి. వెబ్ సైట్ల చిరునామాని ఇంగ్లీషులో యూనివర్సల్ రిసోర్స్ లొకేటర్ (యూఆర్ఎల్) అంటారు. ఉదాహరణకి ఏదో ఒక వెబ్సైట్ను తీసుకుంటే అందులో హెచటీటీపీ అనేది ఇది ఏ రకం వెబ్ సైటో చెబుతుంది. అంటే వెబ్ సైట్లలో రకాలు ఉంటాయన్నమాట. తరువాత వచ్చే ://ది చూడగానే కంప్యూటర్ (బ్రౌజర్) రాబోయేది ఒకానొక రకం వెబ్ సైటు విలాసం అని తెలుసుకుంటుంది.
ఈ విలాసంలో మాటకీ మాటకీ మధ్య చుక్కలు మాత్రమే ఉండొచ్చు (కామాలు, కోలన్లు, వగైరా విరామ చిహ్నాలు నిషిద్ధం). తరువాత వెబ్ సైటు పేరు. తరువాత చుక్క, ఆ చుక్క తరువాత మన సైట్ ఏ రకానికి చెందినదన్నది వెల్లడిస్తుంది. ఉదాహరణకు ‘ఆర్గ్’ (ఒఆర్జి) అంటే ఇది ఏ రకం సంస్థో చెబుతోందన్న మాట. దీనిని ఇంగ్లీషులో డొమైన్ నేం అంటారు. తెలుగులో ఇలాకా పేరు అందాం. ఇలాకా అంటే అధికార పరిధి అని అర్థం. ఎక్కువ తరచుగా తారసపడే ఇలాకా పేరు డాట్ కాం. దీనిని వ్యాపార సంస్థలకి కేటాయించారు.
విద్యాసంస్థలు వాడే ఇలాకాని డాట్ ఇడియు అంటారు. అమెరికా సంయుక్త రాష్ట్రాలకి బయట ఇలాకా పేరు తరువాత ఆయా దేశాల పేర్లు, రెండక్షరాల సంక్షిప్తం రూపంలో వాడతారు. ఇండియాలో ఉన్న సంస్థల పేర్ల చివర డాట్ ఇన్ అని ఉండడం గమనించే ఉంటారు. సాధారణంగా పైన ఉదహరించిన యూఆర్ఎల్ చివర ఇండెక్స్.హెచ్టీఎంఎల్ అని మరొక అంశం ఉండొచ్చు. ఒక వెబ్ సైట్లో ఎన్నో పుటలు పుస్తకరూపంలో అమర్చి ఉన్నాయని అనుకుందాం. అపుడు విలాసం మాత్రమే వాడితే ఆ పుస్తకంలో మనం ఏ పేజీకి వెళ్లాలో నిర్ద్వందంగా చెప్పలేదు కనుక కంప్యూటరు మనని విషయసూచిక ఉన్న పేజీకి తీసుకెళుతుంది. ఈ విషయసూచిక ఉన్న పేజీ పేరే ఇండెక్స్.హెచ్టీఎంఎల్.
ఇక నుంచి తెలుగులోనూ వెబ్సైట్ డొమైన్ పేరు రాసుకోవచ్చు. విదేశీ డొమైన్లపై లాభాపేక్షలేని సంస్థ ద ఇంటర్నెట్ కార్పొరేషన్ ఫర్ ఆసియాన్డ్ నేమ్స్ అండ్ నంబర్స్ (ఐసీఏఎన్ఎన్) భారత్కు చెందిన ఏడు భాషలకు ఆమోదం తెలిపింది. ఆంగ్లేతర భాషల్లోనూ డొమైన్ల పేర్లకు ఆహ్వానం పలికిన ఆ సంస్థ తెలుగు, హిందీ, తమిళం, బెంగాలీ, ఉర్దూ, గుజరాతీ, పంజాబీ బాషలనూ అనుమతించింది.


