ఇరిగేషన్ డిప్యూటీ ఎస్ఈపై కలెక్టర్ ఆగ్రహం
ఏలూరు, సెప్టెంబర్ 4 (న్యూస్‌టైమ్): ‘బండివారిగూడెం ఎక్కడ ఉంది. ఆ గ్రామంలో 128 ఎకరాల భూమి సేకరించి గాయత్రీ ఏజెన్సీకి అప్పగించగా అక్కడ పని జరుగుతుందా? లేదా? అని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టరు డాక్టర్ కాటంనేని భాస్కర్ పోలవరం కుడికాల్వ ఎస్ఇ తరపున సమావేశానికి హాజరైన ఇరిగేషన్ కార్యాలయ డిప్యూటీ సూపరింటెండింగ్ ఇంజినీరు కె. రాజును ప్రశ్నించగా బండివారిగూడెం గ్రామం ఎక్కడ ఉంటుందో నాకు తెలియదు. ఆఫీసులో ఉంటా. ఎస్ఇ వెళ్లమంటే మీటింగ్‌కు వచ్చానని రాజు సమాధానం చెప్పడంతో కలెక్టరు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. స్ధానిక కలెక్టరు కార్యాలయంలో చింతలపూడి ఎత్తిపోతల పధకం పనుల ప్రగతితీరుపై కలెక్టరు సమీక్షించారు.
సమాధానం చెప్పనప్పుడు సరైన అవగాహనతో మీటింగ్‌కు రావడం దేనికి ఇటువంటి వారు సమీక్షా సమావేశాలకు హాజరు కావద్దని ఎవరైనా జిల్లా అధికారి స్ధానే దిగువుస్ధాయి అధికారులు వస్తే పూర్తి స్ధాయి సమాచారంతో రావాలేతప్ప మొక్కుబడిగా సమావేశానికి హాజరుకావడం ఎందుకని కలెక్టరు ప్రశ్నించారు. జిల్లాలో సేద్యపునీటి ప్రాజెక్టులకు సంబంధించి అవసరమైన డిజైన్లను రూపొందించడానికి వారంవారం సమీక్షించేందుకు ప్రత్యేక ప్రణాళిక కాపీని ఈ సమావేశానికి తీసుకురమ్మని పోలవరం కుడికాల్వ యస్ఇ శ్రీనివాసయాదవ్‌ను కోరామని ఆయనస్ధానే సమావేశానికి వచ్చినందున అందుకు సంబంధించిన ప్రణాళిక కాపీని తీసుకువచ్చారా అని కలెక్టరు రాజును ప్రశ్నించగా సాఫ్ట్ కాపీ కంప్యూటర్లో ఉందని ప్రింట్లు తీయడం కుదరక తీసుకురాలేదని రాజు సమాధానం చెప్పడంతో భాస్కర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇంతకన్నా హేయమైన సమాధానం మరొకటి ఉండదని, స్కూలులో పిల్లవాడు కూడా ఇటువంటి నిర్లక్ష్య సమాధానం చెప్పరని కలెక్టరు అన్నారు.
మీటింగ్‌కు పూర్తి స్ధాయిలో సమాచారంతో పంపించనందుకు యస్ఇ యాదవ్‌పై ఎందుకు చర్యతీసుకోరాదో సంజాయిషీ నోటీసు జారీ చేయాలని ఈ మేరకు ఇయన్సికి డిఓలెటరు పంపించాలని కలెక్టరు డిఆర్ఓ కె. ప్రభాకరరావును ఆదేశించారు. బుట్టాయిగూడెం తహశీల్ధారు పనితీరుపై కూడా కలెక్టరు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. గతరెండు సమావేశాలకు ఎందుకు హాజరుకాలేదని ఇంత నిర్లక్ష్యంతో విధులు నిర్వర్తిస్తే ఎలా అంటూ కలెక్టరు ప్రశ్నించారు. తాను 12 ఏళ్లుగా ఉద్యోగం చేస్తున్నాని ఒకరోజున కూడా ఉన్నతాధికారులు నిర్వహించే సమావేశానికి గైర్హాజరు కాలేదని కలెక్టరు పదవిలో ఉన్నా ఈ రోజుకూ బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తిస్తున్నామని ఉద్యోగమంటే లెక్కలేదా అని కలెక్టరు తహశీల్ధారును ప్రశ్నించారు. బాధ్యతారాహిత్యంగా ఉద్యోగం చేస్తున్న బుట్టాయిగూడెం తహశీల్ధారుపై చర్యలకు తగు నివేదిక సమర్పించాలని భాస్కర్ డిఆర్ఓను ఆదేశించారు.


