ఉగ్రవాద భూతాన్ని పోషిస్తున్నదెవరు?
- 160 Views
- wadminw
- January 14, 2017
- Home Slider అంతర్జాతీయం
పట్టపగలు బాంబులు పేలుతున్నాయి. తుపాకులు బుల్లెట్ల వర్షం కురిపిస్తున్నాయి. నడిరోడ్డు మీద రెచ్చగొట్టే ఉపన్యాసాలు దంచుతున్నారు. ఆ గడ్డమీదే ఉగ్రనేతలంతా అడ్డాలు వేసుకు బతికేస్తున్నారు. కానీ, పెద్దన్నకు పాకిస్తాన్ ఉగ్రవాదం మాత్రం కనిపించలేదు. పైగా, ఉగ్రవాదాన్ని అదుపులో పెడుతున్నారంటూ, కితాబులు కుమ్మరిస్తున్నారు. వాస్తవంగా పరిస్థితి అలాగే ఉందా? పాకిస్తాన్ చిత్తశుద్ధితో ఉగ్రవాదాన్ని నిర్మూలించిందా? లష్కర్-ఇ-తోయిబా, జైష్-ఇ-మహ్మద్ లాంటి సంస్థలు పొలిమేరలు దాటి పారిపోతున్నాయా?
ఇందులో వాస్తవం ఎంత? డిసెంబర్ 17, 2014 ఈ ఘటన ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసింది. అందరి మనసులనూ కదిలించింది. ఇక్కడ ఓ నగరం నెత్తుటిలో మునిగిపోయింది. ఒక స్కూలు రక్తప్రవాహంలో కొట్టుకుపోయింది. యూనిఫాంలో వున్న 132 పువ్వులు, అమ్మనో నాన్ననో పిలుస్తూ గాల్లో కలిసిపోయాయి. అవును పెషావర్ నెత్తుటి మడుగైంది. మీరు చూసింది చిన్న ఉదాహరణ మాత్రమే. పాకిస్తాన్లో నిత్యం పేట్రేగుతున్న ఉగ్రమూకల అరాచకాల్లో ఒకటి మాత్రమే. ఇలాంటివి పాకిస్తాన్ గడ్డ మీద ఏదో ఒక మూల నిత్యం జరుగుతూనే ఉన్నాయి.
మరి అమెరికాకు ఈ దారుణాలెందుకు కనిపించటం లేదు. స్వదేశంలోనే కాదు… పక్కదేశాలపై ఎలాంటి అఘాయిత్యాలకు తెగబడుతున్నారో అమెరికా కళ్లకు కనిపించకపోవటం మరీ విచిత్రం. రగులుతున్న పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దు ప్రాంత గ్రామాలు ఒక ఎత్తయితే ఇటు భారత్‌ను కవ్విస్తూ, బెదిరింపు కాల్స్ చేస్తూ, చొరబాట్లకు దిగే ఘటనలు మరో ఎత్తు. వీటన్నిటినీ వదిలేసి అమెరికా, పాకిస్తాన్ పాట పాడటం అమెరికా విధానాలకు నిలువుటద్దమనే వాదనలు వినిపిస్తున్నాయి. ఉగ్రవాదమంటూ మొదలయ్యాక దానికి ఎల్లలుండవు.
పెంచి పోషించిన అమెరికా, పాక్‌లకు చావుదెబ్బలు రుచి చూపిస్తున్న టెర్రరిస్టుల హిట్ లిస్టులో భారత్ కూడా ఉందని ఎన్నో సార్లు వార్తలు వినిపించాయి. గత నవంబర్‌లో వాఘా సరిహద్దు ప్రాంతంలో ఆదివారం జరిగిన ఆత్మాహుతి దాడిలో 57మంది పాకిస్తాన్ ప్రజలు చనిపోయారు. భారత్ పాక్ సరిహద్దులో జరిగినదాడి వెనుక కారణాలు కచ్చితంగా అనుమానించదగ్గవే. భారత్‌పై పెద్ద ఎత్తున దాడి చేస్తామని తాము ఇదివరకే తెహ్రీక్ ఎ తాలిబన్ పాకిస్తాన్ జమాత్ అహ్ర్ సంస్థ అధికార ప్రతినిధి, కరడుగట్టిన ఉగ్రవాది ఇషానుల్లా ఇషాన్ ప్రకటించేశాడు.
భారత్‌కు ఇవతలి వైపు దాడి చేయగలిగిన తమ ఆత్మాహుతి దళ సభ్యులు అవతలి వైపు కూడా దాడి చేయగలరని హెచ్చరించాడు. అంతే కాదు ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్లలో ప్రభుత్వాలు బలహీనంగా ఉండడం, అక్కడ సంస్థలు పైచేయి సాధించటం భారత్‌కు ఏమాత్రం క్షేమకరం కాదు. పక్కలో బల్లెంలాంటిదే. ఆ రెండు దేశాలలోనూ తాలిబన్ల ప్రాబల్యం దానందట అది సమసిపోయే అవకాశాలు పెద్దగా కనిపించటం లేదు. ఇక ఉగ్రవాద ముఠాల విషయంలో పాకిస్థాన్ సైన్యం, ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి కూడా ఉగ్రవాదం పెరగటానికి దోహదపడుతోంది.
ఎప్పటినుంచో మన దేశంలో ఉగ్రవాద చర్యలకు పాల్పడుతున్న లష్కరే తొయిబా, హిజ్బుల్ ముజాహిదీన్, జైషే మహమ్మద్, ఇండియన్ ముజాహిదీన్ వంటి సంస్థలున్నాయి. వీటన్నిటికి తోడు ఇరాక్‌లో నరమేధం సాగిస్తున్న ఐఎస్ ఉగ్రవాదులు కూడా భారత్‌ను టార్గెట్ చేసినట్టు వార్తలొస్తున్నాయి. పైగా ఇక్కడి యూత్ ఆ సంస్థకు ఆకర్షితులవుతున్నట్టు ఆధారాలు కూడా ఉన్నాయి. మరోపక్క తాలిబన్లకు, ఐఎస్ సత్సంబంధాలే ఉన్నాయి. ఇవన్నీ భారత్‌కు ఉగ్ర ప్రమాదం పొంచి ఉందనే సంకేతాలిస్తున్నాయి.
డిసెంబర్ 31, 2014 అర్ధరాత్రి సమయంలో పోర్బందర్ తీరానికి సరిగ్గా 365 కిలోమీటర్ల దూరంలో పాక్ వైపు నుంచి ఓ బోటు అనుమానాస్పదంగా వస్తోంది. గమనించిన కోస్ట్ గార్డ్ సిబ్బంది ఆ బోటును వెంటనే ఆపాల్సిందిగా హెచ్చరికలు జారీచేశారు. కానీ బోటులో ఉన్నవాళ్లు వినిపించుకోలేదు. చివరికి తమను తాము పేల్చేసుకున్నారు. ఈ ఫిషింగ్ బోటులో మొత్తం నలుగురు వ్యక్తులు, భారీ మొత్తంలో పేలుడు పదార్థాలు ఉన్నాయి. కరాచీ సమీపంలోని కేతిబందర్ ప్రాంతం నుంచి ఈ బోటు బయల్దేరినట్లు భారత వర్గాలు గుర్తించాయి.
ఈ బోటు ముంబయి తరహా దాడులు పాల్పడటానికే వచ్చిందా? ముష్కరులు మరోసారి తెగబడే ప్రయత్నం చేస్తున్నారా? అవుననే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. బోట్ సంగతి అటుంచితే, కాందహార్ ఘటన రిపీట్ కానుందా? అవునని ఇంటెలిజెన్స్ రిపోర్టులు చెప్తున్నాయి. విమాన హైజాకింగ్‌కు ఉగ్రవాదులు పథకాలు రచిస్తున్నారని వచ్చిన ఇంటెలిజెన్స్ రిపోర్టులు సంచలనం కలిగిస్తున్నాయి. ముఖ్యంగా ఢిల్లీ-కాబూల్ విమానాల విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలని, పూర్తిస్థాయి తనిఖీల అనంతరమే విమానాన్ని ప్రయాణానికి అనుమతించాలని చేయాలని సూచిస్తున్నారు.
ముందు జాగ్రత్త చర్యగాఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో జాతీయ భద్రతా దళానికి చెందిన బ్లాక్ క్యాట్ కమెండో యూనిట్ మోహరించింది. ఇది అటు పాకిస్తాన్లో ఇటు భారత్‌లో జరుగుతున్న ఉగ్రవాద కార్యకలాపాల ఆనవాళ్లు రక్తపు మరకలు. మరి ఇవన్నీ వదిలేసి జాన్ కెర్రీ పాకిస్తాన్‌కు కితాబివ్వటం హాస్యాస్పదమని విశ్లేషకులు భావిస్తున్నారు. డిసెంబర్ 24, 1999, ఇండియన్ ఎయిర్ లైన్ ఫ్లైట్-814నలుగు ఉగ్రవాదుల చేతిలో హైజాక్‌కు గురైన భారత విమానం, అమృత్సర్, లాహోర్, దుబాయ్ మీదుగా చివరికి కాందహార్‌లో ల్యాండయింది.
మొత్తం 176 మంది ప్రయాణికులున్న ఈ విమానాన్ని అడ్డం పెట్టుకుని భారత్‌లోని జైళ్లలో ఉన్నా ఉగ్రవాదులన్ని విడిపించుకునే ప్రయత్నం చేశారు తాలిబన్లు. చివరికి ముగ్గురు కరడు గట్టిన టెర్రరిస్టులను విడుదల చేయించుకోగలిగారు. విడుదలయిన వారిలో ఒకడైన మౌలానా మసూద్ అజహర్ ఆ తర్వాత కాలంలో జైష్ ఇ మహ్మద్ సంస్థ స్థాపించి భారత్‌కు తలనొప్పిగా తయారయ్యాడు. ఇక ముంబై దాడుల సంగతి 26/11, ముంబయి ఘటన. సముద్ర మార్గంలో ముంబయి తీరం చేరిన పదిమంది ముష్కరులు నవంబర్ 26, 2008 నుంచి మూడు రోజుల పాటు మారణ హోమం సృష్టించారు. 173 మంది చనిపోతే, మూడొందల మందికి పైగా గాయాలపాలయ్యారు.
ఈ రెండు ఘటనలు భారత చరిత్రలో చెరిగిపోని రక్తపు మరకలు. మరి ఇప్పుడు జరుగుతున్న ఘటనలు ఇలాంటివి మళ్లీ జరుగుతాయనే సంకేతాలిస్తున్నాయా? పోరుబందర్ తీరంలో కనిపించిన బోటు, కోల్‌కతా విమానాశ్రయానికి వచ్చిన ఫోన్ కాల్ ఏం చెప్తున్నాయి. త్వరలో జరగనున్న ఒబామా పర్యటన టార్గెట్‌గా విధ్వంసానికి ప్రయత్నాలు జరుగుతున్నాయా? అవుననే వాదనలే బలంగా వినిపిస్తున్నాయి. అమెరికా తన స్వార్ధ రాజకీయాల కోసం అనేక దేశాల్లో చిచ్చుపెడుతోంది.
ఉగ్రవాదాన్ని అణచి వేసే పేరుతో పరిస్థితిని తనకు అనుకూలంగా మార్చుకుంటూ అంతిమంగా ఉగ్రవాదాన్ని రెట్టింపు చేస్తోంది అమెరికా. లక్షలాది మంది ఇరాక్ పౌరులు ప్రాణాలు పోగొట్టుకుంటున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఇటు ఆఫ్ఘనిస్తాన్ విధ్వంసం చూస్తున్నాం. పసిపిల్లలకు మందులు కనీసం పాలు కూడా దొరకని పరిస్థితిని అమెరికా కల్పించింది. సిరియాలో ప్రభుత్వం అమెరికాకు వ్యతిరేకంగా నిలబడినందుకు ప్రభుత్వాన్ని కూలదోయడానికి మతోన్మాదులను ప్రోత్సహిస్తోంది అమెరికా.
ఏ దేశం చూసినా ఇప్పుడు అదే పరిస్ధితి. స్వార్ధ రాజకీయ ప్రయోజనాల కోసం, అక్కడి బహుళ జాతి కంపెనీల ప్రయోజనాల కోసం అమెరికా ఆయా దేశాల హక్కులను ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడం సాధారణంగా మారింది. ఇలాంటి సందర్భంలో పాకిస్తాన్‌ను పావులా వాడుకుంటూ, ఉగ్రవాదాన్ని పెంచి పోషించే పాకిస్తాన్‌కు వంతపాడుతోంది అమెరికా. ఒక్కమాటలో చెప్పాలంటే పాకిస్తాన్లో ప్రభుత్వాలను నడిపిస్తున్నదే అమెరికా. కీలుబొమ్మ సర్కార్లను అడ్డం పెట్టుకుని, ఉగ్రవాదానికి అవసరమైనపుడు వంతపాడి, అవసరం తీరాక అంతం చేయాలనే విఫలయత్నాలు అమెరికాకు అలవాటుగా మారాయి.
ఒసామా బిన్ లాడెన్‌ను ఒకప్పుడు ప్రోత్సహించి చివరికి అంతం చేసిందాకా నిద్రపోలేదు. ఇప్పుడు కూడా పాకిస్తాన్ వేసే ప్రతి అడుగు వెనుకా అమెరికా వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. ఈ రెండు ముఖాలు భారత సర్కారుకు తెలిసినా నోరు మెదపదని పరిశీలకుల అభిప్రాయం. ఇక ఉగ్రవాదులపై పాక్ సైన్యం అడపా దడపా చేసే దాడులకే అమెరికా భుజం తట్టి వందల కోట్లు గ్రాంట్ ఇవ్వటం మరింత విడ్డూరం. పైగా చిత్త శుద్ధిగా ఉగ్రనిర్మూలన చేస్తున్నదని జాన్ కెర్రీ స్టేట్ మెంట్ ఇవ్వటం ఇంకా విచిత్రం.
కానీ, పెషావర్ ఘటన ఎందుకు జరిగిందో, లాహోర్ నడివీధిలో భారత్ కు వ్యతిరేకంగా స్టేట్ మెంట్లిచ్చిన ఉగ్రవాద నేతల సంగతులు అమెరికా కనుసన్నలను దాటి జరుగుతాయా అనే ప్రశ్న రావటం సహజాతి సహజం. కానీ ఈ ప్రశ్నలకు సమాధానం ఉండదు. వివిధ దేశాల్లో ఉగ్రవాద సంస్థలకు అండదండలందిస్తున్న అమెరికా నిజాల్ని గ్రహించకపోతే మరో ట్విన్ టవర్స్ లాంటి విషాదం జరగదని గ్యారంటీ ఏంటి? ఓ వైపు ఉగ్రవాద వ్యతిరేక పోరాటం చేస్తానంటూనే మరోవైపు వివిధ దేశాల్లో స్థానిక ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఉగ్రవాద ముఠాలు సాగించే తిరుగుబాట్లను అమెరికా ప్రోత్సహిస్తున్నతీరు అనేక దేశాల్లో అశాంతిని రాజేస్తోంది. విధ్వంసాన్ని, మారణ హోమాన్ని సృష్టిస్తోంది.
ఉగ్రవాద మూకలతో అమెరికా ఆడుతున్న డేంజర్ గేమ్‌ను సరిగా అర్ధం చేసుకోలేకపోతే రేపు మరోచోట మరో ఘోరం జరుగుతుంది. ఐక్యంగా పోరాటం చేస్తే తప్ప ఉగ్రవాదం అంతం కావడం అసాధ్యం. ఉగ్రవాదం తమ లక్ష్యాలుగా ఏం చెప్పుకున్నా, ఏ మతం పేరు పెట్టుకున్నా దానికి జాతి, మత, ప్రాంతాలనేవి ఉండవు. విచక్షణాజ్ఞానం అసలే ఉండదు. ఎలాంటి ద్వంద్వ విధానమైనా, ప్రపంచ శాంతికి భంగకరమే. ఇప్పుడు అమెరికా నోటితో నవ్వుతూ, నొసటితో వెక్కిరించే ధోరణి ఏ దేశానికీ, ఆఖరికి అమెరికాకు కూడా క్షేమకరం కాదు. సరిహద్దులో పేలుళ్లు, తీరంలో బోట్లు, హైజాక్ కాల్స్ ఇవన్నీ భారత్‌ను మాత్రమే కాదు, అన్ని ప్రపంచ దేశాలనూ హెచ్చరిస్తున్నాయి.


