గల్ప్ మోసాలపై గళమెత్తిన ‘ఒబ్బిలిశెట్టి’
- 85 Views
- wadminw
- October 5, 2016
- అంతర్జాతీయం
విశాఖపట్నం, అక్టోబబర్ 5 (న్యూస్‌టైమ్): గల్ఫ్ కు వర్కర్లను పంపించే ఏజెంట్లలో 95 శాతం మంది లైసెన్సులు ఉన్నవారేననీ, మిగతా అయిదు శాతం మందీ స్వార్ధంతో అబద్ధాలు చెప్పి జనాన్ని అక్కడకు ఏదో రకంగా పంపి చేతులు దులుపుకుంటున్నారనీ దుబాయి కేంద్రంగా న్యాయ సేవలు అందించే సంస్థలో పనిచేస్తున్న తెలుగు మహిళ, సామాజిక సేవకురాలు ఒబ్బిలిశెట్టి అనూరాధ అన్నారు. విశాఖ పర్యటన సందర్భంగా ఆమె బుధవారం ఇక్కడ ఉత్తరాంధ్ర జర్నలిస్టు ఫ్రంటు (యూజేఎఫ్) ఏర్పాటు చేసిన అభినందన సభలో పాల్గొన్నారు.
ప్రపంచ తెలుగు అసోసియేషన్ల సమాఖ్య ‘ప్రవాస మిత్ర’ ప్రవాసీ స్త్రీ శక్తి అవార్డుతో ఆమెను సత్కరించటాన్ని పురస్కరించుకుని యూజేఎఫ్ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా అనూరాధ మాట్లాడుతూ గల్ఫ్ లో చట్టాలు చాలా కఠినంగా ఉంటాయనీ, ధర్నాలు, సామూహిక నిరసనలు నిషేధమనీ, ఏ సమస్య అయినా భారత రాయబార కార్యాలయాల ద్వారా మాత్రమే జరగాలనీ, అక్రమ వీసాలతో పాస్ పోర్టులతో వచ్చేవారు చాలా సమస్యలు ఎదుర్కొనాల్సి ఉంటుందనీ అన్నారు. ఇలాటివారిని తిరిగి స్వదేశానికి పంపటానికి తాము శక్తి వంచనలేకుండా కృషి చేస్తున్నామన్నారు.
గల్ఫ్ అంటే ఒక దేశం కాదనీ అనేక దేశాలనీ తెలీకుండా కూడా చాలామంది అక్కడ ఏదో సంపాదన బాగుంటుందని నమ్మి వస్తున్నారనీ, అక్కడ ఇళ్లలో పని చేసే వారికి కూడా ఎన్నో యంత్రాలతో పని చేయటం తెలిసి ఉండాలనీ, అవి తెలుసని చెప్పి ఏజెంట్లు పనుల్లో చేర్చాక యజమానులు వీరికి ఆ మిషన్ల మీద పని చేయటం తెలీదని తెలిసి తొలగిస్తారనీ, లేదా వీరే మారిపోతారనీ, అక్కడ నరకం చూస్తారనీ వివరించారు. ఇలాటి వారికి శిక్షణ ఇవ్వటానికి ప్రభుత్వ సంస్థ ఉందనీ, శిక్షణ తీసుకున్నాక, ప్రభుత్వం వద్ద రిజిస్టరు చేసుకుని మాత్రమే గల్ఫ్ దేశాలకు రావాలనీ కోరారు. ఏపీ ప్రభుత్వం ఎన్ఆర్ఐల సేవలను వినియోగించుకోవటానికి వేమూరి రవి, మంత్రి డాక్టర్ పల్లె రఘునాధరెడ్డి నేతృత్వంలో ఏర్పాటు చేసిన ఏపీఎన్ఆర్టీ సంస్థలో యూఏఈకి ప్రాజెక్టు కో ఆర్డినేటరుగా తనను నియమించారనీ, ఇప్పుడు అధికారికంగా మరింత సేవ చేసే అవకాశం దక్కిందనీ ఆనందం వ్యక్తం చేశారు.
తాము గల్ఫ్ దేశాలలోని తెలుగువారి పిల్లలకు తెలుగు నేర్పే కార్యక్రమం కొనసాగిస్తున్నామనీ, దుబాయి స్కూల్లో 153 మంది బాలలు తెలుగు నేర్చుకుంటున్నారనీ, ఒమన్‌లో 55 మంది జాయినయ్యారనీ, మిగతా చోట్ల కూడా మంచి స్పందన వస్తోందనీ అనూరాధ వివరించారు. ఏపీ తెలంగాణ ప్రభుత్వాలతో కలిసి భాషాభివృద్ధికి కృషి చేస్తామన్నారు.
కార్యక్రమంలో యూజేఎఫ్ ప్రతినిధులు ఎన్.నాగేశ్వరరావు, కుర్రా విజయకుమార్, అసుపోను అప్పారావు తదితరులతో పాటు పలువురు సీనియర్ జర్నలిస్టులూ పాల్గొన్నారు.


