ఉద్యమ రూపం దిశగా ప్రత్యేక హోదా
- 82 Views
- wadminw
- September 9, 2016
- తాజా వార్తలు
కాకినాడ, సెప్టెంబర్ 9 (న్యూస్‌టైమ్): రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని ప్రజలంతా కోరుతున్న నేపథ్యంలో ప్రత్యేక హోదా కాదు ప్రత్యేక ప్యాకేజీ మాత్రమేనని కేంద్ర ప్రభుత్వం ప్రకటించడంతో ప్రజా సంఘాలు, కార్మిక సంఘాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. ఈ మేరకు ఉద్యమం బాట పట్టేందుకు నిర్ణయించుకున్నారు. మళ్లీ రాష్ట్ర విభజన అంశం రావణకాష్టంగా మారుతోంది. విభజించారు సరే విభజన సందర్భంగా రెండున్నరేళ్ల క్రితం ఇచ్చిన హామీలేంచేశారంటూ రాష్ట్ర ప్రజానీకం రోడ్డెక్కింది.
అందులో భాగంగా జిల్లాలో కార్మిక, కర్షక, ఉద్యోగ, విద్యార్ధి, జర్నలిస్టులు ఇలా అన్ని రంగాల వారు పాలకుల్ని ప్రశ్నిస్తున్నారు. కేంద్రంలో మోడీ, రాష్ట్రంలో చంద్రబాబునాయుడు ఉండీ కూడా ఎన్నికల ముందు హామీలు గుప్పించి ఐదుకోట్ల మందిని నిలువునా నట్టేట ముంచారని విమర్శిస్తున్నారు. పార్టీలకు అతీతంగా ఈ కార్యక్రమాల్లో ప్రజలు పాల్గొంటున్నారన్నారు. తెలుగుదేశం పార్టీ కూడా శుక్రవారం కాకినాడలో జరిగిన సంఘాల ధర్నాలకు మద్ధతు పలికింది. ఆ పార్టీ తరపున నగర తెలుగుదేశం అధ్యక్షులు నున్న దొరబాబు, ఇతర నాయకులు సుంకర తిరుమల కుమార్, కాంగ్రెస్ తరపున నురుకుర్తి వెంకటేశ్వరరావు, పలు కళాశాలలు, పాఠశాలలకు చెందిన విద్యార్ధులు, ఆమ్ఆద్మీ పార్టీ ప్రతినిధులు ర్యాలీలు నిర్వహించి ప్రదర్శనలు చేశారు.
కలెక్టర్ ముందు నినదించి జిజిహెచ్, బాలాజీ చెరువు సెంటర్, మెయిన్ రోడ్డు మీదుగా వెళ్లి దేవాలయం వీధికి చేరుకుని అక్కడి నుంచి వార్ఫురోడ్డుకు వచ్చి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం మీదుగా తిరిగి కలెక్టరేట్‌కు చేరుకున్నారు. ప్రతి ఒక్కరూ ప్రత్యేక హోదాతో మాత్రమే సమస్యకు ఫుల్‌స్టాఫ్ పెడుతుందని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమాల్లో జర్నలిస్టు సంఘాలు కూడా పాల్గొని మద్ధతు పలికాయి. గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో విభజన జరిగినప్పుడు పార్లమెంటు సాక్షిగా ప్రధాని మన్మోహన్ హామీలిచ్చారని, అలాగే వెంకయ్య నాయుడు ఐదేళ్లంటే పదేళ్లంటూ రాజ్యసభ సభ్యుడి హోదాలో సభలో మాట్లాడిన అంశాలను జాప్ తరపున పిఎస్ఎం కృష్ణంరాజు, ఎపిడబ్ల్యూజెఎఫ్ తరపున వి.నవీన్‌కుమార్ తదితరులు గుర్తుచేశారు. అన్నమాటకు కట్టుబడి నాయకులు పనులు చేయాలే తప్ప మోసాలకు పాల్పడటం సరి కాదన్నారు.
ఉద్యోగ సంఘాల తరపున జెఎసి గౌరవాధ్యక్షులు ఆచంట రామారాయుడు, జెఎసి చైర్మన్ బూరిగ ఆశీర్వాదం తదితరులు ప్రత్యేక హోదా రాష్ట్రానికి ఇచ్చి తీరాల్సిందేనన్నారు. ఇందులో ఏ మాత్రం తేడా జరిగినా యువత భవిష్యత్ నాశనమౌతుందని, అన్ని రంగాలు భ్రష్టు పడతాయని పేర్కొన్నారు. సిపిఐ తరపున తాటిపాక మధు మాట్లాడుతూ మోసాలు, దగాలతో పాలకులు కాలక్షేపం చేస్తున్నారని, ఇచ్చిన మాటకు కట్టుబడే సంస్కృతికి తిలోదకాలు ఇచ్చి నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. సిఐటియు తరపున శేషుబాబ్జి పాల్గొని రాష్ట్రానికి ప్రత్యేక హోదా తక్షణ అవసరమని, ఆ హోదా తప్ప ఇంకేమిచ్చినా ఈ రాష్ట్ర భవిష్యత్ ముందుకు సాగదని గుర్తుచేశారు.
జర్నలిస్టుల నుంచి పొలిమట్ల మోజెస్బాబు, సాక్షి ఛానల్ తరపున రాజు, భారత్ టీవీ నుంచి దత్తు, పెద్దాపురం ఎన్టీవీ విలేకరి మున్ని, బొడ్డు వెంకటరమణమూర్తి, సాంబశివరావు, చిన్న, మధ్య తరహా పత్రికల సంఘ అధ్యక్షులు రాయవరపు ప్రభాకర్, స్టేట్ టైమ్స్ ప్రతినిధి మంతెన శ్రీనివాస్‌వర్మ, ఆమ్ఆద్మీ పార్టీ ప్రతినిధి అధికారి, పలువురు విద్యార్ధులు తదితరులు పాల్గొన్నారు.


