ఉద్యోగుల సంక్షేమానికి పనిచేస్తాం: ఏయూ వీసీ
విశాఖపట్నం, అక్టోబబర్ 5 (న్యూస్‌టైమ్): ఉద్యోగుల సంక్షేమానికి విశ్వవిద్యాలయాల అధికారులు పనిచేస్తారని ఏయూ వీసీ ఆచార్య జి.నాగేశ్వరరావు అన్నారు. బుధవారం ఉదయం ఏయూ వైవిఎస్ మూర్తి ఆడిటోరియంలో ఆల్ యూనివర్సిటీ నాన్ టీచింగ్ ఎంప్లాయిస్ అసోసియేషన్-ఆంధ్రప్రదేశ్(ఆంటియా) నిర్వహించిన ‘ప్రైవేటు విశ్వవిద్యాలయాల స్థాపన-ప్రభుత్వ విశ్వవిద్యాలయాల పటిష్టత-ఉద్యోగుల భవిత’ అంశంపై నిర్వహిస్తున్న రెండు రోజుల జాతీయ సదస్సును ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉద్యోగులు తమ నైపుణ్యాలను మెరుగు పరచుకోవడానికి కృషిచేయాలన్నారు. ప్రైవేటు విశ్వవిద్యాలయాలు, విదేశీ విశ్వవిద్యాలయాల ఏర్పాటు వలన ఎటువంటి నష్టం జరగదన్నారు. వర్సిటీ ఉద్యోగులు తమలో ఉన్న భయాన్ని వదిలేయాలన్నారు. ఉద్యోగుల భద్రతకు ఢోకాలేదన్నారు. బ్లాక్ గ్రాంట్ పెంపుదల చేయడం జరుగుతోదన్నారు. ప్రభుత్వానికి పునాది ఉద్యోగులేనన్నారు. ప్రభుత్వానికి సమగ్ర నివేదిక ఇవ్వాలన్నారు. ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆచార్య పి.విజయ ప్రకాష్ మాట్లాడుతూ తల్లిదండ్రులు, విద్యార్థులు నాణ్యమైన విద్యను కోరుకుంటున్నారన్నారు. పోటీతత్వంతో నాణ్యత పెరుగుతుందన్నారు.
ఆత్మావలోకనం చేసుకుంటూ ముందుకు సాగాలన్నారు. త్వరలో 5 విశ్వవిద్యాలయాలు రావడానికి సిద్దంగా ఉన్నాయన్నారు. అధ్యాపకులు, విద్యార్థులు, బోధనేతర సిబ్బంది మద్య అసమతుల్యతను నివారించడం అవసరమన్నారు. విశ్వవిద్యాలయాలు స్వయం సంవృద్ది సాధించే దిశగా ఎదగాలన్నారు. ఉద్యోగులకు హెల్త్ కార్డులు త్వరలోనే వస్తాయన్నారు. ఏయూ రిజిస్ట్రార్ ఆచార్య వి.ఉమా మహేశ్వరరావు మాట్లాడుతూ విశ్వవిద్యాలయం ఉద్యోగులు బాగోగులు, సమస్యలను చర్చించడం మంచి పరిణామన్నారు. నూతనంగా ఏర్పాటైన విశ్వవిద్యాలయాలు బాలారిష్టాలను అధిగమించాల్సిన అవసరం ఉందన్నారు. ఏడాదికి రూ 300 కోట్ల వరకు వేతనాలకు ఖర్చవుతోందన్నారు. విశ్వవిద్యాలయాలలో బోధనేతర ఖాళీల భర్తీకి ప్రభుత్వం కొంత వెసులుబాటు కల్పించాల్సిన అవసరం ఉందన్నారు.
ఆంటియా అద్యక్షుడు పి.కె సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ప్రస్తుతం రాష్ట్రంలోఉన్న ప్రభుత్వ విశ్వవిద్యాలయాలలో బోధన,బోధనేతర ఖాళీలు భర్తీ చేస్తే పూర్తిస్థాయిలో నాణ్యమైన విద్యను అందించడం సాధ్యపడుతుందన్నారు. సాంప్రదాయ వర్సిటీలను పటిష్టం చేయాల్సిన అవసరం ఉందన్నారు. తాత్కాలిక ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని, పదవీవిరమణలు పెరిగిపోతున్నాయని, నూతన నియామకాలు లేవన్నారు. వర్సిటీ ఉద్యోగులకు హెల్త్‌కార్డులను అందించాలన్నారు. ఆంటియా సెక్రటరీ జనరల్ వాకా కోటిరెడ్డి విదేశీ, ప్రైవేటు విశ్వవిద్యాలయాలు స్థాపిస్తే ప్రభుత్వ విశ్వవిద్యాలయాల మనుగడ ఏమిటనే ప్రశ్న అందరిలో ఎదురవుతోందన్నారు. మేధావులు ఈ సందేహాలకు నివృత్తి చేసే ప్రయత్నం చేయాలన్నారు. ఉద్యోగుల పెన్షన్ భారాన్ని ప్రభుత్వమే భరించాల్ని అవసరం ఉందన్నారు.
బోధనేతర ఉద్యోగుల నియామకాలు ప్రభుత్వం చేపట్టాలన్నారు. ఈ సందర్భంగా ఉద్యోగ జాగృతి పత్రికను వీసీ నాగేశ్వరరావు విడుదల చేశారు. కార్యక్రమంలో డిఎస్ఎన్ఎల్యూ వీసీ వి.కేశవరావు, కృష్ణా వర్సిటీ వీసీ ఆచార్య ఎస్.రామక్రిష్ణారావు, ఆంటియా కార్యవర్గ సభ్యులు యస్.ఏ గౌస్ బాబా, ఎం.చంద్రశేఖర రెడ్డి, వై.కృష్ణ, ఏయూఇయూ కార్యదర్శి పెదిరెడ్ల అప్పలరాజు, హాస్టల్ ఉద్యోగుల సంఘం అద్యక్షుడు ఒమ్మి అప్పారావు, కార్యదర్శి యమ్.సుబాన్ తదితరులు ప్రసంగించారు. వివిధ విశ్వవిద్యాలయాల నుంచి వచ్చిన ప్రతినిధులు పాల్గొన్నారు.


