ఉపాధికి దూరంగా రాజధాని పేదలు
గుంటూరు, సెప్టెంబర్ 9 (న్యూస్‌టైమ్): ‘రాజధాని ప్రాంతంలోని పేదలందరికీ ఉపాధి కల్పిస్తాం. 365 రోజులు ఉపాధి హామీ పనులు చేపడతాం’ ఆ ప్రాంతంలో జరిగిన ఒక బహిరంగ సభలో ముఖ్యమంత్రి స్థానికులకు ఇచ్చిన హామీ ఇది. ‘రాజధానిలో రోజుకు 5,000 మందికి ఉపాధి కల్పించే విధంగా డిసెంబరు నాటికి 5 లక్షల మందికి ఉపాధి కల్పించాలి.’ ఇటీవల జరిగిన సమీక్షా సమావేశంలో జిల్లా కలెక్టర్ కాంతిలాల్ డ్వామా అధికారులను పైవిధంగా ఆదేశించారు. సాక్షాత్తూ ముఖ్యమంత్రే హామీ ఇచ్చినా, కలెక్టర్ ఆదేశించినా వాస్తవంగా క్షేత్రస్థాయిలో పనులు కల్పిస్తున్నది మాత్రం కేవలం 240 మందికే. మాటలతో రాజధాని ప్రాంత వాసులను మభ్యపెట్టేందుకు పాలకులు యత్నం చేస్తున్నారు.
కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఉపాధి హామీ పథకం కింద రాజధాని ప్రాంతంలో పనులు చేపట్టేందుకు నిబంధనలు అనుకూలంగా లేవు. కొద్దిపాటి పనులు ఉన్నప్పటికీ తక్కువ కూలీ వస్తుండటంతో కూలీలు కొందరు ఈ పనులపై ఆసక్తి చూపడం లేదు. ఉపాధి హామీ పథకం నిబంధనల ప్రకారం చేయదగ్గ పనులు రాజధాని ప్రాంతంలో లేవు. ఇందుకు కారణం అక్కడ వ్యవసాయం లేకపోవడంతో కాల్వల పూడికతీత, తూటికాడ తొలగింపు, ఇతర పనులు చేసే అవకాశం లేదు. ఈ ప్రాంతంలోని కాల్వలను అభివృద్ధి చేసినా దాని వల్ల ప్రయోజనం లేదు. గ్రామాల్లో అంతర్గత రోడ్ల అభివృద్ధి, ఇతర జంగిల్ క్లియరెన్స్ పనులు చేపట్టేందుకు అవకాశం ఉంది. అంతర్గత రొడ్ల అభివృద్ధికి ఎక్కువ మొత్తంలో మెటీరియల్‌కే ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఈ పనుల్లో కూలీలకు ఉపాధి తక్కువగా ఉంటుంది. దీంతో ఈ పనులు చేపట్టేందుకు అధికారులు వెనకడుగు వేస్తున్నారు.
జంగిల్ క్లియరెన్స్ పనులు చేపట్టేందుకు కూలీలు ముందుకు రావడం లేదు. ఇటీవల రాజధాని ప్రాంతంలో ఉపాధి పనుల గుర్తింపు కోసం గ్రామసభలు నిర్వహించినా పెద్ద ఫలితం లేకుండా పోయింది. భూ సమీకరణలో భాగంగా రాజధాని ప్రాంతంలో 33,500 ఎకరాలకు ప్రభుత్వం 9.3 అంగీకార పత్రాలను తీసుకుంది. 27,800 ఎకరాలకు వార్షిక కౌలు చెల్లించింది. దీంతో ఈ ప్రాంతంలో వ్యవసాయం దాదాపుగా నిలిచిపోయింది. కొద్దిమంది మాత్రం తక్కువ సమయంలో పంటకు వచ్చే అపరాలను సాగు చేస్తున్నారు. ఈ పంటల వల్ల కూలీలకు ఉపాధి అవకాశాలు తక్కువ. దీంతో రాజధాని ప్రాంతంలో కూలీలు రచ్చబండలపై ఆటలకే పరిమితం అవుతున్నారు.
ఉపాధి పథకం కింద పనులు చూపుతామన్న మాటలు ఆచరణలో సాధ్యం కాకపోవడంతో వారు పనుల కోసం ఎదురు చూస్తున్నారు. రాజధాని నిర్మాణం, లేఅవుట్ పనులు ప్రారంభిస్తే తమకు పనులు కల్పిస్తారేమోనని ఆశగా చూస్తున్నారు. రాజధాని ప్రాంతంలోని తుళ్ళూరు, తాడేపల్లి, మంగళగిరి మండలాల్లో మొత్తం 23,236 మందికి జాబ్ కార్డులు ఉన్నాయి. వ్యవసాయ పనులు నిలిచిపోవడంతో రాజధాని గ్రామాల్లో ఈ సంఖ్య ఇప్పుడు రెండు నుంచి మూడింతలయ్యే అవకాశం ఉంది. రాజధాని ప్రాంతంలో పనులు చేపట్టి కూలీలకు ఉపాధి కల్పించే దిశగా డ్వామా అధికారులు 12 పనులను గుర్తించారు. ఆ పనులు చేపట్టేందుకు అనుమతి ఇవ్వాల్సిందిగా రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ రామాంజనేయులకు ప్రతిపాదనలు పంపారు. వీటిలో కేవలం నాలుగింటికి మాత్రమే అనుమతి లభించింది.
ఈ నాలుగు పనుల్లో ఎక్కువ మొత్తం మెటీరియల్‌కు ఖర్చు చేయాల్సి ఉన్నందున కూలీలకు ఉపాధి లభించే అవకాశం లేదు. అక్కడక్కడా చేపడుతున్న జంగిల్ క్లియరెన్స్, కచ్చాడ్రైయిన్ల పనులకు 100 నుంచి 240 మంది రోజూ హాజరవుతున్నారు. వర్షాల కారణంగా గత మూడు రోజులుగా పనులు నిలిచిపోయాయి. ఈ పనులకు కేవలం రోజుకు కూలి సరాసరిన రూ.126 మాత్రమే వస్తుండటంతో కూలీలు ఆసక్తి చూపడం లేదు. దీంతో అధికారుల లక్ష్యం నెరవేరే అవకాశాలు కనిపించడం లేదు. డిసెంబరు నాటికి 5 లక్షల పనిదినాలు రాజధాని ప్రాంతంలో కల్పించడం ఎలా అని డ్వామా అధికారులు తలలు పట్టుకుంటున్నారు. కాగా, రాజధాని ప్రాంతంలో ఉపాధి హామీ పథకంలో నిబంధనల సడలింపునకు ప్రభుత్వం అవకాశం కల్పిస్తే 7 లక్షల మందికి ఉపాధి కల్పించవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.
భూ సమీకరణలో భాగంగా వార్షిక కౌలు చెల్లించిన భూములు 27,800 ఎకరాలు ఉన్నాయి. వీటిలో పత్తి, మిర్చి, చెరకు, అరటి వంటి పంటలను గత సీజన్లో సాగు చేశారు. ఈ పంటల వ్యర్ధాలు అంటే అరటి బాదులు, ఎండిన పత్తి మొక్కలు, చెరకు ఊద వంటి వాటిని తొలగించడం, నర్సరీల నిర్వహణలో ఉపాధి కల్పించడానికి అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. రాజధాని ప్రాంతంలో నర్సరీల అభివృద్ధికి ఎనిమిది గ్రామాలను గుర్తించి సర్వే చేయించారు. అటవీ, రెవెన్యూ శాఖలు సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టనున్నాయి. ఈ మేరకు ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వానికి అందజేయనున్నారు. రాజధాని ప్రాంతంలో చేపట్టే ఉపాధి హామీ పనులకు ఈ చట్టం నిబంధ నలను సడలించడం సాధ్యమవుతుందా?
అనేది ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారింది. రాష్ట్ర కమిషనర్‌కు ప్రతిపాదనలు పంపినా ఆయన తన చేతుల్లో లేదని.. కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు తీసుకోవాల్సిందేనంటున్నారు. దీంతో ముఖ్యమంత్రి స్వయంగా కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి బీరేంద్రసింగ్‌తో మాట్లాడి నిబంధనలలో వెసులు బాటు కల్పించాలని కోరాలని భావిస్తున్నారు. ఇది అంత త్వరగా సాధ్యం అయ్యే పనిలా కనిపించడం లేదు. దీంతో రాజధాని వాసులకు ఉపాధి పథకం కింద పనులు కల్పించడం ఇప్పుడిప్పుడే సాధ్యం కాదని భావిస్తున్నారు.
రాజధాని ప్రాంతంలో నివసిస్తున్న వ్యవసాయ కూలీలు, చేతివృత్తిదారులు, పేదలకు రోజుకు రూ.300 కూలి చెల్లించే విధంగా పనులు కల్పించాలని, లేని పక్షంలో భార్యభర్తలకు ఒక్కొక్కరికీ రూ.4,500 జీవన భృతి చెల్లించాలని సీపీఐ డిమాండు చేస్తోంది. ఈ మేరకు సీపీఐ నాయకుల బృందం ఇటీవల ముఖ్యమంత్రిని కలిసి వినతి పత్రం అందజేసినట్లు పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు తెలిపారు. వ్యవసాయ పనులు లేకపోవడంతో రాజధానిలో పనులు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ఆయన చెప్పారు. ప్రభుత్వం వెంటనే ఉపాధి కల్పించకపోతే రాజధాని ప్రాంత పేదలతో ఉద్యమాన్ని నిర్వహిస్తామన్నారు.


