ఉపాధి హామీ కూలీల పొట్టకొట్టిన యాక్సిస్ బ్యాంక్
- 179 Views
- wadminw
- January 14, 2017
- Home Slider రాష్ట్రీయం
మహబూబ్నగర్: బ్యాంకు అధికారుల అలసత్వం ఉపాధి హామీ కూలీల పట్ల శాపంగా మారింది. కడుపు నింపుకోవడానికి ఉపాధి హామీ పనులుకు వెళ్లి జీవితం వెళ్లదీసే వాళ్లకు రావాల్సిన వేతనం రాకపోతే ఎంత కష్టం. జాతీయ పథకాల కింద వచ్చే నిధుల పంపిణీకి సంబంధించి యాక్సిస్ బ్యాంకు కొన్ని బ్రాంచులను ఎంపిక చేసుకొంది. దీనిలో భాగంగా 2 కోట్ల రూపాయిల నిధులు దుర్వినియోగం చేసిందని రంగారెడ్డి గ్రామీణాభివృద్ది శాఖ అధికారులు యాక్సిస్ బ్యాంకుపై క్రిమినల్ కేసు నమోదు చేశారు.
ఈ 2 కోట్ల రూపాయిల్లోనే ఉపాధి హామీ కూలీలకు ఇచ్చే వేతన బకాయిలూ ఉన్నాయి. బ్యాంకు నిర్లక్ష్యం కారణంగా నిధులు ఆగిపోవడంతో కూలీలు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. 2013 ఏప్రిల్ నుంచి జూన్ మధ్య చేసిన పనులకు కూలీలకు వేతన బకాయిలు రాలేదు. దీనిపై అధికారులను నిలదీయగా అసలు విషయం బయటపడింది. అయితే మా నిర్లక్ష్యం లేదని కూలీలకు బకాయిలు చెల్లించే పనిలోనే ఉన్నామని బ్యాంకు అధికారులు సమాధానమిచ్చారు. అయితే, 2013లో కొంత మొత్తాన్ని బ్యాంకు చెల్లించిందని అధికారులు చెబుతున్నారు.
ఈ విషయంలో కఠిన చర్యలు తీసుకుంటున్నామని రంగారెడ్డి డ్వామా అధికారి చంద్రకాంత్ అంటున్నారు. ఇక నుంచి ప్రభుత్వ పథకాల లబ్దిదారులకు నగదు పంపిణీ చేయకుండా ఆ బ్యాంకుకు అడ్డుకట్ట వేస్తామని చెబుతున్నారు. బకాయిలను వడ్డీతో సహా కూలీలకు ఇప్పిస్తామంటున్నారు. జాతీయ ఉపాధి హామీ పథకంపై ముందు నుంచి ప్రభుత్వం చిన్న చూపు చూస్తోందని, 2013 బకాయిలే ఇప్పటికి అందలేదంటే ఆ పథకం పట్ల అధికారులకు ఎంత శ్రద్ద ఉందో అర్థమవుతోందని వ్యవసాయ కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి.
రంగారెడ్జి జిల్లా ఉదంతమే దీనికి ఉదాహారణని విమర్శిస్తున్నాయి. రంగారెడ్డి జిల్లాల్లోనూ కొన్ని ప్రాంతాల్లో కరవు పరిస్థితులున్నాయి. మండలాల్లో అధిక శాతం ఉపాధి హామీపైనే ఆధారపడుతున్నారు. ఆ ఒక్క ఆధారాన్ని ప్రశ్నార్థకం చేయడం సబబేనా ఇప్పటికైనా అధికారులు ఈ విషయంలో మరింత కఠినంగా వ్యవహరించాలి పేదల పొట్టకొట్టిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి.


