ఉరీ దాడి మా పనే: లష్కరే తోయిబా
- 77 Views
- wadminw
- October 25, 2016
- అంతర్జాతీయం
న్యూఢిల్లీ, అక్టోబర్ 25: జమ్ముకశ్మీర్‌లోని ఉరీ సైనిక స్థావరంపై దాడికి పాల్పడింది తామేనని ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా ప్రకటన చేసింది. 19 మంది భారత సైనికులు ప్రాణాలు కోల్పోయిన ఉరీ ఘటనకు తామే బాధ్యులమని పాకిస్థాన్‌కు చెందిన లష్కరే తోయిబా మంగళవారం ఒక ప్రకటనలో స్పష్టంచేసింది. గత నెలలో ఉరీ సైనిక స్థావరంపై ఉగ్రవాదులు దాడి చేసిన సంగతి తెలిసిందే. దాడి చేసిన ఉగ్రవాదులను భారత సైన్యం మట్టుబెట్టింది. ఉరీ ఘటనలో మరణించిన ఓ ఉగ్రవాది కోసం లష్కరే తోయిబా మాతృ సంస్థ అయిన జమత్-ఉద్-దవా(జేయూడీ) పాకిస్థాన్‌లోని పంజాబ్‌లో గుజ్రాన్వాలా ప్రాంతంలో ప్రార్థనలు నిర్వహించినట్లు తెలుస్తోంది.
ఈ మేరకు కొన్ని పోస్టర్లు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఈ ప్రార్థనల తర్వాత జేయూడీ చీఫ్ హఫీజ్ సయీద్ మాట్లాడినట్లు సమాచారం. ఈ పోస్టర్లలో భారత ఆర్మీ క్యాంప్‌పై దాడి చేసి ఎల్ఈటీకి చెందిన మహ్మద్ అనాస్ అలియాస్ అబు-సరఖా అమరుడయ్యాడని ఉర్దూలో పేర్కొన్నారు. ఈ పోస్టర్ల ప్రకారం ఎల్ఈటీ ఉగ్రవాదులు 177 మంది భారత సైనికులను చంపారట. ఉరీ ఘటనకు పాల్పడిన ఉగ్రవాదులు పాకిస్థాన్ నుంచే వచ్చారని భారత్ చెప్తుండగా పాక్ వాటిని తోసిపుచ్చింది. అయితే ఇప్పుడు ఈ పోస్టర్లతో భారత్ వాదనకు వూతమిచ్చినట్లయింది.
ఉరీ ఘటనకు పాల్పడిన ఉగ్రవాదుల నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్న ఆహార ప్యాకెట్లు, జీపీఎస్ పరికరాలు పాకిస్థాన్‌కు చెందినవని భారత్ గతంలోనే ఆధారాలు కూడా చూపించింది. కాగా, పాకిస్థాన్‌లోని గుజ్రాన్ వాలా పట్టణంలో వెలసిన పోస్టర్లు ఇందుకు సాక్షంగా నిలుస్తున్నాయి. ఉడీ దాడిలో హతమైన ఉగ్రవాది మహ్మద్ అనాస్ అలియాస్ అబూ సిరాఖా అంత్యక్రియలు సందర్భంగా నిర్వహించే ప్రత్యేక నమాజ్‌కు రావాలంటూ స్థానికులను ఆహ్వానిస్తూ గుజ్రాన్ వాలాలో పోస్టర్లు వెలిశాయని ఇండియన్ ఎక్స్‌ప్రెస్ వెల్లడించింది. ‘ఎంతో ధైరవంతుడైన మత పోరాటయోధుడు అబూ సిరఖా మహ్మద్ అనాస్. ఆక్రమిత కశ్మీర్లో ఉడీ బ్రిగేడ్ క్యాంపులో 177 మంది హిందూ సైనికులను నరకానికి పంపాడు. మతం కోసం అతడు ప్రాణత్యాగం చేశాడు’ అని ఈ పోస్టర్లలో పేర్కొన్నారు.
మహ్మద్ అనాస్ ఫొటోతో పాటు లష్కరే-ఈ-తొయిబా అధినేత హఫీజ్ మహ్మద్ సయీద్ చిత్రాన్ని పోస్టర్లతో ముద్రించారు. అనాస్ మృతదేహం లేకుండా అతడి అంత్యక్రియలు నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు. గుజ్రాన్ వాలా పట్టణంలోని గిర్ జాఖ్ సమీపంలో బాదానుల్లా ప్రాంతంలో అంత్యక్రియలు జరపనున్నట్టు తెలిపారు. ఉడీ దాడి పాకిస్థాన్ ఉగ్రవాదుల పనేనని భారత్ చేస్తున్న వాదనకు ఈ పోస్టర్లు సాక్ష్యంగా నిలిచాయి. ఉడీ దాడితో సంబంధం లేదని బొంకుతున్న పాకిస్థాన్ దీనికి ఏం సమాధానం చెబుతుందో చూడాలి. అయితే పాకిస్థాన్ కే చెందిన జైషే-ఈ-మహ్మద్ ఉగ్రవాద సంస్థ ఉడీ దాడికి పాల్పడిందన్న అనుమానాన్ని ప్రాథమికంగా భారత్ వ్యక్తం చేసింది.
తాజాగా వెలుగుచూసిన పోస్టర్లతో ఇది లష్కరే-ఈ-తొయిబా ఘాతుకంగా వెల్లడైంది. కుట్రదారులను గుర్తించడం, ఆధారాల సేకరణలో జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) అధికారులు ఇప్పటివరకు స్పష్టమైన పురోగతి సాధించలేకపోయారు. ఉడీ దాడిలో హతమైన ఉగ్రవాదుల వద్ద రెండు జర్మనీ తుపాకులు దొరికాయి. అయితే వీటిలో ఒకటి పూర్తిగా ధ్వంసమైంది. మరో తుపాకీని ఫోరెన్సిక్ నిపుణులు పరీక్షిస్తున్నారు. ఘటనా స్థలంలో దొరికిన మందులు, ఆహార పొట్లాలు ఉగ్రవాదులు పాకిస్థాన్‌కు చెందిన వారని నిర్ధారించినా వారు ఏ ఉగ్రవాద సంస్థకు చెందినవారో కచ్చితంగా నిర్దరణకు వచ్చే అవకాశం కల్పించలేకపోయాయి.
ఉగ్రవాదులకు చొరబాటుకు సహకరించారనే ఆరోపణలతో అరెస్టు చేసిన అహసాన్ ఖుర్షీద్, ఫైసాల్ అవాన్ కూడా పరస్పర విరుద్ధ వాంగూల్మం ఇవ్వడంతో దర్యాప్తు ముందుకు సాగడం లేదని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. ఈ నేపథ్యంలో గుజ్రాన్ వాలాలో వెలుగుచూసిన పోస్టర్లు సాక్ష్యంగా నిలబడతాయా, లేదా అనేది చర్చనీయాంశంగా మారింది. ఉడీ దాడిలో హతమైన మిగతా ముగ్గురు ఉగ్రవాదుల స్వస్థలాల్లో కూడా ఇదేవిధంగా పోస్టర్లు వెలిశాయో, లేదో తెలియదని ఇండియన్ ఎక్స్‌ప్రెస్ పేర్కొంది. సెప్టెంబర్ 18న ఉడీ సైనిక స్థావరంపై ఉగ్రవాదులు జరిపిన దాడిలో 20 సైనికులు మృతి చెందారు. భద్రతా దళాలు జరిపిన కాల్పుల్లో నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు.
ఢిల్లీలో ట్రైబల్ కార్నివాల్ ప్రారంభం
గిరిజనుల్లో సృజనాత్మకత దాగివుంది: మోదీ
న్యూఢిల్లీ, అక్టోబర్ 25: ప్రధానమంత్రి నరేంద్రమోదీ మంగళవారం ఢిల్లీలో ట్రైబల్ కార్నివాల్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరిజనుల్లో సృజనాత్మకత దాగివుందని అన్నారు. గిరిజన ఉత్పత్తులు ప్రపంచ వ్యాప్తంగా ఎగుమతి అవుతున్నాయని, గిరిజన ఉత్పత్తులకు ఆధునికత జోడించి..సరైన మార్కెటింగ్ వసతి కల్పించాలని, తండాలకు వెళ్లి ప్రణాళికలు రూపొందించాలని మోదీ పేర్కొన్నారు. ఇదిలావుండగా, భారత రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతుల జీతం త్వరలోనే దాదాపు మూడురెట్ల వరకు పెరగనుంది. ఈ మేరకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ప్రతిపాదనలు రూపొందించింది. ప్రస్తుతం రాష్ట్రపతి జీతం దేశంలో అత్యున్నత అధికారి అయిన కేబినెట్ కార్యదర్శి జీతం కంటే కూడా లక్ష రూపాయలు తక్కువగా ఉంది. దీనిపై ఏడో వేతన సంఘం కొన్ని సిఫార్సులు చేసింది. వాటికి అనుగుణంగానే హోం శాఖ ప్రతిపాదనలు రూపొందించింది. ఈ ప్రతిపాదనలను కేంద్ర మంత్రివర్గం ఆమోదించాల్సి ఉంటుంది. ప్రస్తుతం రాష్ట్రపతికి నెలకు రూ. 1.5 లక్షలు, ఉప రాష్ట్రపతికి రూ. 1.25 లక్షలు, గవర్నర్లకు రూ. 1.10 లక్షల చొప్పున జీతం ఉంది. హోంశాఖ ప్రతిపాదనల ప్రకారం రాష్ట్రపతి జీతం రూ. 5 లక్షలు, ఉపరాష్ట్రపతి జీతం రూ. 3.5 లక్షలు అవుతాయని అంటున్నారు. ఏడో వేతన సంఘం సిఫార్సులు అమలుచేసిన తర్వాత కేబినెట్ కార్యదర్శి జీతం నెలకు రూ. 2.5 లక్షలు అయింది. కేంద్ర ప్రభుత్వంలో కార్యదర్శి జీతం కూడా రూ. 2.25 లక్షలు అయింది. ఇప్పుడు కేబినెట్ ఆమోదం పొందిన తర్వాత పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో రాష్ట్రపతి, ఇతరుల జీతాల పెంపు ప్రతిపాదనలను ప్రవేశపెడతారు. చిట్టచివరిసారిగా 2008 సంవత్సరంలో రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, గవర్నర్ల జీతాలు పెంచారు. అప్పటి వరకు రాష్ట్రపతి జీతం రూ. 50వేలు, ఉపరాష్ట్రపతికి రూ. 40వేలు, గవర్నర్‌కు రూ. 36వేల చొప్పున జీతాలు ఉండేవి. జీతాల పెంపుతో పాటు మాజీ రాష్ట్రపతులు, దివంగత రాష్ట్రపతుల భార్యలు తదితరుల పింఛన్లను కూడా పెంచాలని ప్రతిపాదించారు.
భారత కాల్పుల్లో ముగ్గురు పాక్ జవాన్లు హతం!
జమ్మూ, అక్టోబర్ 25: జమ్ము: కాల్పుల విరమణ ఒప్పందాన్ని యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్న పాకిస్థాన్ తాజాగా మంగళవారం జమ్ముకశ్మీర్ సరిహద్దులోని ఆర్‌ఎస్‌పురా సెక్టార్‌లోని ప్రజలను టార్గెట్ చేసింది. అత్యాధునిక ఆయుధాలతోపాటు మోర్టార్లను ప్రయోగించింది. దీంతో స్పందించిన బీఎస్ఎఫ్ బలగాలు ఎదురు కాల్పులు జరిపాయి. భారత దళాల కాల్పుల్లో ముగ్గురు పాక్ జవాన్లు మరణించి ఉండవచ్చని ఆర్మీ పేర్కొంది. ప్రతీకార దాడిలో ఇద్దరు ముగ్గురు పాక్ జవాన్లు మరణించారన్న సమాచారం ఉందని ఆర్మీ అధికారి ఒకరు తెలిపారు. కాల్పులు ఇంకా కొనసాగుతున్నట్టు పేర్కొన్నారు. మనవైపు నుంచి ఎటువంటి నష్టం లేదని తెలిపారు. అయితే జమ్ము జిల్లాలో మాత్రం ఓ కుటుంబానికి చెందిన ఆరుగురు మహిళలు గాయపడినట్టు పేర్కొన్నారు. క్షతగాత్రులను జమ్ములోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్టు వివరించారు. మరోవైపు, సరిహద్దులో పాకిస్థాన్ ఆర్మీ పెట్రేగిపోతోంది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని నిత్యం ఉల్లంఘిస్తోంది. మంగళవారం జమ్మూకశ్మీర్ సరిహద్దులోని ఆర్‌ఎస్‌పురా సెక్టార్‌లోని ప్రజలను టార్గెట్ చేసింది. అత్యాధునిక ఆయుధాలతోపాటు మోర్టార్లను ప్రయోగించింది. దీంతో ఏడుగురు కశ్మీర్ మహిళలు తీవ్రంగా గాయపడ్డారు. భారత సైన్యం వీరికి ప్రథమ చికిత్స అందించి మెరుగైన వైద్యం కోసం జమ్మూలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించింది. పాక్ కవ్వింపు కాల్పులను బీఎస్ఎఫ్ బలగాలు సమర్థవంతంగా తిప్పికొడుతున్నాయి. మరోవైపు, వాస్తవాధీన రేఖ(ఎల్వోసీ) వెంబడి కాల్పుల విరమణ ఒప్పందానికి భారత్ తూట్లు పొడుస్తోందని, భారత బలగాలు జరిపిన కాల్పుల్లో ఒక జవాను, మరో పౌరుడు చనిపోయారని, ఈ విషయమై వివరణ ఇవ్వాల్సిందిగా ఇస్లామాబాద్‌లోని భారత డిప్యూటీ హైకమిషనర్ జేపీ సింగ్‌కు మంగళవారం పాక్ ప్రభుత్వం సమన్లు జారీచేసింది. వాస్తవాధీన రేఖను ఆనుకుని బజ్వత్, చాప్రా, హర్పాల్, సుచేత్ ఆఘర్, చార్వా సెక్టార్లపై భారత్ విచక్షణా రహితంగా కాల్పులు జరుపుతోందని పాక్ ఆరోపించినట్లు విదేశాంగ మంత్రిత్వశాఖ ప్రతినిధులు తెలిపారు. కాల్పుల వ్యవహారంపై భారత్ కు తీవ్ర నిరసన తెలిపిన పాక్ ఆ మేరకు వివరణ కోరిందని పేర్కొన్నారు. 2016లో భారత్ 90 సార్లు కాల్పుల విరమణ ఒప్పందానికి పాల్పడిందని, పాకిస్థాన్ ఒక్కసారికూడా ఆ పని చేయలేదనిగతవారం దాయాది విదేశాంగ ప్రతినిధి నఫీజ్ జకారియా వ్యాఖ్యానించారు. కాగా, గత మూడు నెలలుగా ఆందోళనలు, అశాంతితో అట్టుడుకుతున్న కశ్మీర్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. కశ్మీర్ లోయలో శాంతియుత వాతావరణంపై కేంద్ర ప్రభుత్వం, వేర్పాటువాదుల మధ్య నెలకొన్న ప్రతిష్టంభనను తొలగించే దిశగా ఒక ముందడుగు పడింది. కేంద్ర మాజీ విదేశాంగ మంత్రి, బీజేపీ సీనియర్ నేత యశ్వంత్ సిన్హా నేతృత్వంలోని ప్రతినిధుల బృందం మంగళవారం వేర్పాటువాద అగ్రనేత సయెద్ అలీషా గిలానీతో భేటీ అయింది. గిలానీ-సిన్హా బృందం దాదాపు గంటపాటు సమావేశమై చర్చించింది. చర్చలు చాలా సుహృద్భావ వాతావరణంలో జరిగినట్టు సిన్హా తెలిపారు. అయితే, తమది అధికారిక ప్రతినిధి బృందం కాదని, వ్యక్తిగత స్థాయిలో కశ్మీర్‌లోని పరిస్థితులను బేరీజు వేసేందుకు మాత్రమే తాము వచ్చినట్టు ఆయన చెప్పారు. కశ్మీర్లో తాజా పరిస్థితులపై కేంద్రం, వేర్పాటువాదుల మధ్య చర్చలకు వీలు కల్పించే కృషిలో భాగంగా ఈ భేటీ జరిగినట్టు తెలుస్తోంది. గత జూలై 8న హిజ్బుల్ ముజాహిద్దీన్ కమాండర్ బుర్హాన్ వనీ ఎన్కౌంటర్ అనంతరం కశ్మీర్ లోయ ఆందోళనలతో అట్టుడికిన సంగతి తెలిసిందే. ఇప్పటికీ లోయలో అశాంతి నెలకొంది. ఆందోళనలు కొనసాగుసతుండటంతో లోయలో జనజీవనం చాలావరకు స్తంభించింది. ఈ నేపథ్యంలో గృహనిర్బంధంలో ఉన్న గిలానీతో భేటీ అయ్యేందుకు సిన్హా నేతృత్వంలోని ప్రతినిధుల బృందానికి వీలు కల్పించారు. కశ్మీర్లో ప్రతిష్టంభన తొలగించేందుకు అవసరమైన రాజకీయ చర్చలకు వీలు కల్పించే దిశగా ఈ బృందం ఉదారవాద వేర్పాటువాద నేత, హురియత్ కాన్ఫరెన్స్ చైర్మన్ మిర్వాయిజ్ ఉమర్ ఫరుఖ్, జేకేఎల్ఎఫ్ చైర్మన్ యాసిన్ మాలిక్‌లతో కూడా చర్చలు జరుపనుంది.


