‘ఎన్టీఆర్ జలసిరి’ అమలుపై కలెక్టర్ సమీక్ష
- 87 Views
- wadminw
- September 21, 2016
- తాజా వార్తలు
ఏలూరు, సెప్టెంబర్ 21 (న్యూస్‌టైమ్): ఎన్టిఆర్ జలసిరి పథకం అమలులో నిర్లక్యం వహించే అధికారులపై చర్యలు తీసుకుంటామని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టరు డాక్టర్ కాటంనేని భాస్కర్ అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టరు కార్యాలయంలో బుధవారం ఎన్టిఆర్ జలసిరి కార్యక్రమం అమలుపై సంబంధిత శాఖల అధికారులతో కలెక్టరు సమీక్షించారు.
ఈ సందర్భంగా భాస్కర్ మాట్లాడుతూ ఎన్టిఆర్ జలసిరి-2 పథకం కింద పశ్చిమ గోదావరి జిల్లాలో 4 వేల వ్యవసాయబోర్లకు సోలార్ యంత్రాలు అందించాలని లక్ష్యంకాగా ఇంతవరకు కేవలం 685 లక్ష్యాన్ని పూర్తి చేయడంపై కలెక్టరు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఎన్టిఆర్ జలసిరి పథకం రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నదని, ఈ పథకం అమలులో అలసత్వానికి తావులేకుండా నిర్దేశించిన లక్ష్యాలను అధికారులు పూర్తి చేయాలన్నారు.
ఈ పథకం అమలుపై ప్రతీ వారం సమీక్షిస్తున్నప్పటికీ లక్ష్యసాధనలో ఎందుకు వెనుకబడి ఉంటున్నారని కలెక్టరు అధికారులను ప్రశ్నించారు. ఈ పనులలో ఎటువంటి ప్రగతి లేకపోవడంపై కలెక్టరు అధికారుల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ, క్షేత్రస్థాయి సిబ్బంది పనితీరుపై సరైన పర్యవేక్షణ చేసి నిర్దేశించిన లక్ష్యాలను వేగవంతంగా పూర్తి చేయాలని, ఈ విషయంలో ఎవరు అలసత్వం వహించినా వారిపై చర్యలు తీసుకుంటామని కలెక్టరు హెచ్చరించారు. భూగర్భ జల శాఖ బోర్లు వేసేందుకు అనువైన ప్రాంతాలుగా గుర్తించిన ప్రదేశాలలో బోర్లు వేసేందుకు అవసరమైన పరిపాలనా ఆమోదం కొరకు ప్రతిపాదనలు వెంటనే సమర్పించాల న్నారు.
ఎన్టిఆర్ జలసిరి పథకంలో గుర్తించిన వ్యవసాయబోర్లకు సోలార్ యంత్రాలను ఏర్పాటుచేయాలన్నారు. సోలార్ యంత్రం యూనిట్ ధర 4.29 లక్షల రూపాయలను ఇందులో 90 శాతం మేర సబ్సిడీగా రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్నదన్నారు. సమావేశంలో డ్వామా పిడి వెంకటరమణ, ట్రాన్స్‌కో సూపరింటెండింగ్ ఇంజనీరు సిహెచ్.సత్యనారాయణరెడ్డి, నెడ్‌క్యాప్ జిల్లా మేనేజరు ప్రసాద్, భూగర్భ జల శాఖ అసిస్టెంట్ ఇంజనీరు ఎ .రమణరావు, ఇరిగేషన్, గృహ నిర్మాణ సంస్థ, ఇతర శాఖల అధికారులు పాల్గోన్నారు.


