ఎన్నికలకు సన్నద్ధం కావాలి: మంత్రులు
శ్రీకాకుళం, సెప్టెంబర్ 21 (న్యూస్‌టైమ్): శ్రీకాకుళం నగర పాలక సంస్థకు ఎప్పుడు ఎన్నికలు వచ్చినా విజయం తెలుగుదేశం పార్టీదేనని అందుకు నాయకులు, కార్యకర్తలు సన్నద్ధం కావాలని రాష్ట్ర మంత్రులు కింజరాపు అచ్చెన్నాయుడు, పరిటాల సునీత, ఎమ్పీ కింజరాపు రామ్మోహన్నాయుడు అన్నారు. నగరంలోని ఓ ప్రైవేటు హోటల్లో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో వారు పాల్గొని మాట్లాడారు. మున్సిపాలిటీ జనాభా తక్కువే అయినప్పటికీ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నగరపాలక సంస్థగా స్థాయి పెంచారని వారన్నారు. నగరంలోని 36 వార్డుల్లో వార్డు ఇన్ఛార్జీలు, నాయకులు, కార్యకర్తలు, విస్తృతంగా పర్యటించి ప్రజల సమస్యలు తెలుసుకుని పరిష్కరించాలని సూచించారు.
శాసన సభ్యురాలు గుండ లక్ష్మీదేవి నిరంతరం ప్రజల మధ్య ఉంటూ సమస్యలు తెలుసుకుని నగర అభివృద్ధికి ఎంతో శ్రమిస్తున్నారని అన్నారు. రేషన్ కార్డులు, గ్యాస్ కనెక్షన్లు అవసరమైన వారికి అందివ్వాలని త్వరలో వీటిని మంజూరు చేస్తామన్నారు. ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మంత్రి అచ్చెన్నాయుడు, ఇన్‌ఛార్జి మంత్రి పరిటాల సునీత సహకారంతో నగరాన్ని సమగ్రంగా అభివృద్ధి చేస్తున్నామన్నారు. అన్ని వార్డుల్లో సిమెంటు రోడ్లు, కాలువలు, సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామన్నారు. వార్డు ఇన్ఛార్జీలు తమ వార్డుల్లో చేయాల్సిన పనులు, సమస్యలు ఇంకా ఏమైనా ఉంటే దృష్టికి తీసుకువస్తే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
పార్లమెంటు నియోజకవర్గ పరిశీలకులు కాకి గోవిందరెడ్డి, నగర పార్టీ పరిశీలకులు మొదలవలస రమేష్, పార్టీ నగర అధ్యక్ష, కార్యదర్శులు మాదారపు వెంకటేష్, చిట్టి నాగభూషణం, తెలుగు యువత జిల్లా అధ్యక్షుడు కొర్ను ప్రతాప్, టిడిపి జిల్లా మాజీ అధ్యక్షులు చౌదరి నారాయణమూర్తి (బాబ్జీ), జిల్లా కార్యవర్గ సభ్యులు ముద్దాడ కృష్ణమూర్తి నాయుడు, అరవల రవీంద్రతో పాటు పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఉత్సాహంగా అథ్లెటిక్స్ ఎంపికలు
శ్రీకాకుళం, సెప్టెంబర్ 21 (న్యూస్‌టైమ్): శ్రీకాకుళం నగరంలోని స్థానిక కోడిరామ్మూర్తి (కేఆర్) మైదానంలో అథ్లెటిక్స్ పోటీలు ఉత్సాహంగా సాగాయి. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎంపికలకు జిల్లా నలుమూలల నుంచి పెద్దసంఖ్యలో విద్యార్థులు హాజరు కావడంతో మైదానంలో సందడి వాతావరణం నెలకొంది. బాలబాలికల విభాగంలో నిర్వహించిన ఎంపికలకు మంచి స్పందన వచ్చింది. అథ్లెటిక్స్ విభాగంలో పరుగుపందెం, హై జంప్, లాంగ్‌జంప్, డిస్కస్ త్రో, జావెలెన్ త్రో తదితర క్రీడాంశాల్లో ఈ ఎంపికలు జరిగాయి. ఎంపికైన జాబితాను త్వరలో వెల్లడిస్తామని స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ కార్యదర్శి ఎం.ఎస్.శేఖర్ తెలిపారు. ఎంపికల్లో వ్యాయామ ఉపాధ్యాయుల సంఘం ప్రతినిధులు ఎం.సాంబమూర్తి, పోలినాయుడు, ఎం.వి.రవణ, ఆనంద్ కుమార్, ఎన్.వి.రమణ, కె.రవికుమార్, తదితరులు పాల్గొన్నారు. కాగా వర్షానికి కేఆర్ మైదానంలో రన్నింగ్, లాంగ్‌జంప్ ట్రాకులు బురదమయం కావడంతో ఎంపికలను సమీపాన ఉన్న ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాల మైదానంలో నిర్వహించారు. మరోవైపు కేఆర్స్టేడియంలో ట్రాకులు బురదమయంగా మారడంతో క్రీడాకారులు అవస్థలు పడ్డారు.
ఆన్లైన్లో పోలింగ్ కేంద్రాల వివరాలు
శ్రీకాకుళం, సెప్టెంబర్ 21 (న్యూస్‌టైమ్): కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ప్రతి పోలింగ్ కేంద్రాన్ని ట్యాబ్‌ల సాయంతో ఫొటో తీసి జీపీఎస్ విధానంలో ఆన్లైన్లో కేంద్ర ఎన్నికల సంఘం వెబ్సైట్లో పొందుపరచాలని రెవెన్యూ అధికారులను ఎన్నికల సంఘం ప్రతినిధి, మాస్టర్ ట్రైనీ కె.మూర్తి ఆదేశించారు. నగరంలోని స్థానిక జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో తహసీల్దార్లు, ఎన్నికల డీటీలు, సర్వేయర్లుతో పోలింగ్ కేంద్రాలను ఆన్లైన్లో పొందుపరిచే విధానంపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మూర్తి మాట్లాడుతూ పోలింగ్ బూత్‌లలో తాగునీరు, విద్యుత్తు, ప్రజలు వెళ్లి వచ్చేందుకు అనువుగా తలుపులు, మరుగుదొడ్లు తదితర 19 కనీస ప్రాథమిక కనీస సౌకర్యాలు ఉండాలని కేంద్రం ఎన్నికల సంఘం నిర్ణయించిందన్నారు. అందుకు అనుగుణంగా ప్రస్తుతం ఉన్న పోలింగ్ కేంద్రాలు ఉన్నాయా, లేదా అనే అంశాన్ని ధ్రువీకరించేందుకు ఎన్నికల సంఘం బేసిక్ మినిమమ్ స్పెషాల్టీస్ యాప్‌ను రూపొందించిందన్నారు. ఈ యాప్ ఆధారంగా ట్యాబ్‌లతో ప్రతి పోలింగ్ కేంద్రం ఫొటో తీసి అనంతరం అందులో సూచించిన 19 అంశాలను నిర్ధరించిన అనంతరం ఆన్లైన్లో పొందుపరచాలన్నారు. ఈ కార్యక్రమం నిర్దిష్ట గడువులోగా పూర్తి చేయాలని, అందుకు తహసీల్దార్లు ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. అవగాహన సదస్సులో కలెక్టరేట్ సీ విభాగం పర్యవేక్షకులు రాజేశ్వరరావు, శ్రీకాకుళం డీఐవో గంగాధర్, ఎన్నికల డీటీ చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు.


