ఎన్‌ఐఆర్‌ఎఫ్‌కు అనుబంధ కళాశాలలు సమాచారం
- 82 Views
- wadminw
- September 9, 2016
- తాజా వార్తలు
విశాఖపట్నం, సెప్టెంబర్ 9 (న్యూస్‌టైమ్): కేంద్ర మానవ వనరుల శాఖ ప్రతిష్టాత్మకంగా అందించే నేషనల్ ఇనిస్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్(ఎన్ఐఆర్ఎఫ్)కు అనుబంధ కళాశాలలు పూర్తిస్థాయిలో సమాచారాన్ని అందించాలని ఏయూ వీసీ ఆచార్య జి.నాగేశ్వరరావు అన్నారు. శుక్రవారం సాయంత్రం ఏయూ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అసెంబ్లీ మందిరంలో నిర్వహించిన అవగాహన సదస్సును ఆయన ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ ఏయూకు మెరుగైన ర్యాంక్ లభిస్తే అనుబంధ కళాశాలలకు ఎంతో మేలు జరుగతుందన్నారు. అనుబంధ కళాశాలలు ఏయూలో భాగమనే విషయాన్ని మరువరాదన్నారు.
అందుబాటులో ఉన్న పూర్తి సమాచారాన్ని వెబ్సైట్లో అప్లోడ్ చేయాలని సూచించారు. బోధన, అభ్యసనం, పరిశోధన, ఉపాధి కల్పన, విదేశీ విద్యార్థులు, ప్రత్యేక సామర్ధ్యాలు కలిగిన విద్యార్థులు వంటి అనేక అంశాలను పరిశీలించి ర్యాకింగ్ను అందించడం జరుగుతుందన్నారు. ఉన్నత విద్యామండలి ఉపాద్యక్షుడు ఆచార్య పి.విజయ ప్రకాష్ మాట్లాడుతూ విశ్వవిద్యాలయాలు, కళాశాలలు బ్రాండింగ్‌ను సొంతం చేసుకోవడం ఎంతో అవసరమన్నారు. నాణ్యత కలిగిన విశ్వవిద్యాలయాలు, కళాశాలలకు ఎంహెచ్ఆర్డి ర్యాంకింగ్‌లు అందించడం జరుగుతుందన్నారు.
అనుబంధ కళాశాలలతోనే వర్సిటీ పటిష్టత సాధ్యపడుతుందన్నారు. నాణ్యమైన విద్యకోసం తల్లితండ్రులు ఖర్చుకు వెనకాడటం లేదన్నారు. విద్యార్థులు నాణ్యమైన విద్యకోసం ఇతర రాష్ట్రాలకు తరలి పోతున్నారన్నారు. రాష్ట్రంలో విద్యా రంగాన్ని బలోపేతం చేయడం వలన వలసలను నివారించడం సాధ్యపడుతుందన్నారు. కార్యక్రమంలో రెక్టార్ ఆచార్య ఇ.ఏ నారాయణ, రిజిస్ట్రార్ ఆచార్య వి.ఉమామహేశ్వరరావు, సిడిసి డీన్ ఆచార్య టి.కోటేశ్వరరావు ప్రసంగించారు. ఏయూ కంప్యూటర్ సెంటర్ సంచాలకురాలు ఆచార్య వి.వల్లీ కుమారి ఎన్ఐఆర్ఎఫ్పై అవగాహన కల్పించారు. సమావేశంలో ఏయూ అనుబంధ కళాశాలల కరస్పాండెంట్స్, ప్రిన్సిపాల్స్, నోడల్ అధికారులు పాల్గొన్నారు.


