ఎరువుల విక్రయంలో ఎంఎఫ్ఎంఎస్ విధానం
- 69 Views
- wadminw
- January 15, 2017
- Home Slider రాష్ట్రీయం
ఎరువుల విక్రయంలో పారదర్శకత, అక్రమాల అడ్డుకట్టకు కేంద్ర ప్రభుత్వం మొబైల్ బేస్డ్ ఫర్టిలైజర్ మానిటరింగ్ సిస్టం (ఎంఎఫ్ఎంఎస్)ను తీసుకువచ్చింది. ఈ పద్ధతిలో ఎరువుల కొనుగోలు, విక్రయం చేపట్టేందుకు తప్పనిసరిగా డీలర్లందరూ వారివారి వివరాలను ఆన్లైన్లో నమోదు చేసుకోవాలని వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకుడు రవికుమార్ తెలిపారు. ఇకపై తప్పనిసరిగా డీలర్లందరూ ఫర్టిలైజర్ మానిటరింగ్ సిస్టం ద్వారానే ఎరువుల విక్రయం చేపట్టాలన్నారు. 2012 నుంచి ఈ విధానం అమలులో ఉన్న ఇప్పటివరకు 80శాతం మంది డీలర్లు మాత్రం నమోదు చేసుకున్నారని, వారిలో కూడా ఎక్కువ శాతం మంది మొబైల్ నంబర్లను మార్పు చేశారన్నారు.
డీలర్లు ఎట్టి పరిస్థితుల్లోను మొబైల్ నంబరును మార్పు చేయరాదన్నారు. ఈ విధానం ద్వారా కంపెనీ నుంచి గోదాంకు, అక్కడి నుంచి డీలరుకు ఏ మేరకు ఎరువు పంపిణీ జరిగింది, డీలర్ వద్ద ఎంత ఎరువు నిల్వ ఉంది, రైతుకు డీలరు సక్రమంగా ఎరువును అందచేస్తున్నాడా? తదితర విషయాలను ఎప్పటికప్పుడు గుర్తించవచ్చునన్నారు. ఫర్టిలైజర్ మానిటరింగ్ సిస్టంపై డివిజన్ల స్థాయిలో కూడా డీలర్లకు శిక్షణ ఇస్తామన్నారు. ఎల్పీజీ గ్యాస్ రాయితీ మాదిరిగానే.. ఎరువులపై అందుతున్న రాయితీని నగదు బదిలీ పద్ధతిలో కొనుగోలు చేసిన రైతు బ్యాంకు ఖాతాలో జమ చేసే విధానాన్ని రానున్న ఖరీఫ్ నుంచి ప్రారంభించడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. ఈ విధానంలో ఎరువులను రైతు పూర్తిగా నగదు చెల్లించి కొనుగోలు చేయాల్సి ఉంటుందని తెలిపారు. వ్యవసాయాధికారులు, డీలర్లందరూ ఎఫ్ఎంఎస్పై పూర్తి స్థాయిలో అవగాహన పొందాలని జేడీ సూచించారు.


