ఎవరి చరిత్రను నమ్మాలి?
సెప్టెంబర్ 17… ఈ దినం తెలంగాణలో ఓ చారిత్రక ఘటంగా చెప్పుకోవచ్చు. ఒక రాజ్యం పై భారత్ యుద్దం ప్రకటించిన తమ ఆదీనంలోకి తీసుకున్న రోజు. అంతేకాదు ఇదే రోజు కొన్ని వేల మందిని పొట్టన పెట్టుకున్న రోజు కూడా. ఒకవైపు రాజాకార్లు, మరోవైపు ఇండియన్ పోలీసులు, అంతేకాదు తెలంగాణ సాయుధ పోరాటయోధులు, మధ్యలో తెలంగాణ జనం వెరసీ నాటి హైదరాబాద్ రాష్ట్రం రక్తపు టేరులు పారాయి. కానీ ఇక్కడ ఒక్కో పార్టీ ఒక్కో విధంగా ప్రకటనలు చేస్తూ ముందుకు పోతున్నారు. ఇంతకీ సెప్టెంబర్ 17 తెలంగాణ విద్రోహ దినమా? విమోచన దినమా?
విలీన దినమా? అన్నది ఇప్పుడు తెలియాల్సి ఉంది. అయితే గతంలో నిజాం నవాబుల కాలంలో రక్షణ దళంగా ఉన్న రాజకార్కు కాసీం రజ్వీ నేతృత్వంలో పనిచేసిన దురాగతాలు ఇంతా అంతాకాదు. మహిళలను చెరపడం, అడ్డం వచ్చిన వారిని దుర్మార్గంగా హంతం చేయడం వంటి ఘోరాలు ఎన్నో జరిగాయి. కానీ, కాసీం రజ్వీని, నిజాం వ్యవహార శైలిని ఆనాడే ఎంతో మంది ముస్లిం మేధావులు వ్యతిరేకించారు.
బాకర్ అలీ మీర్జా, ముల్లా అబ్దుల్ బాసిత్, ఫరీధ్ మీర్జా నవాబ్ మంజూర్ జంగ్, నవాబ్ ఆహ్మాద్ మీర్జా, మహ్మద్ హుసేన్ జాప్రీ, హుసేన్ అబ్దుల్ మునీవ్ వంటి సామానయ ముస్లిం ప్రజల పక్షాన నిలబడి నిజాం నిలదీశారు. కాసీం రజ్వీ నియంతపు పొకడలను, రాజాకార్ల దురాగతలాను ఖండించారు. ఇందులో చాలామంంది విదేశాల్లో చదువుకున్న అడ్వకేట్, జర్నలిస్టు, మేధావులు ఉన్నారు. అయితే వీరి పేర్లు కానీ వీరి పోరాట పటిమ గాని నేటి బీజేపీ నాయకులకు తెలియదు! ఎందుకంటే వారికి ఆ అవసరంలేదు.
ఈ రోజు దేశంలో ఉత్తర భారతదేశమే ఆదిపత్యం చెలాయిస్తుంది. ఉత్తర భారతదేశంలో ఒకటైన గుజరాత్ పేరు మార్మోగుతోంది. దళితులపై దాష్టికానికి వ్యతిరేకంగా ఆహ్మదాబాద్ నుంచి ఉనా వరకు ఉద్యమకారులు ప్రజా చైతన్య యాత్ర చేశారు. 15 అగష్టు నాడు అక్కడ సభ జరిపి దళితులకు ఇంకా స్వాతంత్య్రం రాలేదని తేల్చి చెప్పారు. గాంధీ, పటేల్‌ను స్వరాజ్య ప్రదాతలుగా, మోడీని సురాజ్య నిర్మాతగా బీజేపీ ప్రచారం చేస్తోంది. వీళ్ళు ముగ్గురూ గుజరాతీయులే! ఇప్పుడు దేశంలో లౌకిక, ప్రజాస్వామిక వాదులందరూ ఈ ముగ్గురినీ వివిధ కారణాలతో వ్యతిరేకిస్తున్నారు. సర్ధార్ వల్లబాయ్ పటేల్‌ని సెక్యులర్ విలువలకు తిలోదకాలిచ్చిన హిందూత్వ వాదిగానే చూస్తున్నారు.
నరేంద్ర మోడీని ఆయన వారసుడిగా గుర్తిస్తున్నారు. అయితే తాజాగా కేంద్ర బీజేపీ 70 ఏండ్ల స్వాతంత్య్ర వేడుకల సందర్భంగా తిరంగా యాత్రను చేపట్టింది. ఆగస్టు 15 నుంచి 22 వరకు దేశంలోని వివిధ ప్రాంతాల్లో యాత్రను నిర్వహించారు. ఈ సందర్భంగా స్వాతంత్య్ర సమరయోధల జన్మ స్థలాల్లో సభలు, సమావేశాలు నిర్వహించారు. ఆ పార్టీకి చెందిన 66 మంది మంత్రులు, ఎంపీలు గత నెలలో దేశ మంతటా ఉత్సవాల్లో పాల్గొన్నారు. అయితే ఈ ఉత్సవాలను సెప్టెంబర్ 17 వరకు కొనసాగించాలని మోడీ హైదరాబాద్‌కు వచ్చి పిలుపునిచ్చారు.
నరేంద్ర మోడీ పిలుపునందుకున్న ఆ పార్టీ నాయకులు తెలంగాణ విమోచన దినోత్సవాల ను ప్రభుత్వమే గోల్కొండ కోటలో అంగరంగ వైభవంగా నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు. అంతేకాకుండా ఈ నెల 17న బీజేపీ పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్ షాను పిలిపించి వరంగల్‌లోని భారీ బహిరంగ సభ నిర్వహించడానికి, జన సమీకరణకు ప్రయత్నాలు చేస్తున్నది. తాము తెలంగాణలో అధికారంలోకి రావాలంటే అందుకు తెలంగాణ విమోచన దినోత్సవాలు అంశం రహదారి అని బీజేపీ భావిస్తోంది. ఇందుకు అనుగుణంగానే అడుగులు వేస్తోంది.
హైదరాబాద్‌లో ఆ మధ్య నిర్వహించిన తిరంగా యాత్రలో కేంద్ర మంత్రి ఎం. వెంకయ్య నాయుడు పాల్గొంటూ మహారాష్ట్ర, కర్నాటకల్లో ఉత్సవాలను అధికారికంగా నిర్వహిస్తున్నారు. తెలంగాణలో కూడా అధికారికంగా విమోచనదినోత్సవాలను నిర్వహించాలని, అలాగే ఆనాటి పోరాట యోధుల జీవిత చరిత్రలను పాఠ్యాంశాలుగా చేర్చాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. విమోచననోత్సవల్లో అసువులు బాసిన వారిని స్మరించు కోవాలి. గతాన్ని మరిస్తే ఏ జాతీ ముందుకు పోలేదని ఆ సభలో వెంకయ్య అన్నారు. వాస్తవానికి పాక్షిక చరిత్రను చెబుతూ తమ పబ్బం గడుపుకునేవారు నిష్పాక్షిక, సమగ్ర చరిత్ర తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. బీజేపీ స్వీయ రాజకీయ ప్రయోజనాల కోసం హిందూ ముస్లిం సఖ్యతను దెబ్బతీసేందుకే ఈ విమోచన ఉత్సవాల వ్యవహారం ప్రతిఏటా ముందుకు తీసుకోస్తున్నారు.
మతపరమైన విద్వేషాలను రెచ్చగొట్టి రాజకీయ ప్రయోజనాలు పొందాలని ఆ పార్టీ ప్రయత్నిస్తోంది. విషాదమేంటంటే ఈ మాయలో కమ్యూనిస్టు పార్టీలు కూడా పావులుగా మారుతున్నయి. బీజేపీ రజాకార్ల దురాగతాల్లో చనిపోయిన వారిని దృష్టిలో పెట్టుకుని వారి ఆత్మలకు నివాళి అర్పిస్తూ వారి పోరటాన్ని స్మరిస్తున్నది. హైదరాబాద్‌పై పోలీసు చర్య పేరిట ఇండియన్ యూనియన్ సైన్యం దాడి చేసి అధికారాన్ని తమ ఆధీనంలోకి తీసుకుంది. రజాకార్ల దురాగతాలకు వంద మంది హతులయ్యారు. వరంగల్ జిల్లాల్లోని భైరాన్ పల్లి, పరకాల ఇందుకు సజీవ సాక్ష్యాలు. వీటిని ఎవ్వరూ కాదనలేరు. దీనిని ముమ్మాటికి ఖండించాల్సిందే. ఈ దురాగతాలను తెగబడ్డ కాసీం రజ్వీ, ఆయన మూక 1957 వరకు జైలు శీక్ష అనుభవించారు. రజ్వీ 1957లో జైలు నుంచి విడుదలై ఆ తరువాత పాకిస్తాన్ వెళ్లి అక్కడ అనామకంగా చనిపోయారు.
ఇది ఒక భాగం. అయితే బీజేపీ ఈ భాగాన్ని మాత్రమే చెబుతుంది. అయితే పటేల్ పంపించిన ఇండియన్ సైన్యం 1948 సెప్టెంబర్ 13 నుంచి 17 మధ్యకాలంలో 5 రోజుల్లో కొన్ని వేల మంది ఊచ కోత కోసింది. ఇదే సంఘటనపై సుందర్ లాల్ కమిటీ, హైదరాబాద్‌పై విడుదల చేసిన శ్వేతపత్రంలో పూర్తి వివరాలను పొందు పరిచింది. ఈ ఊచకోత ఎక్కువగా ఒకప్పటి హైదరాబాద్ రాజ్యంలోని మహరాష్ట్ర, కర్నాటక ప్రాంతాల్లో జరిగింది. ఈ రాష్ట్రాల్లో బిజెపి అధికారంలో ఉన్నప్పుడే విమోచనను ఉత్సవాలుగా నిర్వహించడం ప్రారంభించారు. వాస్తవాలను ఒక్కసారి గమనిస్తే తెలంగాణలో ఇలాంటి ఊచకోతలు జరుగలేదు. దానికి ప్రధాన కారణం కమ్యూనిస్టుల ప్రాబల్యం ఎక్కువగా ఉండడం.
అలాగే హైదరాబాద్‌లో నిజాం సైన్యం, పోలీసులు కేంద్రీకృతమై ఉన్నారు. దాంతో హైదరాబాద్‌లో కూడా చెదురు ముదురు సంఘటనలు తప్పా తీవ్రమైన రక్తపాతం ఏమీ జరగలేదు. హైదరాబాద్‌లో పటేల్ మనిషి కె.ఎం.మున్షీ భారత ప్రతినిధిగా ఉండేవాడు. ఈ మున్షీ హెచ్చరిక లాంటి సలహా మేరకు నిజాం సెప్టెంబర్ 17న లొంగిపోయిండు. అందుకే హకీంపేట ఎయిర్‌పోర్టులో భారత సైన్యానికి నిజాం సర్వసైన్యాధి కారి జనరల్ ఎల్ ఇద్రూస్ స్వాగతం పలికారు. తెలంగాణ విమోచనకు ముస్లిం రాజును గద్దెదించిన హిందూ ఉప ప్రధానిగా పటేల్‌ని బిజెపి చూస్తున్నది. అందుకే ముస్లింలపై హిందువుల గెలుపుగా దీన్ని ప్రచారం చేస్తున్నారు. దీనికి పటేల్‌కు వంగి దండం పెడ్తున్న నిజాం ఫోటోను వాడుకుంటున్నరు.
బిజెపికి కాసిం రజ్వీ దురాగతాలు ఒక సాకు మాత్రమే! రజ్వీ మూక చేతిలో హతుడైన ఇమ్రోజ్ పత్రికా సంపాదకుడు షోయెబుల్లాఖాన్ కూడా వీరికి ఆరాధ్యుడు. ఎందుకంటే ఇక్కడ ఒక్క దెబ్బకు రెండు ప్రయోజనాలున్నాయి. ఒకటి తాము ముస్లింల తరపున కూడా మాట్లాడుతున్నాం అని చెప్పుకోవడానికి షోయబ్ హత్య ఒక అవకాశాన్ని కల్పించింది. అలాగే ప్రజా వ్యతిరేకుడైన రజ్వీని తెగనాడ డానికి, దాని ఆసరాగా ముస్లింలను హింసోన్మాదులుగా చూపెట్టడానికీ సందర్భమూ కలిసోస్తుంది. అందుకే ఈ సంఘటనను తమ కార్యక్రమాల జాబితాలో భారతీయ జనతాపార్టీ చేర్చుకుంది. దీనిని బట్టి గమనిస్తే సెప్టెంబర్ 17ను విమోచన దినంగా చెప్పుకోవచ్చా అన్నది కేంద్రంలో ఇప్పుడున్న బీజేపీనే చెప్పాలి.


