ఎస్సీ జాబితాల్లో రజకులను చేర్చే ప్రణాళిక
- 95 Views
- wadminw
- September 21, 2016
- రాష్ట్రీయం
కాకినాడ, సెప్టెంబర్ 21 (న్యూస్‌టైమ్): రజక సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన నిధులు పూర్తిగా సద్వినియోగం అయ్యేలా చూడాలని రాష్ట్ర రజక సహకార సంఘాల సమాఖ్య చైర్మన్ రాజమండ్రి నారాయణ పేర్కొన్నారు. జిల్లాకు సంబంధించి రజక సంక్షేమ కమిటీని వెంటనే ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా సమాఖ్య కార్యక్రమాల పరిశీలన నిమిత్తం కాకినాడ వచ్చిన ఆయన బుధవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాల వారీగా రజక సంక్షేమం నిమిత్తం అమలువుతున్న కార్యక్రమాలను అధికారులతో సమీక్షిస్తున్నట్టు తెలిపారు. తూర్పుగోదావరి జిల్లాలో గత మూడేళ్లుగా జిల్లా రజక సంక్షేమ కమిటీ ఏర్పాటు కాకపోవడం దురదృష్టకరమన్నారు. జిల్లాకు 2014-15లో రజక సంక్షేమం నిమిత్తం ప్రభుత్వం రూ.7కోట్ల నిధులను కేటాయిస్తే కేవలం నాలుగు కోట్లను మాత్రమే ఖర్చు చేశారన్నారు. అధికారుల్లో చిత్తశుద్ధి కొరవడిందని, ఫెడరేషన్ చైర్మన్‌గా జిల్లాలో పర్యటిస్తున్న తనకు జిల్లాలో ప్రోటోకాల్ పాటించలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు.
జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జిల్లా బిసి సంక్షేమాధికారి కన్వీనర్‌గా ఎస్పీ, డిసిఓ, డిపిఓ సభ్యులుగా నెల రోజుల్లోగా కమిటీని ఏర్పాటు చేసి ప్రతి మూడు నెలలకొకసారి బోర్డు మీటింగ్‌లు నిర్వహించేలా చూడాలని అధికారులను కోరారు. రజకులను ఎస్సీల్లో చేర్చే అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో చేపట్టిందన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర రజక సంఘాల ప్రతినిధులు గంధం రవికుమార్, కాకినాడ రామారావు, కట్టమూరు సత్తిరాజు, జిల్లా రజక సంఘాల ప్రతినిధులు జి.శ్రీనివాసరావు, మురమళ్ళ రాజబాబు, ఇరుసుమళ్ళ విష్ణు తదితరులు పాల్గొన్నారు.
సమిష్టి కృషితో స్మార్ట్ కాకినాడ: వైకాపా నేత కన్నబాబు
కాకినాడ, సెప్టెంబర్ 21 (న్యూస్‌టైమ్): వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు సమాయత్తమైంది. రేపో.. మాపో.. కాకినాడ కార్పొరేషన్‌కు ఎన్నికలు జరగడం ఖాయంగా కన్పిస్తున్న వేళ ఆ పార్టీ అధినాయకత్వం ప్రత్యేకంగా పరిశీలకులను నియమించి కదన రంగంలోకి ఉరకడానికి కేడర్‌ను సమాయత్తపరుస్తోంది. అందులో భాగంగా నగరంలోని సూర్య కళా మందిరం వేదికగా పార్టీ పెద్దలంతా ఇందుకోసం విచ్చేశారు. బుధవారం 11 గంటలకు సభ ప్రారంభం కాగానే జిల్లా అధ్యక్షులు కురసాల కన్నబాబు అధ్యక్షతన సమావేశం జరిగింది. వేదికపై పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నవంబర్ లోగా కాకినాడ కార్పొరేషన్‌కు ఎన్నికలు జరపమని కోర్టు సూచించడంతో ఎన్నికలు నిర్వహించడానికి యంత్రాంగం సన్నద్ధమౌతోందన్నారు. ఈ నేపథ్యంలో కార్పొరేషన్‌ను కచ్చితంగా కైవసం చేసుకోవాలన్న ధ్యేయంతో పార్టీ ముందుకు నడవాల్సిన ఆవస్యకత ఎంతైనా ఉందన్నారు. ఇందుకు సంబంధించి కార్యాచరణను ప్రకటిస్తామని పేర్కొన్నారు. ఎన్నికలు అయ్యేంత వరకూ నేతలెవ్వరూ విశ్రమించరని, అందుకు తోడుగా కేడర్ కూడా కదిలివచ్చి విజయం చేకూర్చిపెట్టాలన్నారు. ఆరు సంవత్సరాలుగా ఈ నగరానికి ఎన్నికలు లేకుండా పాలకులు నెట్టుకొచ్చారన్నారు. అదే నేపథ్యంలో అధికార తెలుగుదేశం పార్టీ విధానాలతో ప్రజానీకం విసిగి వేసారి ఉందన్నారు. వైసీపీ అధినేత వైఎస్.జగన్ సూచించిన క్రమంలో నిర్వహించిన గడపగడపకూ కార్యక్రమంలో ప్రభుత్వంపై వ్యతిరేక స్పందన కొట్టొచ్చినట్టు కన్పించిందన్నారు. దీనిని ఓట్లుగా మలుచుకోవడంలో మనం ముందుండాలన్నారు. నిజానికి టిడిపిని ఎన్నుకుని తప్పు చేశామన్న భావన ప్రజా స్పందనలో స్పష్టమైందన్నారు. ఆ వ్యతిరేకత ఒక్కటే కాకుండా మనవంతు కూడా కష్టపడితే అనేక డివిజన్లతో సహా మేయర్ స్థానం మనదే అవుతుందన్నారు. మనందరినీ నడిపించడానికే సీనియర్ నేతలంతా వచ్చారని, వేదికపై ఉన్న మాజీ మంత్రులు బొత్స సత్యనారాయణ, పిల్లి సుభాష్ చంద్రబోస్, కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి, మరో ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, పార్టీ నాయకుడు చలమలశెట్టి సునీల్ కార్పొరేషన్ ఎన్నికలకు ఇన్‌చార్జ్‌లుగా వ్యవహరిస్తారన్నారు. వీరందరినీ సమన్వయం చేసుకుంటూ జిల్లా ఇన్చార్జ్ ధర్మాన ప్రసాదరావు ఇచ్చే సూచనలు, సలహాలు అందరం పొంది జగన్‌కు సీటు పువ్వుల్లో పెట్టి అప్పగించాలన్నారు. ఎన్నికల నేపథ్యంలో అధినేత జగన్ హైదరాబాద్‌లో ప్రత్యేక భేటీ నిర్వహించి.. కాకినాడ ఎన్నికలపై దిశా నిర్దేశం చేశారన్నారు. స్మార్ట్‌సిటీ ప్రకటించి సంవత్సరంన్నర దాటిందని, పుట్టిన రోజులు చేస్తున్నారు తప్ప.. పట్టుమని రూ.పది కోట్లు కూడా ఖర్చు పెట్టలేకపోయారని కన్నబాబు ఎద్దేవా చేశారు. రూ.2వేల కోట్లు ఇచ్చామంటున్నారు గానీ.. ఇంత వరకూ ఖర్చు పెట్టింది రూ.53లక్షలేనన్నారు. పబ్లిక్, ప్రైవేట్ భాగస్వామ్యమంటూ షాపింగ్ మాల్స్, వగైరాలకు ఖర్చు పెట్టడానికి ఈ నిధులు వినియోగిస్తున్నారని, ఇందు కోసం వెయ్యి కోట్లు కేటాయిస్తూ రాష్ట్రం, కేంద్రం చెరిసగం భరించాల్సి ఉండగా రూ.326 కోట్లే ఖర్చు చేశారని గుర్తు చేశారు. అంతకు ముందు కాకినాడ సిటీ నియోజకవర్గ కోఆర్డినేటర్ ముత్తా శశిధర్ కాశ్మీర్ సరిహద్దులో భారత సైనికులు 18 మంది పాక్ ముష్కరుల చేతిలో అన్యాయంగా బలైపోవడాన్ని నిరసిస్తూ తీర్మానం ప్రవేశ పెట్టారు. అనంతరం సభ మౌనం పాటించి మరణించిన సైనికులకు నివాళులర్పిస్తూ.. వారి కుటుంబాలకు సంతాపం ప్రకటించింది. పాక్ విషయంలో కేంద్రం ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా తమ పార్టీ వెన్నంటే ఉంటుందన్నారు. కాగా పిల్లి సుభాష్ చంద్రబోస్ మాట్లాడుతూ ఎన్నికల వేళ మనలో మనకు ద్వేషాలు లేకుండా సఖ్యతతో కొనసాగాలని, ఒక్క ఓటు పోయినా ప్రాణంతో సమానంగా సేకరించి ఓటు వేయించాలని కేడర్‌కు సూచించారు. చలమలశెట్టి సునీల్ మాట్లాడుతూ పేరుకే స్మార్ట్ సిటీ తప్ప అభివృద్ధి ఆవగింజంత కూడా లేదని విమర్శించారు. మాజీ ఎమ్మెల్యే చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ కాకినాడ ఎన్నికల్లో అధికార తెలుగుదేశం పార్టీని మనం ఎదుర్కోవడం లేదని, రెవెన్యూ పోలీస్ యంత్రాంగాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని గుర్తుచేశారు. అందుకే అధినేత జగన్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని ఇక్కడ ఇన్చార్జ్గా నియమించారన్నారు. సమావేశంలో మాజీ మంత్రి ముత్తా గోపాలకృష్ణ మాట్లాడుతూ సమిష్టిగా కాకినాడ ఎన్నికను ఎదుర్కొని, సవాల్‌గా తీసుకుని వైసీపీ ఖాతాలో వేసుకుందామన్నారు. ఈ సమావేశంలో నగర పార్టీ కన్వీనర్ ఆర్‌విజెఆర్.కుమార్ (ఫ్రూటీకుమార్), ముత్యాల శ్రీనివాస్, బందన హరి, అత్తిలి సీతారామస్వామి, మట్టపర్తి రఘురామ్, పసుపులేటి వెంకటలక్ష్మి, సమ్మంగి దుర్గాభవానీ, రామలక్ష్మి, శ్రీలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
భవన నిర్మాణ కార్మికుల కుటుంబాలకు చెక్కులు పంపిణీ
కాకినాడ, సెప్టెంబర్ 21 (న్యూస్‌టైమ్): భవన నిర్మాణ కార్మికుల కుటుంబాలకు బుధవారం కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు స్వగృహంలో ఆరుగురు బాధిత కుటుంబాలకు రూ.6లక్షల 70వేలు చెక్కులను అందజేశారు. శ్రీపతి గంగాధర్ యాక్సిడెంట్లో చనిపోతే వారి కుటుంబానికి రూ.5లక్షల 20వేలు, కటారి కాంతం సహజ మరణం చెందితే రూ.80వేలు, కార్మికుల కుటుంబాల ప్రసూతి సహాయం కింద నలుగురికి రూ.80వేలు చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా వనమాడి మాట్లాడుతూ భవన కార్మికులు సంవత్సరానికి రూ.12లు చొప్పున కట్టే బోర్డులో సభ్యులుగా చేరితే వారి కుటుంబానికి సహాయం కింద రూ.5లక్షలు, సహజ మరణం చెందితే రూ.80వేలు, ప్రసూతి సహాయం కింద రూ.20వేలు, శాశ్వత అంగవైకల్యానికి రూ.50 నుండి రూ.5లక్షల వరకూ కార్మిక శాఖ ద్వారా ఇవ్వడం జరుగుతుందని, అసంఘటిత కార్మికులందరికీ వర్తిస్తుందన్నారు. చంద్రన్న బీమా పథకం ద్వారా లారీ డ్రైవర్స్ వర్కర్స్కు రూ.5లక్షల ప్రమాద బీమా ఇవ్వడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కార్మిక శాఖ కాకినాడ జోన్ 1.2 సర్కిల్ అధికారులు పిఎస్.మహేష్, టి.నాగలక్ష్మి, గదుల సాయిబాబా, పసుపులేటి వెంకటేశ్వరరావు, మోసా పేతూరు, కోడూరి కుమారి, స్వామి (పెద్ద) తదితరులు పాల్గొన్నారు.


