ఎస్ఐ వేధింపులవల్లే గుర్రప్ప మృతి
- 100 Views
- wadminw
- September 6, 2016
- తాజా వార్తలు
కర్నూలు, సెప్టెంబర్ 6 (న్యూస్‌టైమ్): సంజమల మండలం కానాల గ్రామంలో ఎస్ఐ వేధింపువల్లే గుర్రప్ప మృతి చెందాడని అతని బంధువులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఒకే కుటుంబానికి చెందిన రాములు, గుర్రప్పల మధ్య కొంతకాలంగా వివాదం జరుగుతోంది. ఈ నేపథ్యంలో గుర్రప్ప సంజమల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఎస్ఐ విజయ కుమార్ జోక్యం చేసుకుని ఇరువురి మధ్య సయోధ్య చేయాల్సిందిపోయి గుర్రప్పను వేధింపులకు గురిచేశాడు. వేధింపులు భరించలేక అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడని అన్నారు. గుర్రప్ప మృతికి ఎస్ఐ వేధింపులే కారణమని కుటుంబ సభ్యులు తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు.
పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, అన్నదమ్ములకు సంబంధించిన చిన్న కేసు విషయంలో సంజామల పోలీసులు కొట్టిన దెబ్బలకు వ్యక్తి మృతి చెందాడని ఆరోపిస్తూ ఖానాల గ్రామస్థులు ధర్నాకు దిగారు. గ్రామానికి చెందిన గుర్రప్ప, అతని తమ్ముడు తిరుపాల్‌కు పొలం విషయంలో చిన్న వివాదం జరిగింది. ఈ విషయమై తమ్ముడు కేసు పెట్టడంతో ఆగస్టు 27న గుర్రప్పను స్టేషన్‌కు పిలిపించి పోలీసులు కొట్టారని గుర్రప్ప బంధువులు ఆరోపిస్తున్నారు. మంగళవారం తెల్లవారుజామున గుర్రప్ప మృతి చెందటంతో పోలీసుల దెబ్బలు తాళలేకనే మృతి చెందాడని తమకు న్యాయం చేయాలంటూ గ్రామస్థులు మృత దేహంతో పొలీస్టేషన్ ఎదుట ధర్నా నిర్వహిస్తున్నారు. ఆళ్లగడ్డ డీఎస్పీ ఈశ్వరరెడ్డి, కోవెలకుంట్ల సీఐ కేశవరెడ్డి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ధర్నాకు బనగానపల్లి మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి మద్దతు పలికారు. సంజామల ఎస్సై విజయభాస్కర్‌పై కేసు నమోదు చేయాలని డిమాండు చేస్తున్నారు.
గిట్టుబాటు ధరకోసం రైతుల ఆందోళన
కర్నూలు, సెప్టెంబర్ 6 (న్యూస్‌టైమ్): నియోజకవర్గ కేంద్రమైన పత్తికొండలో టమోటకు గిట్టుబాటు ధర లభించలేదని రైతులు మంగళవారం ఆందోళనకు దిగారు. సిపిఐకి అనుబంధంగా ఉన్న రైతుసంఘం ఆధ్వర్యంలో వ్యవసాయ మార్కెట్ వద్ద ఆందోళనకు దిగారు. మార్కెట్ ఉద్యోగులు, రైతులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. టమోటకు గిట్టుబాటు ధరవచ్చేలా అధికారులు ప్రకటన చేయడంతో ఆందోళనను విమరించారు. మరోవైపు, ఆదోని పట్టణంలోని బీరలింగేశ్వర స్వామి దేవాలయంలో వర్షాలు కురవాలని శివుడికి స్థానిక కాలనీ యువత మంగళవారం శివుడికి 1001 బిందెలతో జలాభిషేకం నిర్వహించారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు బిందెలతో నీటిని తెచ్చి శివలింగానికి అభిషేకం చేశారు. కరువు దూరం చేసి వర్షాలు సమృద్ధిగా కురవాలని పూజలు చేశారు. కాలనీ పెద్దలు, ఆలయ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.
చవితి వేడుకల్లో పునీతులవుతున్న భక్తులు
కర్నూలు, సెప్టెంబర్ 6 (న్యూస్‌టైమ్): వినాయక చవితి సందర్భంగా పట్టణంలోని వాడవాడలా వినాయక విగ్రహాలు ఏర్పాటుచేశారు. తొమ్మిది రోజులపాటు గణనాథులకు పూజలు నిర్వహిస్తారు. రోజుకోవిధంగా స్వామివారికి పూజలు నిర్వహిస్తున్నారు. గణపతులను దర్శించేందుకు భక్తులు అత్యుత్సాహంతో వస్తున్నారు. వివిధ రంగుల విద్యుద్దీపాలతో గణపతి వేదికలను అలంకరించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ యంత్రాంగం గట్టి బందోబస్తు చర్యలు చేపట్టింది. కాగా, బనగానపల్లి మండల పరిధిలోని నందవరం గ్రామంలో చౌడేశ్వరీదేవి ఆలయ రాజగోపుర నిర్మాణానికి గ్రామానికి చెందిన పి.చెన్నకేశవరెడ్డి, సరోజమ్మ దంపతులు రూ.51,116ల విరాళాన్ని ఆలయ ఛైర్మన్ కుమార్‌రెడ్డికి మంగళవారం అందజేశారు. కార్యక్రమంలో ఆలయ అధికారి రామానుజన్, సిబ్బంది పాల్గొన్నారు. కాగా, ఆళ్లగడ్డ మండలంలోని అహోబిలం లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో స్వామివారి జన్మ నక్షత్రమైన స్వాతిని పురస్కరించుకుని మంగళవారం స్వాతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. వెంకటేశ్వర స్వామి ఆలయ ఆవరణలో శ్రీ ప్రహ్లాద వరద శ్రీదేవి భూదేవి అమ్మవార్ల ఉత్సవమూర్తులను కొలువుంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద మంత్రాలతో ఉత్సవమూర్తులకు ఎదురుగా సుదర్శన హోమం చేశారు. ఈ వేడుకల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఆలయ ఈవో వాణి, ప్రధాన అర్చకులు వేణుగోపాలన్ ఆధ్వర్యంలో ఈ వేడుకలు నిర్వహించారు. ప్రతి నెల స్వాతి నక్షత్రం రోజున ఈ వేడుకలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. కాగా, ఆదోని పట్టణంలోని సంతపేట పాఠశాలలో మంగళవారం నందమూరి యువసేన ఆధ్వర్యంలో నందమూరి బాలక్రిష్ణ తనయుడు మోక్షజ్ఞ పుట్టినరోజు వేడుకలను విద్యార్థుల మధ్య నిర్వహించారు. యువసేన అధ్యక్షులు సజ్జాద్ అధ్యక్షతన కేకు కట్‌చేసి విద్యార్థులకు కేకుతోపాటు విద్యాసామగ్రిని ఉచితంగా పంపిణీ చేశారు. వీరేంద్ర అనే పేద విద్యార్థి ఏడాదికయ్యే చదువు ఖర్చును తాను భరిస్తానని ఖాజా అనే అభిమాని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు గిరిజావాణి, కె.ఎస్.ఏమోజిరావు, వీరేశ్, ఓబులేషు, రమేశ్, వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.


