ఏజెన్సీ వాసుల్ని ఆదుకోవాలి: ఎన్జీవోలకు జేసీ పిలుపు
కాకినాడ, సెప్టెంబర్ 22 (న్యూస్టైమ్): ఏజెన్సీ మండలాల్లో పోషకాహార లోపం వల్ల అనారోగ్యాల బారిన పడుతున్న గిరిజనలకు ఆహార సరుకుల పంపిణీకి ముందుకు రావాలని జాయింట్ కలెక్టర్ ఎస్.సత్యన్నారాయణ స్వచ్ఛంద సంస్థలను కోరారు. గురువారం సాయంత్రం జాయింట్ కలెక్టర్ ఎస్.సత్యన్నారాయణ తమ ఛాంబరులో పౌరసరఫరాల అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంత గిరిజనులు పేదరికం, అవగాహన లేమి వల్ల పోషకాహార లోపాలకు గురౌతున్నారని, ఈ కారణంగా సీజనల్ వ్యాధులకు, అంతుచిక్కని రోగాల బారిన సులువుగా పడిపోతున్నారన్నారు.
గిరిజనుల్లో ఆరోగ్య విద్య, పౌష్టికాహార ఆవశ్యకతలపై అవగాహన పెంపొందించేందుకు, అలాగే పౌష్టికాహార లోపాలను ఎదుర్కొంటున్న ప్రతి కుటుంబానికి 20 కేజీల బియ్యం, ఒక్కక్కటీ కేజీ చొప్పున్న కందిపప్పు, బెల్లం, వేరుశెనగ గుళ్లు, రాగి పిండి ఉచితంగా పంపిణీ చేయాలని స్వచ్చంద సంస్థలను ఆయన కోరారు. ఈ మేరకు సానుకూలంగా స్పందించి పౌష్టికాహార దినుసుల పంపిణీకి స్వచ్ఛంద సంస్థలు సంసిద్ధతను తెలియజేసాయి. ఈ సమావేశంలో డిఎస్ఓ ఉమామహేశ్వరరావు, సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ డియం కృష్ణారావు, ఎన్జిఓ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.


