ఏపీ అసెంబ్లీలో తోపులాటల పర్వం!
- 92 Views
- wadminw
- September 9, 2016
- రాష్ట్రీయం
హైదరాబాద్, సెప్టెంబర్ 9 (న్యూస్‌టైమ్): ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు రెండో రోజు శుక్రవారం వాడివేడి వాతావరణం మధ్య ప్రారంభమయ్యాయి. సభ ప్రారంభమైన కొద్దిసేపటికే గందరగోళం నెలకొంది. ప్రత్యేక హోదా అంశంపై చర్చ చేపట్టాలని ప్రతిపక్ష వైకాపా సభ్యుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కోరడంతో రేగిన గందరగోళం సభ శనివారానికి వాయిదా పడినంత వరకూ కొనసాగింది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేసిన డిమాండు పట్ల ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు స్పందిస్తూ ముఖ్యమంత్రి ప్రకటన చేసిన తర్వాత చర్చిద్దామని సూచించారు. ముందు చర్చ ఆతర్వాత సీఎం ప్రకటన చేయాలని వైకాపా సభ్యులు పట్టుబట్టారు. దీంతో వివాదం మళ్లీ మొదటికొచ్చింది.
ప్రత్యేక హోదాపై చర్చను కోరుతూ స్పీకర్ పోడియంను చుట్టుముట్టిన వైకాపా సభ్యులు ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన మార్షల్స్, వైకాపా సభ్యులకు మధ్య తోపులాట జరిగింది. సభా సంప్రదాయాలకు విరుద్ధంగా వ్యవహరించవద్దని, మార్షల్స్‌పై చేయి చేసుకోవద్దని స్పీకర్ పదే పదే విజ్ఞప్తి చేసినా పరిస్థితి అదుపులోకి రాలేదు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో సభను 10 నిమిషాల పాటు వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. వైకాపా సభ్యుల తీరును మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తీవ్రంగా ఖండించారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో వైకాపా సభ్యుల వ్యవహరించిన తీరుపై సభాపతి కోడెల శివప్రసాదరావు ఆవేదన వ్యక్తం చేశారు.
‘‘సభలో దౌర్జన్యం చేయడం మంచి పద్దతి కాదు. మార్షల్స్, స్పీకర్ స్థానంపై దాడి చేయడం సబబు కాదు. స్పీకర్ స్థానాన్ని గౌరవించాల్సిన అవసరం ఉంది. సభా మర్యాదలకు భంగం కలిగించడమేనా సభ్యతా? శాసనసభ గౌరవాన్ని కాపాడాలని విజ్ఞప్తి చేస్తున్నా’’ అని పేర్కొన్నారు. కాగా, ఏపీ అసెంబ్లీ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాద్‌రావుతో అసెంబ్లీ సిబ్బంది శుక్రవారం మధ్యాహ్నం సమావేశమయ్యారు. ఎమ్మెల్యేల గొడవ వల్ల పనిచేయడం ఇబ్బందిగా ఉందని స్పీకర్ దృష్టికి తీసుకెళ్లారు. మరోవైపు స్పీకర్ చైర్ వద్దకు వెళ్లిన ఎమ్మెల్యేల పట్ల కఠినంగా వ్యవహరించాలని కొందరు టీడీపీ ఎమ్మెల్యేలు కోరుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా అంశంలో కేంద్రాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఎందుకు నిలదీయలేకపోతున్నారని వైకాపా అధినేత, అసెంబ్లీలో విపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రశ్నించారు.
కేంద్రానికి బుద్ధి వచ్చేలా సీఎం పోరాటం చేయాలని హితవు పలికారు. అర్థరాత్రి మీడియా ముందుకు వచ్చి కేంద్ర ప్రకటనను స్వాగతిస్తారా? అని ప్రశ్నించారు. ప్రత్యేక హోదా ఇవ్వట్లేదని స్పష్టంగా చెప్పినప్పుడు కేంద్రం నుంచి మంత్రులను ఉపసంహరించుకోవాలని శుక్రవారం అసెంబ్లీలో డిమాండ్ చేశారు. మరోవైపు, ప్రత్యేక హోదా అంశంపై చర్చ జరగాలన్న ప్రతిపక్ష పార్టీ డిమాండ్‌తో ఆంధ్రప్రదేశ్ శాసనసభ రెండోరోజు కూడా అట్టుడికింది. రాష్ట్రానికి న్యాయం చేయాలంటూ వైఎస్సార్సీపీ సభ్యుల నినాదాలతో సభ మారుమోగింది.
స్పీకర్ మార్షల్స్‌ను పిలిపించడంతో పోడియం వద్ద ఉద్రిక్త పరిస్థితులేర్పడ్డాయి. ప్రతిపక్ష సభ్యులు, మార్షల్స్ మధ్య తోపులాటలు, ప్రత్యేక హోదాపై సభ్యుల నినాదాల మధ్య సభ అట్టుడికింది. సభ వాయిదా పడటం, తిరిగి ప్రారంభం కావడం, విపక్ష సభ్యులు హోదా అంశంపై చర్చించాలన్నపట్టుబట్టడం, ఇలా కొనసాగగా మధ్యాహ్నం సభను స్పీకర్ మరుసటి రోజుకు వాయిదా వేశారు. శుక్రవారం సభ ప్రారంభం కాగానే ప్రత్యేక హోదా అంశంపై తామిచ్చిన వాయిదా తీర్మానంపై చర్చ కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పట్టుబట్టింది. స్పీకర్ వాయిదా తీర్మానం తిరస్కరించడంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు పోడియం చుట్టుముట్టి తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఈ అంశంపై ముందు చర్చించాలని ప్రతిపక్ష పార్టీ ఉప నాయకుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కోరారు. అందుకు అధికార పక్షం తిరస్కరించింది.
ప్రభుత్వం ముందు ప్రకటన చేస్తుందని ఆ తర్వాతే ఆలోచిస్తామని స్పష్టం చేసింది. ప్రతిపక్ష పార్టీ డిమాండ్‌పై సరైన వివరణ ఇవ్వకుండా ఆ సమయంలో అధికార పక్షం అనవసర వ్యాఖ్యలు చేసింది. లోటస్ పాండ్ రూల్స్ సభలో నడవవంటూ సభా వ్యవహారాల శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు చేసిన వ్యాఖ్యలపై వైఎస్సార్సీపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. కనీసం 15 నిమిషాలు కూడా సభను నడవనిచ్చే పరిస్థితి కూడా లేదని చీఫ్ విప్ కాలువ శ్రీనివాసులు చేసిన వ్యాఖ్యలపై సభలో గందరగోళ పరిస్థితులకు దారితీసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అత్యంత కీలకమైన అంశం అయినందున దీనిపై చర్చ జరగాలని తాము పట్టుబడుతున్నామని, ప్రభుత్వం ప్రకటన ఇచ్చిన తర్వాత చర్చకు తాము సిద్ధంగా లేమని వైఎస్సార్ సీపీ సభ్యుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు.
ప్రభుత్వం అంగీకరించకపోవడంతో ప్రత్యేక హోదాపై చర్చ జరగాల్సిందేనంటూ ప్రతిపక్ష సభ్యులు పోడియం చుట్టుముట్టి ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అంటూ నినాదాలు చేశారు. ఆ సందర్భంలో స్పీకర్ మార్షల్స్ ను పిలిపించారు. దాంతో సభలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. పోడియం చుట్టూ మార్షల్స్ వలయంలా చుట్టుముట్టి ప్రతిపక్ష సభ్యులను వెనక్కి తోయడం ప్రారంభించారు. కొంతమంది సభ్యులను మార్షల్స్ లాగివేయడం కనిపించింది. ఈ సందర్భంలోనే స్పీకర్ సభను 10 నిమిషాలపాటు వాయిదా వేశారు. వాయిదా అనంతరం సభ ప్రారంభం అయిన తర్వాత కూడా వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు ప్రత్యేక హోదాపై చర్చ జరగాల్సిందేనంటూ తమ పట్టు వీడలేదు.
హోదాపై చర్చించాల్సిందేనంటూ మరోసారి పోడియం చుట్టుముట్టారు. పోడియంను చుట్టు ముట్టిన వైఎస్ఆర్ సీపీ సభ్యులపై మార్షల్స్ అత్యుత్సాహం ప్రదర్శించారు. ఇష్టానురీతిలో ప్రతిపక్ష సభ్యులపై లాగివేయడం, తోసివేయడం వంటి దౌర్జన్య చర్యలకు దిగారు. ఈ దశలోనూ విపక్ష సభ్యులు ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అంటూ పెద్దఎత్తున నినాదాలు కొనసాగించారు. నినాదాలు చేస్తుండగా ప్రతిపక్ష సభ్యులను లాగిపడేసే ప్రయత్నం చేశారు. దీంతో మార్షల్ తీరును సభ్యులు తీవ్రంగా ప్రతిఘటించారు. ఈ సమయంలో ఇద్దరి మధ్య తీవ్ర తోపులాట జరిగింది. ఈ సందర్భంగా స్పీకర్ మార్షల్స్ ప్లీజ్ డునాట్ టచ్ ది మెంబర్స్ అని సూచించారు.
అయితే పోడియం వద్ద శాంతియుతంగా ఆందోళన చేస్తున్న తమపై మార్షల్స్ అకారణంగా దాడి చేశారని వైఎస్ఆర్సీపీ సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తమ నిరసనను స్పీకర్‌కు తెలియజేయడానికి ప్రయత్నిస్తుంటే మార్షల్స్‌ను పెట్టి అడ్డుకోవడమేంటని, ఇలాంటి చర్యలు సభ గౌరవాన్ని మంటగలుపుతాయన్నారు. తమ డిమాండ్‌పై విపక్ష సభ్యులు ఎంతకూ వెనక్కి తగ్గకపోవడంపై స్పీకర్ సభను మరో 15 నిమిషాలు వాయిదా వేశారు. అనంతరం సభ మధ్యాహ్నం ప్రారంభం కాగా, ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ సభ్యులు తమ డిమాండ్‌పై పట్టువీడలేదు. ప్రత్యేక హోదాపై చర్చ జరిగిన తర్వాతే సభలో ప్రకటన చేయాలని నినాదాలు చేశారు. పోడియం వద్ద తమ నిరసనను వ్యక్తం చేశారు. దాంతో సభ ప్రారంభమైన నిమిషాల్లోనే స్పీకర్ శాసనసభను శనివారానికి వాయిదా వేశారు.
రెండు రోజు కూడా ఇలా వాయిదాల పర్వంతో నడుస్తూ శాసనసభ ప్రత్యేక హోదా కల్పించే అంశంపై చర్చించకుండానే సభ వాయిదా పడగా వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ తీరుపై నిప్పులు చెరిగారు. ప్రభుత్వం ప్రకటన చేసి తర్వాత విపక్షాన్ని మాట్లాడనీయకుండా చేస్తోందని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి మండిపడ్డారు. పోడియం వద్ద తాము శాంతియుతంగానే ఆందోళన చేశామని ఆయన తెలిపారు. మార్షల్సే తమపై దాడి చేశారన్నారు. మార్షల్స్‌తో తమకు ఎలాంటి విభేదాలు లేవని ప్రసాద్‌రెడ్డి స్పష్టం చేశారు. అబద్ధాలు, అవాస్తవాలతో పుట్టిన పార్టీ టీడీపీ అని ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అన్నారు. మార్షల్స్ తమపై దాడి చేస్తారా? అని ఆయన ప్రశ్నించారు.
దాడి చేసే అధికారం మార్షల్స్‌కు ఎక్కడిదని మండిపడ్డారు. ప్రత్యేక హోదాపై వైఎస్ఆర్సీపీ నిరంతర పోరాటం చేస్తోందని ఆయన పేర్కొన్నారు. తమ హక్కులను కాలరాసే చర్యలకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. ఏపీకి మేలు జరిగేంత వరకు ప్రజల పక్షాన నిలబడతామని చెవిరెడ్డి అన్నారు. మార్షల్స్‌పై దాడి చేశారనడం పచ్చి అబద్ధమని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. విభజన హామీలపై చర్చ అంటే ప్రభుత్వం భయపడుతోందన్నారు. ప్రత్యేక హోదాపై ముందు చర్చ జరగాలని సూచించారు. రాష్ట్ర ప్రజల భవిష్యత్తుతో ప్రభుత్వం చెలగాటమాడుతోంది ఎమ్మెల్యే వై విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. ప్రజల ఆకాంక్షలను ప్రభుత్వాలు గమనించాలన్నారు.
ప్రత్యేక హోదాపై తమ పోరాటం కొనసాగుతోందని విశ్వేశ్వర్ రెడ్డి స్పష్టం చేశారు. తామేమైనా దొంగలమా? లేక రౌడీలమా? అంటూ ఎందుకు మార్షల్స్‌ను పెట్టారని ధ్వజమెత్తారు. తాము చేసే పోరాటం ప్రత్యేక హోదా కోసమే అన్నారు. ప్రత్యేక హోదా వస్తేనే ప్రజల జీవితాలు బాగుపడతాయని ఎమ్మెల్యే రక్షణనిధి అన్నారు. పరిశ్రమలు వస్తే నిరుద్యోగులకు మేలు జరుగుతుందని ఆయన తెలిపారు. ఓటుకు నోటు కేసు వల్లే చంద్రబాబు హోదాను తాకట్టు పెట్టారని ఎమ్మెల్యే సునీల్ ఆరోపించారు. చంద్రబాబుకు పదవులపైనే ఎక్కువ ఆశని ఎమ్మెల్యే నారాయణ స్వామి విమర్శించారు.
ఇద్దరు కాంట్రాక్టర్లను కేంద్రం వద్దకు పంపించి, ప్రత్యేక హోదాను చంద్రబాబు తాకట్టు పెట్టారని, కేంద్రం ప్రకటనను చంద్రబాబు ఎలా స్వాగతిస్తారని ఎమ్మెల్యే దాడి శెట్టి రాజా ప్రశ్నించారు. మరోవైపు, కేంద్ర ప్రభుత్వంతో ఘర్షణ వైఖరి ఉండకూడదన్నదే ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అభిమతమని ఏపీ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి వ్యాఖ్యానించారు. అసెంబ్లీ వాయిదా సమయంలో ఉప ముఖ్యమంత్రి కేఈ అసెంబ్లీ లాబీలో మీడియాతో ముచ్చటించారు. రాబోయే రెండు మూడు ఏళ్లు రాష్ట్రాభివృద్ధికి అత్యంత కీలకమైన సమయమని అన్నారు.
హోదా రాదని తెలిసినా కూడా జగన్ అనవసర రాద్దాంతం చేస్తున్నారని విమర్శించారు. ముఖ్యమంత్రి ప్రతి అంశాన్ని సునిశితంగా, కూలంకుశంగా పరిశీలించిన తర్వాతే నిర్ణయాలు తీసుకుంటారని స్పష్టం చేశారు. ప్రజలంతా ఆయనకు మద్దతుగా నిలవాలని కోరారు. మరోవైపు కేంద్రం రాయలసీమతో సహా వెనుకబడిన జిల్లాలకు 1500 కోట్లు ఇస్తామని ప్రకటించడాన్ని స్వాగతిస్తున్నామని కేఈ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభలో వైకాపా సభ్యుల తీరుపై రాష్ట్ర స్త్రీ, శివు సంక్షేమం, గనుల శాఖ మంత్రి పీతల సుజాత ఆగ్రహం వ్యక్తం చేశారు.
అసెంబ్లీ మీడియాపాయింట్ వద్ద మాట్లాడుతూ శాసనసభలో ప్రతిపక్ష సభ్యుల తీరు అవమానకకరమని విమర్శించారు. వైకాపా సభ్యులు సభలో ఫ్యాక్షనిస్టులు, రౌడీల్లా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. సభాపతి వద్ద మైక్ లాగడం, కాగితాలు విసరడాన్ని ఖండిస్తున్నట్లు చెప్పారు. ప్రత్యేక హోదాపై చర్చకు సిద్ధమన్నా ఆందోళన చేస్తున్నారని విమర్శించారు. కాగా, స్పీకర్ అంటే తటస్తంగా వ్యవహరిస్తారని, కాని ప్రతిపక్ష వైఎస్ ఆర్ కాంగ్రెస్ సభ్యులు ఆయన పట్ల అనుచితంగా వ్యవహరించారని,అది చూసి తనకు బాధ కలిగిందని కార్మిక మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. రెండు రోజులుగా సభ గందరగోళం గా మారడం దురదృష్టకరమని, సభను ఉపయోగించకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ సమయాన్ని వృదా చేస్తోందని ఆయన అన్నారు. స్పీకర్‌పై కాగితాలు విసరడం, మైకు విరవడం పద్దతి కాదని అన్నారు.
ప్రత్యేక హోదాపై ముఖ్యమంత్రి ప్రకటన చేసిన తర్వాత ఎంత సేపైనా చర్చకు సిద్దమేనని తాము అంటున్నామని ఆయన అన్నారు. అసెంబ్లీలో ఎప్పుడూ జరగని విధంగా విపక్షం చేసిందని, అయినా తాము ప్రజాస్వామ్య బద్దంగా ఉంటామని అచ్చెన్నాయుడు అన్నారు. శాసనసభ ఒక క్షణం కూడా జరగకుండా చేయడం వల్లే మండలిలో చంద్రబాబు వివరణ ఇచ్చారని ఆయన అన్నారు.


