ఏపీ జెన్కోకు అంగుళ్లూరు జల విద్యుత్ కేంద్రం నిర్వహణ
- 93 Views
- wadminw
- September 6, 2016
- రాష్ట్రీయం
కాకినాడ, సెప్టెంబర్ 6 (న్యూస్‌టైమ్): పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనుల్లో భాగంగా తూర్పు గోదావరి జిల్లా ఏజెన్సీ మండలమైన దేవిపట్నం మండలం అంగళ్లూరులో నిర్మించే జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రం పనులను ప్రభుత్వం ఏపీ జెన్కోకు అప్పగించింది. ఈ మేరకు తక్షణమే పనులు వేగవంతంగా నిర్వహించేలా నిర్మాణ బాధ్యతలు చేపట్టాలని ఏపీ జెన్కో చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కె. విజయనంద్‌ను ప్రభుత్వం ఆదేశించింది. పోలవరం జల విద్యుత్ ప్రాజెక్టును 960 మెగావాట్ల ఉత్పత్తి సామర్ధ్యంతో పనులు గతంలోనే ప్రారంభించినా జాప్యం కావడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. పోలవరం హెడ్‌వర్క్ పనుల్లో భాగంగా అంగుళ్లూరులో 303 ఎకరాల్లో ఈ ప్రాజెక్టు పనులను ప్రారంభించాలని నిర్ణయించి ఈ మేరకు భూ సేకరణ పనులను గతంలోనే పూర్తి చేశారు. రాష్ట్ర విభజన, నిధుల కోరత, టెండర్లలో జాప్యం, ముంపు మండలాల విలీనం తదితర కారణాలతో ఈ అంగుళ్లూరు జల విద్యుత్ పనుల్లో జాప్యం నెలకొంది. ఈ ప్రాజెక్టు రెండేళ్ల క్రితం 205 కోట్ల వ్యయమవుతుందని అంచనాలు రూపొందించారు.
అయితే పనుల జాప్యం కావడంతో అంచనా విలువ సుమారు 25 శాతం పెరగడంతో వ్యయ భారాన్ని ప్రభుత్వం భరించాల్సి వచ్చింది. 2018 నాటికి పోలవరం ప్రాజెక్టును ఎట్టి పరిస్థితుల్లోనైనా నిర్మించి తీరుతామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పేర్కొంటున్న మేరకు 2016 నాటికి జల విద్యుత్ కేంద్రం పనులను పూర్తి చేయాలని ప్రభుత్వం సంబంధిత అధికారులను ఆదేశించింది. ప్రాజెక్టు ప్రారంభమైన రెండేళ్లనైనా ఇప్పటి వరకు మట్టి పనులు 50 శాతం మేరే పూర్తి కావడంపై జల వనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలవరం ప్రాజెక్టుపై నిర్వహించిన విభాగాల వారి సమీక్షిలో ఆయా శాఖలకు లక్ష్యాలను నిర్దేశించారు. జలవనరుల శాఖ, జెన్కో మధ్య సమన్వయ లోపం వల్లే పనుల్లో జాప్యం ఏర్పడుతుందనే అభిప్రాయానికి ప్రభుత్వం వచ్చింది.
సమన్వయ పోలాన్ని నివారించేందుకు నిర్వహణ బాధ్యతను ఏపీ జెన్కోకు అప్పగించింది. జల విద్యుత్ పనులను వేగవంతం చేసేందుకు ఏపీ జెన్కో చీఫ్ ఇంజనీర్ కె. రత్నబాబు ఆ ప్రాంతాల్లో పర్యటించారు. సుమారు 60 లక్షల క్యుబిట్ మీటర్ల మట్టి తీసే పనులు జరగాల్సి ఉందని, ప్రస్తుతం రోజుకు 5 వేల క్యుబిక్ పనులు మాత్రమే జరగడంపై ఆందోళన వ్యక్తం చేశారు. కనీసం రోజుకు 15 వేల క్యుబిక్ మీటర్ల మట్టిని తీసే ఏపీ జెన్కోకు సంబంధించిన పనులు ప్రారంభించే అవకాశం ఉంది. పోలవరం జల విద్యుత్ ప్రాజెక్టు సామర్ధ్యం 960 మెగా వాట్లు కాగా 80 మెగా వాట్ల సామార్ధ్యం కలిగిన 12 యూనిట్లను నెలకొల్పనున్నారు. ప్రాజెక్టు పూర్తయే నాటికి సుమారు 4 వేల కోట్ల వరకు ఖర్చు అవుతుందని డిసెంబర్ నాటికి అంగుళ్లూరు జల విద్యుత్ కేంద్రం ప్రాజెక్టును ఎట్టి పరిస్థితుల్లో పూర్తి చేసేందుకు ఏపీ జెన్కో ప్రణాళికలు రూపొందిస్తోంది.


