ఏపీ పెట్రో నిల్వల కేంద్రం: మంత్రి ధర్మేంద్ర ప్రధాన్
కృష్ణా-గోదావరి బేసిన్లో పెట్రో నిల్వలు వెలికితీస్తే దేశానికే ఆంధ్రప్రదేశ్ పెట్రో నిల్వల కేంద్రంగా మారుతుందని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేద్రప్రధాన్ తెలిపారు. నెల్లూరు జిల్లా వెంకటాచలంలో కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడుకు చెందిన స్వర్ణభారత్ ట్రస్ట్ 15వ వార్షికోత్సవంలో ఆదివారం ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన వార్షికోత్సవ ప్రత్యేక సంచికను ఆవిష్కరించారు. తొలి కాపీని లోక్‌సభ స్పీకర్ సుమిత్రామహాజన్‌కు అందజేశారు.
ఈ సందర్భంగా ధర్మేద్రప్రదాన్ మాట్లాడుతూ కృష్ణా-గోదావరి బేసిన్లో అపార పెట్రో నిల్వలు ఉన్నాయని వెల్లడించారు. సమాజంలో ప్రతి పేదవాడికి సహాయం చేసేందుకు ప్రధాని ముందుకెళ్తున్నారని తెలిపారు. జాతి నిర్మాణంలో 125 కోట్ల మంది భారతీయుల్ని భాగస్వామ్యుల్ని చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ భావిస్తున్నారని పేర్కొన్నారు. తమ శాఖ ద్వారా ఆంధ్రప్రదేశ్‌లో 52 వేల కోట్ల రూపాయల పెట్టుబడితో పెట్రో కెమికల్ పార్క్ ఏర్పాటు, హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్‌పీసీఎల్) ప్లాంట్ విస్తరణ, పెట్రోలియం యూనివర్సిటీ తదితర వాటికి ఈ నిధులను కేటాయిస్తామని వెల్లడించారు. కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు మాట్లాడుతూ ‘‘జీవితంలో కన్నతల్లి, జన్మభూమి, మాతృభాషను మరువరాదు. స్వర్ణభారత్ ట్రస్ట్ వార్షికోత్సవానికి వీపీ సింధు రావటం సంతోషం.
ప్రభుత్వంతో సంబంధం లేకుండా సొంతంగా సేవ చేస్తే మహదానందప్రజాసేవలో తృప్తి ఆనందం అనిర్వచీయం’’ అని వివరించారు. మహిళలకు చేయూతనిస్తే ఏ రంగంలోనైనా రాణిస్తారని లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ చెప్పారు. ఒలింపిక్స్‌లో సింధు సాధించిన ఘనతే ఇందుకు నిదర్శనమన్నారు. ఒలింపిక్స్ రజత పతక విజేత పీవీ సింధు, కోచ్ గోపీచంద్‌లను స్వర్ణ భారత్ ట్రస్ట్ సభ్యులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రులు వెంకయ్యనాయుడు, ధర్మేంద్ర ప్రధాన్, ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు. ఏపీలో పెట్రోలియం యూనివర్సిటీకి త్వరలోనే శంకుస్థాపన చేస్తామని ధర్మేంద్ర ప్రధాన్ చెప్పారు. పెట్రో ఉత్పత్తుల కాంప్లెక్స్‌ను నెలకొల్పుతామని ఆయన వెల్లడించారు. కార్యక్రమంలో బ్యాడ్మింటన్ కీడ్రాకారిణి పీవీ సింధు, కోచ్ పుల్లెల గోపీచంద్, విశాఖ ఎంపీ డాక్టర్ కంభంపాటి హరిబాబు తదితరులు పాల్గొన్నారు.


