ఏయూతో అనుబంధం బలోపేతం చేస్తాం: ఆస్ఫా డిన్గామో
- 107 Views
- wadminw
- September 14, 2016
- అంతర్జాతీయం
విశాఖపట్నం, సెప్టెంబర్ 14 (న్యూస్టైమ్): ఆంధ్రవిశ్వవిద్యాలయంతో ఇథియోపియా అనుంధాన్ని మరింత బలోపేతం చేస్తామని భారత్లోని ఇథియోపియా దేశ అంబాసిడర్ ఆస్ఫా డిన్గామో అన్నారు. బుధవారం ఉదయం ఏయూను సందర్శించిన ఆయన వర్సిటీ వీసీ ఆచార్య జి.నాగేశ్వరరావుతో సమావేశమయ్యారు. ఆంధ్రవిశ్వవిద్యాలయంలో ఉన్నత విద్య, పరిశోధనలు జరుపుతున్న ఇథియోపియా దేశస్థులకు సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. ఇథియోపియా దేశ విద్యార్థులు ఎంతో క్రమశిక్షణతో ఉంటారన్నారు. భారతీయ సంసృతిని తెలుసుకుని నడచుకుంటున్నారన్నారు. భవిష్యత్తులో మరింత ఎక్కువ మందిని ఏయూకు పంపే ఆలోచన ఉందన్నారు.
వాతావరణం, పరిసరాలు, బోధన విధానాలు మెరుగుగా ఉండటం ఏయూపై తమకు ఆసక్తి పెంచుతున్నాయన్నారు. తమ విద్యార్థులు జరిపే పరిశోధనలు పేటెంట్లు సాధించే దిశగా ఉండాలని కోరారు. ఏయూ వీసీ ఆచార్య జి.నాగేశ్వరరావు మాట్లాడుతూ అంతర్జాతీయ విద్యార్థులకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వడం జరిగిందన్నారు. వీరికి మెరుగైన వసతులను కల్పించే దిశగా పనిచేస్తున్నామన్నారు. ఇటీవల అదనపు వసతిగృహాన్ని నిర్మించి అందుబాటులోనికి తీసుకురావడం జరిగిందన్నారు.ఇథియోపియా విద్యార్థుల ఆసక్తి తమ ఆచార్యులకు అభిమానాన్ని చూరగొంటున్నాయన్నారు. విదేశీ విద్యార్థులకు అవసరమైన అన్ని సదుపాయాలను కల్పిస్తున్నామన్నారు.
కార్యక్రమంలో ఇథియోపియా మినిస్టర్ కౌన్సెలర్(అకడమిక్) అసెల్ఫీ వుల్డిగిర్గోస్ విద్యార్థులకు సంబంధించిన పలు అంశాలను వీసీ దృష్టికి తీసుకువెళ్లారు. పరిశోధనలు నిర్ధారిత సమయంలో పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. నిరంతరం ప్రగతిని పరిశీలిస్తూ వేగవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో వర్సిటీ రిజిస్ట్రార్ ఆచార్య వి.ఉమా మహేశ్వరరావు, సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య సి.వి రామన్, అంతర్జాతీయ విద్యార్థి వ్యవహారాల డీన్ ఆచార్య బి.మోహన వెంకట రామ్, ఇథియోపియా ఎంబసీ మినిస్టర్ కౌన్సెలర్ జినిబి హైలి కిరోస్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇథియోపియా ప్రతినిధులను ఏయూవీసీ నాగేశ్వరరావు సత్కరించారు.


