ఏయూను సందర్శించిన ఈఈఆర్సి సభ్యులు
- 83 Views
- wadminw
- December 22, 2016
- అంతర్జాతీయం
ఆంధ్రవిశ్వవిద్యాలయాన్ని యురోపియన్ ఎడ్యుకేషన్ రీసర్చ్ కౌన్సిల్(ఇఇఆర్సి) సభ్యుల బృందం సందర్శించింది. ఏయూ వీసీ ఆచార్య జి.నాగేశ్వరరావుతో కార్యాలయంలో సమావేశమై పలు అంశాలపై చర్చించారు. ఇఇఆర్సి చైర్మన్ అమర్ కవి మాట్లాడుతూ ప్రపంచానికి అవసరమైన నైపుణ్యాలు కలిగిన వ్యక్తులకు భారత్ అందించడం జరుగుతోందన్నారు. అదే విధంగా భారత్లో నిపుణుల కొరత లేకుండా నైపుణ్యాలతో సుసంపన్నం చేయాల్సిన అవసరం ఉందన్నారు.
దీనిలో భాగంగా విశ్వవిద్యాలయంతో తాము మేనేజ్మెంట్, ఇంజనీరింగ్ విద్యలో స్వల్పకాలిక, దీర్ఘకాలిక కోర్సులను అందించడానికి ప్రతిపాదించామన్నారు. దీనిలో భాగంగా జర్మనీలోని ఎస్జిఐటి వర్సిటీకి చెందిన డాక్టర్ బెర్టమ్ లాహ్ ముల్లర్, హాకన్ వర్సిటీకి చెందిన డాక్టర్ డేనియల్ హన్లు రావడం జరిగిందన్నారు. ఎస్జిఐటి వర్సిటీ మేనేజ్మెంట్ విద్యలో, హాకన్ వర్సిటీ మెకట్రానిక్స్ విభాగాలలో ఎంతో ఖ్యాతి గాంచాయన్నారు. ఈ కోర్సుల్లో ఆసక్తి కలిగిన విద్యార్థులకు ఉన్నత విద్యను అందించే దిశగా కృషిచేస్తామన్నారు.
ఇఇఆర్సి చాన్సలర్ రాజ్ వంగపండు మాట్లాడుతూ ఇప్పటికే శ్రీకాకుళం అంబేద్కర్ విశ్వవిద్యాలయంతో అవగాహన ఒప్పందం చేసుకోవడం జరిగిందన్నారు. మేనేజ్మెంట్ విద్యను జర్మనీలో అందించే దిశగా ఈ ఎంఓయూ కృషిచేస్తుందన్నారు. ఏయూ ఇంజనీరింగ్ కళాశాల విభాగాధిపతులలో సమావేశమై కోర్సులపై మరింత అవగాహన కల్పించడం జరుగుతోందన్నారు. రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రత్యేక శ్రద్ద చూపుతూ రాష్ట్రంలో విద్యార్థులకు నాణ్యమైన, నైపుణ్యాలు కలిగిన విద్యను అందించే దిశగా ప్రయత్నం చేస్తున్నారన్నారు.
ఏయూ వీసీ ఆచార్య జి.నాగేశ్వరరావు మాట్లాడుతూ ఇప్పటికే తమ వర్సిటీ స్వీడన్, పెర్త్ విశ్వవిద్యాలయాలతో సంయుక్తంగా పనిచేస్తోందని వివరించారు. కోర్సుల నిర్వహణకు సాధ్యాసాధ్యాలపై చర్చించారు. ఇరుదేశాల మధ్య సమన్వయంతో పనిచేస్తామన్నారు. ఈ సందర్భంగా ఇఇఆర్సి సభ్యులను, జర్మనీ విశ్వవిద్యాలయం ప్రతినిధులను వీసీ నాగేశ్వరరావు సత్కరించారు. కార్యక్రమంలో వర్సిటీ రిజిస్ట్రార్ ఆచార్య వి.ఉమా మహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.


