ఏ దేశమేగినా… ఎందుకాలిడినా…
- 114 Views
- wadminw
- January 14, 2017
- Home Slider అంతర్జాతీయం
‘‘ఏ దేశమేగినా ఎందుకాలిడినా, ఏ పీఠమెక్కినా ఎవ్వరెదురైనా పొగడరా నీ తల్లి భూమి భారతిని… నిలుపరా నీ జాతి నిండు గౌరవము’’ అన్నది రాయప్రోలే అయినా పాటిస్తున్నది మాత్రం మన పదహారణాల ప్రవాస భారతీయులే. ఎందుకంటే వారు ఎక్కడున్నా… వృత్తిరీత్యా ఏ దేశమేగినా సొంత దేశాన్ని మాత్రం మరచిపోలేకపోతున్నారు. ఏటా జరిగే ‘ప్రవాస భారతీయ దినోత్సవం’లో వీరి ఐక్యతను చూస్తే మనకు అర్ధమవుతుంది మనవారి మధ్య ఉన్న అనుబంధమేమిటో… ”గౌతమబుద్ధుని భోదలు మరవద్దు, గాంధీ చూపిన మార్గం విడవద్దు… దేశాల చీకట్లు తొలగించు, స్నేహగీతాలు ఇంటింటా వెలిగించు… ఐకమత్యమే జాతికి శ్రీరామరక్ష, అందుకే నిరంతరం సాగాలి దీక్ష” అంటూ మనం ఏ భాషలోనైనా పాడుకునేలా కవి చక్కగా మనలోని స్నేహభావాన్ని విశ్లేషించాడు.
భారతీయుల మధ్య సువిశాల ప్రపంచంలో తాము ఎంచుకున్న రంగంలో అభివృద్ధిని కాంక్షిస్తూ, తమ ప్రతిభకు మెచ్చి ముంగిటవాలిన విదేశీ అవకాశాలను అందుకుంటూ, జీవనోపాధిని అన్వేషిస్తూ వలసవాదులుగా బయలుదేరిన భారతీయలు అనేక దేశాలలో ప్రవాసీయులుగా స్థిరపడ్డారు. ఆయా దేశాల సాంకేతిక, ఆర్థిక, రాజకీయ రంగాల్లో కీలకపాత్రను పోషిస్తూ భారతదేశ యశస్సును విశ్వవ్యాప్తం చేస్తున్నారు. ఇటీవల భారతదేశంలో పర్యటించిన అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ప్రసంగాల్లో అమెరికా భారతీయులపై ఎంతగా ఆదారపడిందో స్పష్టం అయ్యింది. ప్రపంచవ్యాప్తంగా ప్రవాసీయులలో భారతీయల జనాభా రెండవ స్థానంలో ఉంది.
(మొదటిస్థానంలో చైనా ఉంది). అమెరికాలోని ప్రజల జాతీయ సగటు వార్షికాదాయం 38,885 డాలర్లు కాగా ప్రవాస భారతీయల సగటు వార్షికాదాయం అరవై వేల డాలర్లు. అమెరికాలోని సిలికాన్ వ్యాలీలో మూడొంతుల మంది భారతీయులే. స్వదేశ ఆర్థిక, సామాజిక రంగాల్లో ప్రభావం చూపిస్తున్న ప్రవాస భారతీయలను దేశరాజకీయాల్లో భాగస్వామ్యులను చేయాలన్న ఆలోచన, దేశపౌరులుగా ప్రజాస్వామ్యంలో తమకు ఓటువేసి హక్కు కావాలన్న ఎన్ఐర్ఐ వాదన ఫలితంగా కేంద్రం ఎన్ఆర్ఐలకు కొన్ని షరతులకు లోబడి ఓటు హక్కు ఇవ్వడానికి అంగీకరించింది.
”ఏ దేశమేగినా ఎందుకాలిడినా… పొగడరా నీ తల్లి భూమి భారతిని” అంటూ తాము భారతీయులం, భారత సంతతికి చెందిన వారమన్న విషయాన్ని మరిచిపోకుండా భారతీయ సంస్కృతి సాంప్రదాయలను గౌరవిస్తూ, ఆచరిస్తూ, దేశాభివృద్ధికోసం పాటుపడుతున్నారు ప్రవాసభారతీయులు. వారి సేవలు గుర్తిస్తూ ప్రతి సంవత్సరం జనవరి 9వ తేదీన ప్రవాసీ దివన్‌ను భారత ప్రభుత్వం నిర్వహిస్తూ వస్తోంది. 2003లో భారత విదేశాంగ శాఖ ఆధ్వర్యంలో న్యాయశాస్త్రనిపుణుడు ఎల్.ఎం. సింఘ్వీ అధ్యక్షతన ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ సిఫారసుల మేరకు జనవరి 9న ‘ప్రవాసీ దివస్’ నిర్వహించాలని నిర్ణయించారు.
దక్షిణాఫ్రికాలో ఉన్నత విద్యను అభ్యసించి, భారతీయల ఆత్మగౌరవాన్ని చాటిని మహాత్మాగాంధీ స్వదేశానికి 1915 సంవత్సరం జనవరి 9వ తేదీన తిరిగి వచ్చారు. ఆ తేదీనే ప్రవాసీ దివస్‌గా జరపాలని భారత విదేశాంగ శాఖ నిర్ణయించడం అభినందనీయం. 2003 సంవత్సరం మొదటిసారిగా భారత్‌లో ప్రవాస భారతీయుల దినోత్సవం జరిగింది. 2004లో దేశ రాజధాని న్యూఢిల్లీలో అత్యంత ఘనంగా నిర్వహించారు. ప్రతి సంవత్సరం ఒక్కో రాష్ట్రంలోని రాజధానిలో నిర్వహించాలన్న ప్రతిపాదన ఉంది.
దేశ విదేశాల్లో నివహిస్తున్న భారతీ యువకులను ఆకట్టుకోవడం, విద్య, సైన్సు, సాంకేతిక విద్య రంగాల్లో భారత్‌లో ఉన్న అవకాశాలను, సంస్కృతి, సాంప్రదాయాలను నేటి తరానికి వివరించడం ప్రవాస భారతీయ దినోత్సవం ముఖ్యోద్ధేశం. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో ఉన్న భారతీయులలో ఎక్కువగా అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో 25 లక్షల మంది ఉన్నారు. వీరిలో ఎక్కువ మంది సాఫ్ట్వేర్, హర్డ్‌వేర్, సివిల్, మెకానికల్ ఇంజనీర్లుగా, డాక్టర్లుగా, హోటల్స్‌లో, పెట్రోల్ బంక్‌లలో ఉద్యోగులుగా పనిచేస్తున్నారు. యూరప్‌లో 18లక్షల మంది, కెనడాలో ఎనిమిది లక్షల మంది భారతీయులు నివహిస్తుండగా వారిలో అధికశాతం చిరుఉద్యోగాలు చేసే వారే.
మిడిల్ ఈస్ట్‌లోని అరబ్బు దేశాలైన సౌదీ అరేబియా, యునైటేడ్ అరబ్ ఎమిరేట్స్, కువైట్, ఓమన్, జోర్డాన్ తదితర దేశాల్లో మొత్తం 38 లక్షల 69 వేల మంది భారతీయులు ఉండగా వీరిలో అత్యాధికులు దక్షణ భారతదేశ రాష్ట్రాల్లోని పేద కుటుంబాల వారే. వీరంతా తక్కువ వేతనాలతో ఎక్కువ గంటలు పనిచేస్తూ దుర్భరమైన జీవితాన్ని గడుపుతున్నవారే. జీవనోపాధి కోసం వెళ్లిన వీరంతా అరకొర సదుపాయాలలో, కనీస వేతనాలు లేకుండా బతుకుబండిని విదేశాల్లో లాగుతున్న భారతీయులు. వీరి సంక్షేమం కోసం ఆయా రాష్ట్రాలు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాయి. ఆసియా దేశాల్లోని మలేషియా, సింగపూర్, ఫిలిఫైన్స్లతో కలిసి దాదాపు 28 లక్షల 60 వేల మంది భారతీయులు ఉన్నారు.
ఆఫ్రికా ఖండంలోని వివిధ దేశాల్లో సుమారుగా 25 లక్షల మంది ప్రవాస భారతీయులు ఉన్నారు. అమెరికాలో నివహిస్తున్న భారతీయులు ఆ దేశ ఆర్థికాభివృద్దిలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆయా దేశాల్లో 50 శాతం ఎకానమి లాడ్జీలు, 35 శాతం హోటల్స్, ఇతర వ్యాపారాలు చేస్తూ ఏటా 40 బిలియన్ల మార్కెటును ప్రవాస భారతీయులు సృష్టిస్తున్నారు. సిలికాన్ వ్యాలీలో ఉన్న ఇంజనీర్లు, సాంకేతిక నిపుణులలో 33 శాతం భారతీయులే. అమెరికాలో నివహిస్తున్న భారతీయుల వార్షిక కొనుగోలు సామర్థ్యం 25 బిలియన్ డాలర్లు. ప్రవాస భారతీయుల సంక్షేమం కోసం అనేక సంఘాలు, ఆయా రాష్ట్రాల పేర్లతో, వారి వారి సంస్కృతి సాంప్రదాయలను పరిరక్షించేలా అనేక కమిటీలు, అసోషియేషన్లు ఏర్పడ్డాయి.
వీటిలో ముఖ్యంగా చెప్పుకోవల్సిన సంఘాలు తానా (తెలుగు అసోషియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా) ఆటా (అమెరికా తెలుగు అసోషియేషన్). తెలుగు సంస్కృతిని సాంప్రదాయాలను అమెరికాలో కూడా కొనసాగిస్తూ, తెలుగుజాతి పరిమళాలను విదేశాల్లో సైతం గుభాళిస్తూ ఈ సంఘాలు ఎన్నో కార్యక్రమాలను రూపొందిస్తున్నాయి. రెండు సంవత్సరాలకు ఒక్కసారి నిర్వహించే తెలుగు మహాసభల్లో ఆంధ్రప్రదేశ్ నుంచి కళాకారుల బృందాలతో విదేశాల్లో సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. వీరి కృషితో అంతర్జాతీయంగా తెలుగువెలుగు చూస్తుంది. భారత్‌లో విద్య, ఉపాధి, వ్యాపార అవకాశాలపై సదస్సులు, దేశవిదేశాల ప్రతినిధులతో చర్చలు ఈ కార్యక్రమంలో ఉంటాయి. భారత రాష్ట్రపతి, ప్రధానమంత్రితో పాటు విదేశాల అధికారులు, ప్రజాప్రతినిధులు ఈ సమావేశాల్లో పాల్గొంటారు.


