ఐక్య పోరాటాల ద్వారానే హక్కుల సాధన: కృష్ణయ్య
- 105 Views
- wadminw
- September 5, 2016
- రాష్ట్రీయం
హైదరాబాద్: ఐక్య పోరాటాల ద్వారానే హక్కులను సాధించుకోవచ్చని బీసీ సంఘం జాతీయ అధ్యక్షులు, ఎల్బీనగర్ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య పేర్కొన్నారు. తెలంగాణ వైద్యారోగ్య శాఖలో కొత్తగా బీసీ ఉద్యోగుల సంఘం ఏర్పాటయింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 20న నిర్వహించ తలపెట్టిన ‘మహాగర్జన’ గోడ ప్రతులను సంఘం ప్రతినిధులతో కలిసి తన నివాసంలో కృష్ణయ్య ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొత్తగా సంఘాన్ని ఏర్పాటు చేయడం పట్ల సంఘం ప్రతినిధులను అభినందించారు.
బీసీ ఉద్యోగులంతా కలిసికట్టుగా తమ హక్కుల సాధన కోసం కృషి చేయాలని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ వైద్యారోగ్య శాఖ అధ్యక్ష, కార్యదర్శులు బి.శ్రీనివాస్, పి.సాయికుమార్ మాట్లాడుతూ సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 20న కోఠిలోని డైరక్టర్ మెడికల్ హెల్త్ సర్వీసెస్ (డీఎంహెచ్ఎస్) క్యాంపస్ ఆవరణలో మధ్యాహ్నం 12 గంటలకు ‘మహాగర్జన’ ఉంటుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర బీసీ సంఘం అధ్యక్షులు జె.శ్రీనివాస్ గౌడ్‌తో పాటు వైద్యారోగ్య బీసీ ఉద్యోగుల సంఘం కార్యవర్గ సభ్యులు హరి, సి.హెచ్.శ్రీనివాస్, సుమ తదితరులు పాల్గొన్నారు.


