ఒంగోలులో వివాహిత అదృశ్యం
ఒంగోలు, సెప్టెంబర్ 30 (న్యూస్‌టైమ్): వివాహిత అదృశ్యంపై నాలుగో నగర పోలీసులు కేసునమోదు చేశారు. అయితే ఆమెను భర్త హత్యచేసినట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కర్నూలు జిల్లా ధర్మవరానికి చెందిన విశ్రాంత కోఆపరేటివ్ ఉద్యోగి నతానియన్ నాలుగో సంతానం వినీత, చిత్తూరు జిల్లా కలికిరి చెందిన సుధీర్‌కుమార్‌బాబు దాదాపు నాలుగేళ్ల కిందట ప్రేమ వివాహం చేసుకున్నారు. సుధీర్‌కుమార్‌బాబు నెల్లూరులో నారాయణ వైద్యకళాశాలలో ఎంబీబీఎస్ పూర్తి చేసి అక్కడే హౌస్ సర్జన్‌గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. వీరికి సంతానం లేదు. నెల్లూరు ఆర్టీసీ సమీపంలోని అరవిందనగర్‌లోని విశ్రాంత డీఎస్సీ ఇంట్లో ఏడు నెలల నుంచి కాపురం ఉంటున్నారు. అయితే వినీతపై సుధీర్‌కు అనుమానం. ఈ విషయమై ఇద్దరి మధ్య మనస్పర్థలున్నాయి. బుధవారం రాత్రి సుధీర్ అతని మామకు ఫోన్ చేసి మీకుమార్తెకు నాకు గొడవ జరిగిందని, దీంతో ఆమెను చంపేశానని చెప్పాడు. అనంతరం ఆందోళనకు గురైన ఆయన గురువారం ఉదయం కుమార్తె వినీతకు ఫోన్ చేయగా పనిచేయలేదు. దీంతో డయల్ 100కు ఫిర్యాదు చేశారు. ఈ సమాచారం అందుకున్న నాలుగో నగర సీఐ సీతారామయ్య ఇంటి వద్దకు చేరుకుని ఇంటి తలుపును పగలగొట్టి ఇంట్లో పరిశీలించారు. అయితే ఇంట్లో ఎలాంటి ఆధారాలు లభించలేదు. దీంతో శుక్రవారం నెల్లూరుకు వచ్చిన వివాహిత తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ సీతారామయ్య తెలిపారు. వినీత అదృశ్యంపై కేసునమోదు చేసి దర్యాప్తు చేపట్టిన సీఐ సీతారామయ్య ఆమె భర్త సుధీర్‌పై ఆరా తీస్తున్నారు. సుధీర్ ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. కాగా బుధవారం అర్ధరాత్రి వినీతను హత్య చేసినట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. భార్యాభర్తలిద్దరికి మధ్య వచ్చిన మనస్పర్థల కారణంగా ఆవేశానికి గురైన సుధీర్ ఆమెను హత్యచేసినట్లు తెలుస్తోంది. అనంతరం గురువారం ఉదయం రెండు పెద్ద సూటుకేసులతో ఇంటి నుంచి వెళ్లినట్లు స్థానికులు చెబుతున్నారు. భార్యను హత్య చేసి రెండు భాగాలుగా చేసి తీసుకెళ్లినట్లు పోలీసులు భావిస్తున్నారు. చిత్తూరు జిల్లా తిరుపతిలో మృతదేహాన్ని వదిలిపెట్టినట్లు తెలుస్తోంది.
గాంధీ జయంతి నుంచి చంద్రన్న బీమా
ఒంగోలు, సెప్టెంబర్ 30 (న్యూస్‌టైమ్): అసంఘటిత రంగ కార్మికుల జీవితాలకు భద్రత కల్పించేందుకు ఉద్దేశించిన చంద్రన్న బీమా గాంధీ జయంతి సందర్భంగా ఈ నెల రెండో తేదీన ప్రారంభం కానుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు రాజధానిలో దీన్ని ప్రారంభించనున్నారు. జిల్లాలోనూ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించేందుకు జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ, కార్మికశాఖ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటివరకు అసంఘటిత రంగ కార్మికులకు ఎలాంటి భద్రతలేకపోవడంతో ప్రమాదవశాత్తు మృతి చెందితే కుటుంబాలు ఆర్థిక సమస్యల్లో కూరుకుపోతున్నాయి. ఇలాంటి కుటుంబాలను ఆదుకోవాలనే ఉద్దేశంతో ప్రభుత్వం మూడు పథకాలను విలీనం చేసి చంద్రన్న బీమా పథకాన్ని ప్రవేశపెట్టింది. పథకంలో సభ్యులను చేర్చే ప్రక్రియ కొనసాగుతోంది. మప్రజాసాధికారిక జరుగుతున్న తరుణంలోనే చంద్రన్న బీమా పథకంకు అర్హులను గుర్తించేలా ప్రభుత్వం ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను రూపొందించింది. అలా జిల్లాలో శుక్రవారం నాటికి 11,25,350 మందిని పథకానికి అర్హులని తేల్చారు. వీరిలో రూ. 15 సభ్యత్వ రుసుముగా చెల్లించి 10,28,523 మంది చేరారు. వీరందరికీ అక్టోబరు రెండో తేదీ నుంచి బీమా అమలులోకి వస్తుంది. సభ్యత్వ రుసుములు చెల్లించిన వారిలో 8,43,523 మంది మాత్రమే తమ బ్యాంకు ఖాతాలను అనుసంధానం చేసుకున్నారు. మరో 1,85,000 మంది బ్యాంకు ఖాతాలను ఇవ్వనే లేదు. బీమా పథకం కింద నమోదైన సభ్యుల్లో ఎవరికైనా సహజ మరణం సంభవిస్తే రూ.30 వేల బీమా సొమ్మును కుటుంబ సభ్యులకు చెల్లిస్తారు. ప్రమాదవశాత్తు మృతి చెందితే వారి కుటుంబ సభ్యులకు రూ.5 లక్షలలు బీమా సొమ్మును చెల్లిస్తారు. ఏదైనా ప్రమాదంలో పూర్తి అంగవైకల్యం సంభవించిన వారికి రూ.5 లక్షల బీమా సొమ్ము ఇస్తారు. ప్రమాదంలో పాక్షిక వైకల్యానికి గురైతే ఆ వ్యక్తికి రూ.3.75 లక్షలు అందజేస్తారు. చంద్రన్న బీమా పథకంలో నమోదైన వారందరికీ గాంధీ జయంతి రోజున బాండ్లను పంపిణీ చేస్తారు. ఒంగోలులోని విష్ణు కన్వెన్షన్ హాలులో ఆదివారం మధ్యాహ్నం మూడు గంటలకు జరిగే బాండ్ల పంపిణీ కార్యక్రమంపై జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ప్రాజెక్టు సంచాలకులు ఎంఎస్ మురళి, జిల్లా ఉప కార్మిక కమిషనర్ ఏసుదాసులు శుక్రవారం సాయంత్రం ప్రగతిభవన్‌లో సమావేశమయ్యారు. రెండు వేల మంది అసంఘటిత రంగ కార్మికులకు బాండ్లను పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. కార్మికులంతా తప్పనిసరిగా హాజరుకావాలని, నూతన పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు.
సంస్కృతికి ప్రతిబింబంగా యువజనోత్సవాలు
ఒంగోలు, సెప్టెంబర్ 30 (న్యూస్‌టైమ్): ప్రకాశం జిల్లాలో యువత సంస్కృతి, కళలవైపు ఆకర్షితులయ్యేలా చర్యలు తీసుకోవాలని జేసీ డాక్టర్ ఎం.హరిజవహర్‌లాల్ అన్నారు. శుక్రవారం ఆయన యువజనోత్సవాల ఏర్పాట్లపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ యువకులను కళలతోపాటు వివిధ రంగాల్లో ఆసక్తిని పెంపొందించేలా కార్యక్రమాలను రూపొందించాలన్నారు. యువజనశాఖతోపాటు ఇతర శాఖల్లో యువతకు అమలు చేస్తున్న పథకాలపై వారికి అవగాహన కల్పించాలన్నారు. ప్రధానంగా విద్యార్థుల్లో నైపుణ్యం పెంపొందించే దిశగా కార్యక్రమాలు రూపొందించాలన్నారు. అక్టోబరు 15వతేదీ మార్కాపురం డ్వాక్రా బజారులో, 22న కందుకూరు డిగ్రీ కళాశాలలో, 24వతేదీ ఒంగోలు పాత జిల్లా పరిషత్తు సమావేశ మందిరంలో యువజనోత్సవాల నిర్వహణకు చర్యలు తీసుకోవాలన్నారు. డివిజన్ స్థాయిలో నిర్వహించే పోటీల్లో గెలిచిన వారికి బహుమతి ప్రదానం చేస్తామని.. అక్కడ గెలుపొందిన యువతకు జిల్లా స్థాయిలో అక్టోబరు 26వతేదీ ఒంగోలు రైస్ మిల్లర్ల హాలులో నిర్వహించే యువజనోత్సవాల్లో బహుమతులు అందజేస్తామన్నారు. పోటీల్లో పాల్గొనే యువతకు 18 నుంచి 26 ఏళ్ల వయస్సు ఉండాలన్నారు. 18 అంశాలకు సంబంధించి వివిధ కేటగిరిల్లో నిర్వహించే పోటీల్లో పాల్గొనే యువత స్థానిక తహసీల్దారు, ఎంపీడీవో, స్టెప్ సీఈవో కార్యాలయాల్లో పేర్లు నమోదు చేసుకోవాలని తెలిపారు. రెడ్‌క్రాస్ సొసైటీ ద్వారా రక్తదానం, నేత్రదానం, అవయవ దానంపై అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని ఐఆర్సీస్ ఉపాధ్యక్షుడు డాక్టర్ జి.రాఘవను జేసీ కోరారు. సమావేశంలో స్టెప్ సీఈవో బి.రవి, డీఆర్డీఏ పీడీ ఎం.ఎస్.మురళి జిల్లా అధికారులు పాల్గొన్నారు.30pks01


