ఒంగోలు రిమ్స్‌లో భోజనశాల ప్రారంభం
ఒంగోలు, సెప్టెంబర్ 21 (న్యూస్‌టైమ్): ఒంగోలులోని రిమ్స్ వైద్యశాల ఆవరణలో కోటిరూపాయల వ్యయంతో నిర్మించిన భవనంలో భోజనశాల, క్యాంటీన్లను ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్థన్ బుధవారం ప్రారంభించారు. క్యాంటీన్లో సరసమైన ధరలకు పదార్థాలు అందుబాటులో ఉంటాయని ఎమ్మెల్యే తెలిపారు. వైద్యవిద్యార్థులు, డాక్టర్ల కోసం క్యాంటీన్లో ప్రత్యేక గదులు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో రిమ్స్ డైరెక్టర్ డాక్టర్ వల్లీశ్వరి, డీఎస్పీ గొంటుపల్లి శ్రీనివాసరావు, రిమ్స్ అభివృద్ధి కమిటీ ఛైర్మన్ డాక్టర్ కె.సీతారామయ్యలు పాల్గొన్నారు.
కాగా, ప్రభుత్వం అమలు చేస్తున్న స్వచ్ఛంద ఆదాయ వెల్లడి పథకం-2016ను సద్వినియోగం చేసుకోవాలని ఆదాయపన్ను శాఖ ఒంగోలు రీజియన్ జాయింట్ కమిషనర్ ఆనంద్ అన్నారు. రామ్‌నగర్‌లోని కార్యాలయంలో బంగారు, వెండి, వజ్రాల వ్యాపారుల సంఘం ప్రతినిధులు, బంగారు నగల వ్యాపారులకు స్వచ్ఛంద ఆదాయ వెల్లడి పథకంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కమిషనర్ ఆనంద్ మాట్లాడుతూ ఇప్పటి వరకూప్రకటించని ఆదాయ వనరులు, ఆస్తులను ఈ పథకం ద్వారా వెల్లడి చేసుకోవచ్చన్నారు.
ప్రభుత్వం కల్పించిన వెసులుబాటును సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పథకం మార్గదర్శకాలను వివరించారు.స్థిరాస్తి విలువ మదింపునకు నూతనంగా ప్రవేశపెట్టిన కాస్ట్ ఇండెక్సు ఎంతో సౌలభ్యంగా ఉంటుందన్నారు. ఆదాయపన్నుశాఖ వార్డు -1 అధికారి ఈ.వెంకట్రావు, వార్డు -3 అధికారి సత్యన్నారాయణరావు పలు అంశాలను వివరించారు. సమావేశంలో వ్యాపారుల సంఘం అధ్యక్షుడు తాతా ప్రసాద్, జిల్లా సమన్వయకర్త చెంచురామారావు, దాసరి నారాయణరావు, ఇమ్మడిశెట్టి సుబ్బారాయుడు, వేమూరి సుకుమార్ ,పేర్ల రమేష్, ఒంగోలు, కందుకూరు ప్రాంతాల బంగారు నగల వర్తకులు, వెండి వర్తకులు పాల్గొన్నారు.
వెండి విరాళాల సేకరణకు నడుం బిగించిన కందుల
ఒంగోలు, సెప్టెంబర్ 21 (న్యూస్‌టైమ్): మార్కాపురం ఇలవేల్పు శ్రీ లక్ష్మీచెన్నకేశవస్వామి వారి వెండి రథం నిర్మాణం కోసంగాను భక్తులనుండి వెండి విరాళంగా స్వీకరించే కార్యక్రమం జోరందుకుంది. దేవస్థాన పాలకమండలి ఛైర్మన్ యక్కలి కాశీవిశ్వనాధం కోరిక మేరకు, మార్కాపురం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి కందుల నారాయణరెడ్డి తదితరులు బుధవారం పట్టణంలోని పలు వీధులలో తిరిగి వ్యాపార వర్గాలనుండి, స్వామివారి భక్తులనుండి వెండి విరాళాల సేకరణ కార్యక్రమం చేపట్టారు. స్వామివారి వెండి రథం నిర్మాణం కోసం పాలకమండలి తీర్మానించిన దరిమిలా, గత ఏప్రియల్ మాసంలో స్వామివారి కళ్యాణం రోజునే చాలా మంది ఔత్సాహికులు స్వామివారి రథంకోసం వెండిని విరాళంగా ప్రకటించారు. ఎక్కువమంది భక్తులనుండి వెండిని స్వీకరించి, రథనిర్మాణం చేయాలనే మహా సంకల్పంతో పాలకమండలి, పట్టణంలోని వ్యాపార,ఇతర వర్గాల వద్దనుండి వెండిని స్వీకరిస్తుందని పాలకమండలి ఛైర్మన్ యక్కలికాశీవిశ్వనాధం స్పష్టంచేశారు. ఈ విరాళాల సేకరణ కార్యక్రమంలో దర్మకర్తలు మేడా ప్రసాదు, యల్.శ్రీను, తోట నరసింహులు, పిన్నిక నాగేశ్వరరావు, మాలపాటి వెంకటరెడ్డి, మాజి మునిసిపల్ ఛైర్మన్ జక్కా ప్రకాశ్, మాజి కౌన్సిలర్ బొగ్గరపు రమణ, దేవస్థాన సేవాకమిటి సభ్యులు బొంతల సుధీర్, సముద్రాల రమేష్, ఆర్కేజె నరసింహం, కొప్పరపు శ్రీను తదితరులు పాల్గొన్నారు.
అంటు వ్యాధుల పట్ల అప్రమత్తత అవసరం: కలెక్టర్ హితవు
ఒంగోలు, సెప్టెంబర్ 21 (న్యూస్‌టైమ్): గ్రామాల్లో ఎట్టి పరిస్థితుల్లోను అంటు వ్యాధులు ప్రభలకుండా తగు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా అధికారులు, మండల స్థాయి అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. బుధవారం ఉదయం వీడియో కాన్ఫరెన్సు ద్వారా జిల్లాలోని పలు మండలాల తహసీల్దార్లు, ఎంపిడిఓలకు స్పష్టమైన ఆదేశాలను ఇచ్చిన జిల్లా కలెక్టర్ సుజాతశర్మ, జాయింట్ కలెక్టర్ హరిజవహర్‌లాల్‌లు వెంటనే కార్యాచరణకు ఉపక్రమించారు. జిల్లాలో ఇటీవల కురిసిన వర్షాలకు పలు చోట్ల అంటువ్యాధులు ప్రభలడం పట్ల అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. మార్కాపురం ఎంపిడిఓ కార్యాలయంలో ఈ మేరకు తహసీల్దార్ ఉమారాణి, ఎంపిడిఓ సాయికుమార్, డిఎఫ్ఓ జయచంద్రారెడ్డి, ఈఇఆర్డి నాగేశ్వరరావు, తర్లుపాడు వైద్యాధికారి రామిరెడ్డి తదితరులు, గ్రామ కార్యదర్శులు, సర్పంచులు, విఆర్ఓలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశాన్ని ఉద్ధేశించి ఎంపిడిఓ సాయికుమార్ మాట్లాడుతూ గ్రామాల్లో మురుగునీరు నిల్వ ఉండకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కసువు, ఇతర వ్యర్ధాలను నిల్వ ఉంచే దిబ్బలు ఊరికి దూరంగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. బహిరంగ మల,మూత్ర విసరర్జన చేయకూడదని హెచ్చరించారు. కాచి చల్లార్చిన నీటినే త్రాగాలని సలహా ఇచ్చారు. చిన్నారులకు నలత గా ఉంటే, వెంటనే వైద్యాధికారిని సంప్రదించాలన్నారు. గ్రామాల్లో కాని, పాఠశాల ప్రాంగణాల్లో కాని బహిరంగంగా అమ్మే తినుబండారాలను తినవద్దని సూచించారు. చేతులు శుభ్రంగా కడుక్కోవడం, ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం, గ్రామాన్ని స్వచ్చంగా ఉంచుకోవడం ద్వారా జబ్బులకు దూరంగా ఉండవచ్చని సలహా ఇచ్చారు. ఈకార్యక్రమంలో మండలంలోని పలు గ్రామాల సర్పంచులు, కార్యదర్శులు, విఆర్ఓలు పాల్గొన్నారు.


