ఒలింపిక్స్లో కబడ్డీని చేర్చేందుకు చర్యలు: కింజరాపు
శ్రీకాకుళం, అక్టోబబర్ 4 (న్యూస్టైమ్): కబడ్డీ క్రీడ జాతీయ స్థాయిలో ప్రొకబడ్డీ ద్వారా ఎంతో ప్రాచుర్యం పొందిందని, దీనిని ఒలింపిక్స్లో చేర్చేందుకు రాష్ట్రప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని క్రీడలశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. కోటబొమ్మాళి కొత్తమ్మతల్లి ఉత్సవాల్లో భాగంగా కోటబొమ్మాళిలో ఏర్పాటు చేసిన రాష్ట్రస్థాయి మహిళ, జిల్లా స్థాయి పురుషుల కబడ్డీ పోటీలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు మాట్లాడుతూ ప్రతి పాఠశాలకు క్రీడామైదానం ఉండాలన్నది ప్రభుత్వం లక్ష్యమని, మైదానాలున్నా ప్రతి పాఠశాలకు క్రీడా కిట్లు అందిస్తోందన్నారు. అనంతరం పార్లమెంటు సభ్యులు కింజరాపు రామ్మోహన్నాయుడు క్రీడాపోటీలను అధికారికంగా ప్రకటించి మాట్లాడారు.
రాష్ట్రస్థాయి మహిళా కబడ్డీ పోటీల్లో భాగంగా తలపడనున్న శ్రీకాకుళం, కృష్ణా జిల్లా జట్లతో పాటు జిల్లాస్థాయి పురుషుల కబడ్డీ పోటీల్లో తలపడ నున్న అమలపాడు, కరుడిసింగి జట్లను పరిచయం చేసుకుని కొద్దిసేపు పోటీలను తిలకించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రామకృష్ణ, జడ్పీటీసీ సభ్యురాలు పద్మకుమారి, సర్పంచి సింహాద్రి, కోటబొమ్మాళి ఏఎంసీ అధ్యక్షురాలు విజయలక్ష్మి, బీసీ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టరు ఎల్.ఎల్.నాయుడు, జలవనరుల సంఘం రాష్ట్ర డైరెక్టరు అప్పారావు, కొత్తమ్మ తల్లి ఆలయ కమిటీ అధ్యక్షుడు గోవిందరాజులుతో పాటు పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు.
ఉపకార వేతనాల గడువు మళ్లీ పెంపు
శ్రీకాకుళం, అక్టోబబర్ 4 (న్యూస్టైమ్): ప్రస్తుత విద్యా సంవత్సరానికి సంబంధించి ఉపకారవేతనాలు, బోధన ఫీజుల కోసం దరఖాస్తు చేసుకునేందుకు బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ, మైనారిటీ విద్యార్థినీ విద్యార్థులకు ప్రభుత్వం చివరి అవకాశంగా ఈ నెల 15 వరకు గడువును మరోమారు పొడిగించింది. ఈ మేరకు సాంఘిక సంక్షేమశాఖ కార్యదర్శి ఎస్.ఎస్.రావత్ ఉత్తర్వులు జారీ చేసినట్లు ఆ శాఖ జిల్లా ఉపసంచాలకులు (డీడీ) కె.వి.వి.ధనుంజయరావు ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో ప్రస్తుత విద్యాసంవత్సరానికి సంబంధించి మూడు సంక్షేమ శాఖల పరిధిలో సుమారు 12 వేల మందికి పైగా విద్యార్థులు కొద్దిరోజుల క్రితం వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోకుండా ఉండిపోయారు. దీంతో విలువైన అవకాశాన్ని కోల్పోయే ప్రమాదం ఏర్పడింది. మరో అవకాశం ఇవ్వాలని జిల్లానుంచి ప్రతిపాదనలు వెళ్లిన మీదట ఉన్నతాధికారులు పరిగణనలోకి తీసుకుని పొడిగింపు ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాలోని అన్ని కళాశాలల యాజమాన్యాలు తమ పరిధిలో ఇంకా నమోదు చేసుకోని విద్యార్థుల వివరాలు సేకరించి ఈ నెల 15లోగా ప్రక్రియ పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని డీడీ సూచించారు. విద్యార్థులు సైతం ఇదే చివరి అవకాశంగా భావించి బాధ్యతగా నమోదు చేసుకునేందుకు ముందుకు రావాలని కోరారు.
ఎస్ఈ డోల తిరుమలరావుకు మాతృ వియోగం
శ్రీకాకుళం, అక్టోబబర్ 4 (న్యూస్టైమ్): తోటపల్లి నీటిపారుదల ప్రాజెక్టు పర్యవేక్షక ఇంజినీర్ డోల తిరుమలరావుకు మాతృవియోగం కలిగింది. ఆయన తల్లి శాంతమ్మ అనారోగ్యంతో మృతిచెందారు. శాంతమ్మకు నలుగురు కుమారులు, నలుగురు కుమార్తెలు. ఆమె భర్త నరసన్నపేట మాజీ ఎమ్మెల్యే, జడ్పీ ఛైర్మన్ డోల సీతారాం సోదరుడు. విజయనగరం జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే పతివాడ నారాయణస్వామి ఆమెకు వరుసకు సోదరుడు అవుతారు. ఆమె అంత్యక్రియలు స్వగ్రామమైన పోలాకి మండలం డోలలో నిర్వహించారు.


