కర్ణాటకకు రూ.25వేల కోట్ల నష్టం
కావేరీ జలాల వివాదం సందర్భంగా తలెత్తిన ఘర్షణలు కర్ణాటకు భారీ నష్టాన్ని మిగిల్చాయి. తమిళనాడుకు కావేరీ జలాలను విడుదల చేయాల్సిందేనని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును నిరసిస్తూ వందలాది మంది ఆందోళనకారులు బెంగళూరులో విధ్వంసం సృష్టించారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులను ధ్వంసం చేశారు. తమిళనాడుకు చెందిన బస్సులు, వాహనాలకు నిప్పు పెట్టారు.
ఈ ఘటనల కారణంగా నగరంలోని సాఫ్ట్వేర్ సహా వివిధ రంగాలకు చెందిన సంస్థలు మూతబడ్డాయి. ఈ విధ్వంస కాండ కారణంగా కర్ణాటకకు సుమారు రూ.25వేల కోట్లు నష్టం వాటిలినట్లు అసోచామ్ వెల్లడించింది. ప్రముఖ ఐటీ కంపెనీల ప్రధాన కార్యాలయాలన్నీ బెంగళూరులోనే ఉండటంతో వాటిపై తీవ్ర ప్రభావం పడింది. మరోవైపు ఈ ఘటనల్లో ఇద్దరు మృతిచెందారు. పోలీసుల కాల్పుల్లో ఓ వ్యక్తి మృతిచెందగా లాఠీచార్జి నుంచి తప్పించుకునే క్రమంలో మరో వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు.
సుమారు 350 మంది ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కన్నడ ప్రజలు ఆందోళన చెందుతున్నా సుప్రీంకోర్టు ఆదేశాలు పాటించేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పష్టం చేశారు. అయితే ప్రజలు హింసను వదిలిపెట్టాలని పిలుపునిచ్చారు. కావేరీ జలాల అంశంలో కర్ణాటకకు తొలి నుంచీ అన్యాయం జరుగుతూనే ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వివాదంపై కేంద్రం స్పందించి పరిష్కారం చూపాలని ఆయన కోరారు.


