కల్వకుర్తి డిమాండుపై పరిశీలన: సీఎం ఆదేశం
- 69 Views
- wadminw
- October 4, 2016
- రాష్ట్రీయం
హైదరాబాద్, అక్టోబబర్ 4 (న్యూస్‌టైమ్): మహబూబ్‌నగర్ జిల్లా కల్వకుర్తిని రెవెన్యూ డివిజన్‌గా మర్చాలని వస్తున్న డిమాండ్‌పై తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు మంగళవారం చర్చలు జరిపారు. జిల్లాకు చెందిన మంత్రులు డాక్టర్ సి. లక్ష్మా రెడ్డి, జూపల్లి కృష్ణా రావు, ప్రణాళిక బోర్డు వైస్ చైర్మన్ నిరంజన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ శ్రీదేవితో మాట్లాడారు. కల్వకుర్తి నియోజకవర్గం పరిధిలోని అమనగల్, మాడ్గుల, తలకొండపల్లి, కొత్తగా ఏర్పడే కడ్తాల మండలం ప్రతిపాదిత రంగారెడ్డి (శంషాబాద్) జిల్లాలో కలుస్తున్నాయి.
దీంతో కల్వకుర్తిని రెవెన్యూ డివిజన్ చేసే అవకాశాలు లేవు. మహాబూబ్‌నగర్ జిల్లా పరిధిలోనే వున్న కల్వకుర్తిలో ఇక కల్వకుర్తి, వెల్దండ మండలాలు మాత్రమే మిగులుతాయి. ఈ నేపథ్యంలో కల్వకుర్తి డివిజన్ ఏర్పాటు ఎలా? అనే ప్రశ్న తలెత్తింది. అయినప్పటికీ ప్రజల నుంచి డిమాండ్ వున్నందున కల్వకుర్తి డివిజన్ గురించి పరిశీలించాలని ముఖ్యమంత్రి చెప్పారు.
ముసాయిదా నోటిఫికేషన్లో ప్రకటించిన 17 కొత్త జిల్లాలు కాకుండా మరో నాలుగు ప్రాంతాల నుంచి వచ్చిన జిల్లా ఏర్పాటు డిమాండ్లను పరిశీలించడానికి ముఖ్యమంత్రి హై పవర్ కమిటీని ఏర్పాటు చేశారు. ఎంపి కె. కేశవరావు నాయకత్వంలోని కమిటీలో డిప్యూటీ సిఎం మహమూద్ అలీ, మంత్రులు జగదీష్ రెడ్డి, పోచారం శ్రీనివాస్ రెడ్డి, జోగు రామన్న సభ్యులుగా ఉంటారు.
ముసాయిదా నోటిఫికేషన్లో 17 కొత్త జిల్లాలను ప్రభుత్వం ప్రతిపాదించింది. జనగామ, సిరిసిల్ల, గద్వాల, ఆసిఫాబాద్ జిల్లాల ఏర్పాటు కోసం ప్రజాప్రతినిధులు, ప్రజల నుంచి డిమాండ్లు వచ్చాయి. ఈ డిమాండ్లను పరిశీలించాల్సిందిగా ప్రభుత్వం హై పవర్ కమిటీని కోరింది. ప్రజల డిమాండ్ మేరకు ఈ నాలుగు జిల్లాలను ఏర్పాటు చేయవచ్చా? అనే అంశాలపై కమిటీ అధ్యయనం జరిపి ఈ నెల 7వ తేదీ మధ్యాహ్నం వరకు నివేదిక అందివ్వాలని ముఖ్యమంత్రి కోరారు. ఈ కమిటీ నివేదిక ఆధారంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది.
కొత్త జిల్లాల డిమాండ్ల పరిశీలనకు అత్యవసర సమావేశాలు నిర్వహించుకుని వేగంగా ప్రక్రియను ముగించాలని హై పవర్ కమిటీని ముఖ్యమంత్రి కోరారు. కాగా, ఆదిలాబాద్ జిల్లాలో ఆసిఫాబాద్ కేంద్రంగా మరో జిల్లాను ఏర్పాటు చేసే ప్రతిపాదనలు పరిశీలించాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. ఎమ్మెల్యే కోవ లక్ష్మీతో పాటు ఆదిలాబాద్ జిల్లాకు చెందిన మంత్రులు, ఇతర ప్రతినిధులు ఏకగ్రీవంగా ఆసిఫాబాద్ జిల్లాను ప్రతిపాదించారు. దీంతో జిల్లాలో మండలాలు, డివిజన్లు, జిల్లాల కూర్పుపై ఆ జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులతో ముఖ్యమంత్రి ప్రత్యేకంగా కసరత్తు చేశారు. ఆదిలాబాద్ జిల్లాను 20 మండలాలతో, కొమురం భీం మంచిర్యాల జిల్లాను 13 మండలాలతో, ఆసిఫాబాద్ జిల్లాను 15 మండలాలతో, నిర్మల్ జిల్లాను 18 మండలాలతో ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన రూపొందింది.
జిల్లాలో కొత్తగా 16 మండలాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. బెల్లంపల్లి, ముథోల్ డివిజన్లు ఏర్పాటు చేయాలని, క్యాతంపల్లిని నగర పంచాయితీగా మార్చాలని, బాసర కేంద్రంగా కొత్త మండలం ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. మరోవైపు, చిన్న పాలనా విభాగాలే మంచి ఫలితాలిస్తాయని ప్రపంచవ్యాప్తంగా గతానుభవాలు సూచిస్తున్నాయని, అదే స్ఫూర్తితో తెలంగాణ రాష్ట్రంలో కొత్త జిల్లాలు, డివిజన్లు, మండలాలు ఏర్పాటు చేస్తున్నామని ముఖ్యమంత్రి ఇప్పటికే ప్రకటించారు. సత్వర అభివృద్ధికి, స్థానిక వనరుల సద్వినియోగానికి, పేదరిక నిర్మూలనకు చిన్న జిల్లాల ఏర్పాటు ఎంతగానో దోహదపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ప్రతీ జిల్లాలో మంత్రి, కలెక్టర్లు తమ కంప్యూటర్లో కుటుంబాల వివరాలు నమోదు చేసుకుని స్వయంగా ఒక్కో కుటుంబం గురించి శ్రద్ధ తీసుకునే పరిస్థితి రావాలని చెప్పారు. అందుకే ప్రతీ జిల్లాలో సగటున 3లక్షల కుటుంబాలుండేలా జిల్లాలను పునర్వ్యవస్థీకరిస్తున్నట్లు వెల్లడించారు. పేదల సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతున్నప్పటికీ, పర్యవేక్షణ లోపం వల్ల అవి అనుకున్న మేర ఫలితాలివ్వడం లేదని ముఖ్యమంత్రి అన్నారు. సమాజంలో పేదరికం, అసమానతలు ఉన్నంత వరకు అశాంతి, అలజడి ఉంటుందన్నారు. వీటిని రూపమాపడంలో చిన్న పరిపాలనా విభాగాలు మంచి ఫలితాలు అందిస్తాయని, అందుకు మండల వ్యవస్థే ఉదాహరణ అని సిఎం అన్నారు. ప్రజల సౌకర్యార్ధమే ఈ ప్రక్రియ చేపట్టినందున జిల్లాలు, డివిజన్లు, మండలాల సంఖ్య పెరిగినా ఫరవాలేదని సిఎం అన్నారు.


