కళింగ కోమట్లను ఓబీసీ జాబితాలో చేర్చాలి
శ్రీకాకుళం, సెప్టెంబర్ 6 (న్యూస్‌టైమ్): కళింగ కోమట్లను ఓబీసీ జాబితాలో చేర్చాలని, అందుకు కళింగ కోమట్లు అంతా సమష్టిగా కృషి చేయాలని కళింగ కోమట్ల సంఘం రాష్ట్ర అధ్యక్షులు అందవరపు వరహానరసింహం (వరం) అన్నారు. శ్రీకాకుళం నగరంలోని స్థానిక జిల్లా రైసుమిల్లర్స్ అసోసియేషన్ భవనంలో జిల్లా కళింగ కోమట్ల సంక్షేమ సంఘం సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వరహనరసింహం మాట్లాడుతూ సంఘం అభివృద్ధికి అంతా పాటుపడాలన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు బోయిన గోవిందరాజులు, బి.నాగేశ్వరరావు, జామి భీమశంకరరావు, కోరాడ హరిగోపాల్, తంగుడు జోగారావు, మల్లా సూర్యనారాయణ గుప్త, సాన షణ్ముఖరావు, బోయిన రమేష్, కోణార్క్ శ్రీను, బోయిన శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.
కాగా, శ్రీకాకుళం సబ్‌డివిజన్ పరిధిలోని ఆమదాలవలసలో అయిదుగురు నిందుతులను పోలీసులు అరెస్టు చేశారు. శ్రీకాకుళం డీఎస్పీ కె.భార్గవరావు నాయుడు తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఇందుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. విజయనగరం జిల్లా పార్వతీపురం వెంకమ్మపేటకు చెందిన కె.శ్రీనివాసరావు, ఆమదాలవలసకు చెందిన జి.వెంకటరమణ, ఎస్.శేఖర్, పలాసకు చెందిన టి.మణికంఠ, కాకినాడకు చెందిన రాజారావులు ఆమదాలవలస పట్టణంతో పాటు గ్రామాల్లో దొంగతనాలకు పాల్పడుతున్నారన్నారు. ఇందులో కె.శ్రీనివాసరావు పాత నేరస్థుడు కావడంతో అతని కదలికలపై దృష్టి సారించినట్లు తెలిపారు.
అనుమానాస్పదంగా తిరుగుతుండడంతో ఆమదాలపలసలోని లెప్రసీ కాలనీలో అరెస్టు చేసినట్లు డీఎస్పీ వెల్లడించారు. నిందితుల నుంచి అయిదున్నర తులాల బంగారం, కిలో వెండి, అయిదు సెల్ఫోన్లు, 20 కిలోల ఇత్తడి, మూడు గడియారాలు స్వాధీనం చేసుకున్నట్లు ఆయన వివరించారు. ఈ సమావేశంలో ఆమదాలవలస సి.ఐ. నవీన్‌కుమార్, ఆమదాలవలస, సరుబుజ్జిలి ఎస్సైలు పాల్గొన్నారు.
వీఆర్ఏలకు తెలుపుకార్డుల నిలిపివేత అన్యాయం
శ్రీకాకుళం, సెప్టెంబర్ 6 (న్యూస్‌టైమ్): గ్రామ రెవెన్యూ సహాయకుల తెలుపు రేషన్‌కార్డులను నిలిపివేయడం అన్యాయమని జిల్లా అధ్యక్షులు జి.రాజేంద్రప్రసాద్ అన్నారు. శ్రీకాకుళం నగరంలోని స్థానిక రెవెన్యూ అతిథి గృహంలో డైరెక్ట్ రిక్రూట్ వీఆర్ఏల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీసీఎల్ఏ నిబంధనల మేరకు వీఆర్ఏలను గ్రామస్థాయిలో వినియోగించాలని, ఏ ఇతర కార్యక్రమంలో వినియోగించకూడదన్నారు. మహిళా వీఆర్ఏలకు ప్రసూతి సెలవుల మంజూరు హర్షణీయమని, పురుష వీఆర్ఏలకు పేటర్నటీ సెలవులను సైతం మంజూరు చేయాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శి వై.ప్రవీణ్‌కుమార్, ఉపాధ్యక్షులు ఎం.లక్ష్మీనారాయణ, జి.వెంకటరమణ, దేవమ్మ, సురేష్, విజయ, రామారావు, అప్పలనాయుడు, తదితరులు పాల్గొన్నారు.
గ్రానైట్ పరిశ్రమ అభివృద్ధికి సహకారం: అచ్చెన్న
శ్రీకాకుళం, సెప్టెంబర్ 6 (న్యూస్‌టైమ్): రాష్ట్రంలో గ్రానైట్ పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం పూర్తిస్థాయిలో సహకరించనుందని, అందుకు తన వంతు సహకారం అందిస్తానని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. శ్రీకాకుళం నగరంలోని స్థానిక జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఆంధ్రప్రదేశ్ గ్రానైట్ పరిశ్రమ సమాఖ్య, ఉత్తరాంధ్ర గ్రానైట్ యాజమాన్యాల సంఘం సంయుక్త ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అచ్చెన్నాయుడు మాట్లాడుతూ రాష్ట్రంలో గ్రానైట్ పరిశ్రమతో పాటు వాటి అనుబంధ పరిశ్రమల అభివృద్ధి సంస్థలు ఏర్పాటు చేయడం వల్ల ఎక్కువ మందికి ఉపాధి కల్పించే అవకాశం ఉంటుందన్నారు. పరిశ్రమలో పనిచేసే వారిని చంద్రన్న బీమాలో చేర్పించి బీమా సౌకర్యం కల్పించాలన్నారు. గ్రానైట్ పరిశ్రమను అభివృద్ధి చేయాల్సి ఉందని, గ్రానైట్ పరిశ్రమల యజమానులు చట్టపరిధిలో వ్యాపారం చేస్తే ప్రభుత్వం పూర్తిస్థాయిలో సహకరిస్తుందని చెప్పారు. ప్రజలకు ఉపాధి కల్పించే లక్ష్యంతో చిన్నతరహా పరిశ్రమల ఏర్పాటునకు ప్రతి నియోజకవర్గంలో 100 నుంచి 150 ఎకరాల్లో పారిశ్రామిక పార్కుల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని, జిల్లాలో గ్రానైట్ పరిశ్రమకు ప్రత్యేకంగా కేటాయించేందులా చర్యలు తీసుకుంటామన్నారు. గ్రానైట్ పరిశ్రమపై ఎక్కువ ఒత్తిడి పెట్టాలనేది ప్రభుత్వ ఉద్దేశం కాదని అన్నారు. జిల్లాలో పరిశ్రమకు మేలు జరిగేలా జీవో 107 అమలుకు చర్యలు తీసుకుంటామన్నారు. అనుమతుల మంజూరులో లోపాలుంటే సరిచేసేలా చర్యలు తీసకుంటామన్నారు. సామాజిక కార్యక్రమాలు చేపట్టేందుకు గ్రానైట్ పరిశ్రమలు ముందుకు రావాలన్నారు. ఉత్తరాంధ్ర గ్రానైట్ యాజమాన్యాల సంఘం అధ్యక్షుడు కోత మురళీధర్ మాట్లాడుతూ గ్రానైట్ పరిశ్రమకు రుణ సదుపాయం కల్పించడంతో పాటు నిరభ్యంతర పత్రం స్థానికంగానే అందజేయాలన్నారు. అలాగే గ్రానైట్ పరిశ్రమకు ప్రత్యేక పార్కును ఏర్పాటు చేసి ఇతర సమస్యలు పరిష్కరించాలని ఆయన కోరారు. అనంతరం మంత్రి అచ్చెన్నాయుడును గ్రానైట్ పరిశ్రమల యాజమాన్యాల సంఘం నాయకులు సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ అధ్యక్షురాలు చౌదరి ధనలక్ష్మి, ఎంపీ కింజరాపు రామ్మోహన్నాయుడు, శ్రీకాకుళం శాసన సభ్యులు గుండ లక్ష్మీదేవి, ఆంధ్రప్రదేశ్ గ్రానైట్ సమాఖ్య నాయకులు సీహెచ్.హనుమంతురావు, వి.నారదరెడ్డి, ఆర్.లక్ష్మీనారాయణ, పి.వి.సుబ్బారావు, ఎం.వెంకారెడ్డి, తిరుపతిరెడ్డి, రాజేష్, ఉత్తరాంధ్ర గ్రానైట్ యాజమాన్యాల సంఘం నాయకులు కె.ఎం.హరికుమార్, కె.పాండియన్, పి.వెంకటరావు, వి.వెంకటరాజు, ఇ.రామారావు, ఎన్.శ్రీనివాస్, ఎ.నాగేష్, తదితరులు పాల్గొన్నారు.


