కశ్మీరులో సైనిక శిబిరంపై పాక్ కాల్పులు
శ్రీనగర్, సెప్టెంబర్ 6: జమ్మూ-కాశ్మీర్‌లోని సరిహద్దుల వెంబడి పాకిస్థాన్ ఆగడాలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా మంగళవారం మరోసారి పాకిస్థాన్ కాల్పులు విరమణను ఉల్లంఘించి కాల్పులకు పాల్పడింది. తూంచ్ సెక్టార్లో సైనిక శిబిరంపై కాల్పులు జరిపినట్లు అధికారులు తెలిపారు. అయితే ఈ ఘటనలో ఎవరూ గాయపడ లేదని ఆ వర్గాలు తెలిపాయి. ఓవైపు జమ్మూ-కాశ్మీర్లో శాంతిస్థాపనకు ప్రయత్నాలు జరుగుతుండగా మరోవైపు పాకిస్థాన్ రెచ్చగొట్టే చర్యలకు పాల్పడడం శోచనీయమని నిపుణులు విమర్శిస్తున్నారు. ఊహించినట్లుగానే పాకిస్థాన్ మళ్లీ బరి తెగించింది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి మరోసారి కవ్వింపు చర్యలకు పాల్పడింది. జమ్మూకశ్మీర్ పూంచ్ జిల్లాలోని షాపూర్ సెక్టార్లో పాక్ సైన్యం కాల్పులకు తెగబడింది. సరిహద్దు వెంట ఉన్న గ్రామాలపై బుల్లెట్ల వర్షాన్ని కురిపించింది.
అయితే కాల్పుల్లో ఎలాంటి ప్రాణనష్టం లేదని తెలుస్తోంది. దాంతో భారత బలగాలు వెంటనే స్పందించి ఎదురు కాల్పులకు దిగాయి. భారత సైన్యం దీటుగా స్పందిచడంతో భారీగా కాల్పులు జరిగినట్టు తెలుస్తోంది. కాగా పాక్ కాల్పుల ఘటనలో పలువురు స్థానికులు స్వల్పంగా గాయపడ్డారు. ఈ విషయాన్ని ఆర్మీ అధికారులు ధ్రువీకరించారు. మరోవైపు, కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మంగళవారం ఉదయం 11 గంటలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. జమ్మూకశ్మీర్‌లో అఖిలపక్ష బృందం పర్యటన వివరాలను రాజ్ నాథ్ ఈ భేటీలో ప్రధానికి వివరించారు. హిజ్బుల్ ముజాహిద్దీన్ కమాండర్ బుర్హాన్ వనీ ఎన్కౌంటర్ తర్వాత కశ్మీర్ లోయలో చెలరేగిన అల్లర్లు తీవ్ర ఉద్రిక్తతను రేపిన విషయం తెలిసిందే. ఈ అల్లర్లలో 73 మంది మరణించారు. మరోవైపు కశ్మీర్‌లోని పలు ప్రాంతాల్లో కర్ఫ్యూ ఇంకా కొనసాగుతూనే ఉంది.
ఈ నేపథ్యంలో కశ్మీర్ సమస్యకు పరిష్కారం కనుగొనే లక్ష్యంతో అఖిలపక్ష బృందం జమ్మూకశ్మీర్‌లో పర్యటించింది. అల్లర్లతో అట్టుకుడుతున్న జమ్మూకాశ్మీర్‌లో పరిస్థితులను చక్కదిద్దేందుకు రాజ్‌నాథ్ సింగ్ ప్రధానితో చర్చించినట్లు తెలిసింది. అఖిలపక్ష బృందం పర్యటన సందర్భంగా వేర్పాటువాదులైన గిలానీ, యాసిన్ మాలిక్ చర్చించేందుకు ప్రయత్నించింది. అయితే అఖిలపక్ష బృందంలోని నాయకులతో చర్చించేందుకు మాత్రం వేర్పాటువాదుల నాయకుల అంగీకరించలేదు. ఈ బృందం చేసిన శాంతిప్రయత్నాలలో విశ్వసనీయత లేదంటూ వేర్పాటువాద నాయకుల చర్చలను తిరస్కరించారు. ఎంఐఎం అధినేత, ఎంపి అసదుద్దీన్ ఓవైసీతో యాసిన్ మాలిక్ కేవలం రెండు నిముషాలపాటు మాట్లాడారు.
అదికూడా చర్చలకు తాము సుముఖంగా లేమని చెప్పేందుకు మాత్రమే ఆయన మాట్లాడినట్లు తెలుస్తోంది. రాజ్‌నాథ్ నేతృత్వంలోని బృందం జమ్మూ-కాశ్మీర్‌లోని అన్ని పార్టీల నాయకులు, ఇతర వర్గాలతో చర్చించారు. ఎవరితోనైనా చర్చించేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని ఈ బృందం తెలిపింది. లోయలో శాంతి స్థాపనకు, ప్రజాస్వామ్య మనుగడకు అన్ని వర్గాల ప్రజలు సహకరించాలని రాజ్‌నాథ్ సింగ్ కోరారు. పర్యటన అనంతరం ఢిల్లీకి వచ్చిన రాజ్‌నాథ్ మంగళవారం ప్రధానితో భేటీ అయ్యారు. అక్కడి పరిస్థితులను ప్రధానికి వివరించారు. కాశ్మీర్లో సాధారణ పరిస్థితులు నెలకొల్పేందుకు తగిన చర్యలు తీసుకోవాలని ప్రధాని మోడీ హోంమంత్రికి సూచించారు. తాజా పరిణామాల నేపథ్యంలో మరోసారి అఖిలపక్ష బృందంతో సమావేశమై కార్యాచరణను నిర్ణయిస్తారు.
తెలంగాణ ప్రాజెక్టులపై నాబార్డుతో ఒప్పందం
దేవాదుల సహా 11 ప్రాజెక్టులకు మేలు: మంత్రి హరీశ్
దేశవ్యాప్తంగా 2020 నాటికి 99 ప్రాజెక్టుల పూర్తి లక్ష్యం: ఉమ
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 6: దేశ వ్యాప్తంగా అసంపూర్తిగా ఉన్న 99 ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు కేంద్ర జలవనరులశాఖ, నాబార్డు, నేషనల్ వాటర్ డెవలప్మెంట్ అథారిటీ మధ్య భారీ ఒప్పందం కుదిరింది. దేశరాజధాని హస్తినలో మంగళవారం కేంద్ర జలవనరులశాఖ మంత్రి ఉమాభారతి సమక్షంలో అధికారులు ఒప్పంద పత్రాలను మార్చుకున్నారు. కార్యక్రమంలో కేంద్ర జలవనరుల శాఖ మంత్రితో పాటు సమన్వయ కమిటీ ఛైర్మన్, నాబార్డు ఛైర్మన్, సమన్వయ కమిటీ సభ్యులు తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు తదితరులు పాల్గొన్నారు. 2019 నాటికి అసంపూర్తిగా ఉన్నా 99 ప్రాజెక్టులు పూర్తి చేయాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రాజెక్టుల పూర్తికి నాబార్డు ద్వారా రాష్ట్రాలకు నిధులు అందనున్నాయి. మొదటి ప్రాధాన్యంలో 2016-17 నాటికి 23 ప్రాజెక్టులు, రెండో ప్రాధాన్యంలో 2017-18 నాటికి 31 ప్రాజెక్టులు, మూడో ప్రాధాన్యంలో 2019 డిసెంబరు నాటికి 45 ప్రాజెక్టులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ ఒప్పందంలో తెలంగాణ రాష్ట్రంలోని దేవాదుల ఎత్తిపోతల సహా 11 ప్రాజెక్టులు ఉన్నాయి. దేశంలోని నీటి పారుదల ప్రాజెక్టులు పూర్తిచేసేందుకు నాబార్డుతో జరిగిన ఒప్పందం చరిత్రాత్మకమని, ఎంతో సంతోషదాయకమని కేంద్ర జలవనరులశాఖ మంత్రి ఉమాభారతి అన్నారు. దేశవ్యాప్తంగా అసంతపూర్తిగా ఉన్న సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి నిధులు అందించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ప్రధానమంత్రి కృషి సంచాయ్ యోజన కింద నాబార్డు నుంచి రుణాలు తీసుకోవాలని కేంద్రం నిర్ణయించిందని మంత్రి చెప్పారు. ఈ రుణాలను 18 ఏళ్ళల్లో తిరిగి తీర్చివేయాలని నిర్ణయించడం జరిగిందన్నారు. ఈ సమావేశంలో జల వనరులశాఖ కార్యదర్శి శశికుమార్, నీతిఆయోగ్ వైస్‌చైర్మన్ అరవింద్ పనగరియా కూడా పాల్గొన్నారు. ఒప్పందం అనంతరం తెలంగాణ మంత్రి తన్నీరు హరీష్‌రావు మాట్లాడుతూ సాగునీటి ప్రాజెక్టులపై నాబార్డుతో ఒప్పందం జరగడం ఎంతో సంతోషకరమన్నారు. దీనివల్ల తెలంగాణ రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి ఎంతో మేలు జరుగుతుందన్నారు. దీనివల్ల రాష్ట్రంలో చివరి ఆయకట్టు వరకు సాగునీటిని అందించవచ్చన్నారు. దేవాదుల సహా పదకొండు ప్రాజెక్టులకు మేలు జరుగుతుందన్నారు. ఈ ప్రాజెక్టుల నిర్మాణానికి రూ.7 వేల కోట్ల మేరకు ప్రతిపాదనలు పంపామన్నారు. రూ.2 వేల కోట్లను గ్రాంటుగా చెల్లించాలని, రుణ రూపేణ రూ.5 వేల కోట్లు ఇప్పించాలని కోరామన్నారు. ఇప్పటికే దేవాదుల ప్రాజెక్టుకు రూ.300 కోట్లను ఇచ్చారని తెలిపారు. ప్రాజెక్టులకే కాక జలవనరుల వినియోగానికి కూడా నిధులు ఇవ్వడం సంతోషకరమని హరీష్‌రావు అన్నారు. ఈ సమావేశానికి తనను కూడా ఆహ్వానించినందుకు కేంద్రమంత్రికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
కర్ణాటకలో కొనసాగుతున్న ‘కావేరి’ వివాదం
‘సుప్రీం’ తీర్పును వ్యతిరేకించిన రైతాంగం
బెంగళూరు, సెప్టెంబర్ 6: తమిళనాడుకు కావేరి జలాలు విడుదల అంశంలో సుప్రీం కోర్టు ఆదేశాలపై రాష్ట్ర రైతాంగం ఆగ్రహం వ్యక్తంచేసింది. ఈ తీర్పునకు వ్యతిరేకంగా మంగళవారం కర్ణాటక రైతులు నిరసన చేపట్టారు. ఈ నేపథ్యంలో రైతులు బంద్ నిర్వహించి వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు. తమిళనాడు సరిహద్దుల నుంచి రాష్ట్రంలోకి వాహనాలను అనుమతించలేదు. రాష్ట్రంలో కూడా బంద్ పాటిస్తూ వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగించారు. కావేరి జలాలను విడుదల చేయాలని కర్నాటకను ఆదేశించాలంటూ తమిళనాడు ప్రభుత్వం సుప్రీం కోర్టులో పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. దీనిని విచారించిన న్యాయస్థానం తీర్పునిస్తూ తమిళనాడుకు 15వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేయాలని కర్నాటకను ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ తీర్పును నిరసిస్తూ రైతాంగం ఆందోళనబాట పట్టింది. తమిళనాడుకు కావేరి జలాలు విడుదల చేయాలన్న సుప్రీంకోర్టు తీర్పుపై కర్ణాటకలో నిరసనలు కొనసాగుతున్నాయి. మాండ్యాలో మంగళవారం ఉదయం నుంచి బంద్ కొనసాగింది. రైతులు బెంగళూరు- మైసూరు జాతీయ రహదారిని దిగ్బంధించారు. దీంతో రాకపోకలకు అంతరాయమేర్పడింది. రైతులకు మద్దతుగా వివిధ రాజకీయ పార్టీలు కూడా రోడ్డెక్కడంతో ఆందోళన ఉద్ధృతమైంది. కావేరి జలాలు విడుదల చేయొద్దంటూ రైతులు నినాదాలు చేస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు. తమిళనాడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రైతుల ఆందోళనల దృష్ట్యా 2,400 మంది పోలీసులు మోహరించారు. తమిళనాడుకు 15 వేల క్యూసెక్కుల కావేరి జలాలు విడుదల చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. సుప్రీం తీర్పును వివిధ రాజకీయ పక్షాలు, రైతు సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. కావేరి జలాల వివాదంపై మంగళవారం అఖిలపక్ష భేటీకి కర్ణాటక సీఎం సిద్దరామయ్య పిలుపునిచ్చారు. కావేరి జలాల విషయమై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుపై సమావేశంలో చర్చించాల్సి ఉంది. కర్ణాటకలో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నందున కావేరి జలాలు విడుదల చేయడం సాధ్యం కాదని రైతు సంఘాలు ఆందోళన చేస్తున్నారు. మరోవైపు, ఒప్పందం ప్రకారం కావేరి జలాలు విడుదల చేయాల్సిందేనని తమిళనాడు స్పష్టం చేసింది. కావేరి జలాలు విడుదల చేయాలని గతంలో తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత కర్ణాటక సీఎం సిద్దరామయ్యకు లేఖ కూడా రాశారు. కర్ణాటక ప్రభుత్వం స్పందించకపోవడంతో వివాదం సుప్రీం కోర్టుకు చేరింది. తాజాగా సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును కర్ణాటక ప్రభుత్వం అములు చేస్తుందా? లేదా వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. పదిరోజుల వ్యవధిలో మొత్తం 15 టీఎంసీల కావేరీ జలాలను విడుదల చేయాలని సుప్రీం తీర్పునిచ్చింది. దీంతో మాండ్యా, మైసూర్ జిల్లాల్లో రైతు సంఘాలు ఆందోళనకు దిగాయి. ముఖ్యంగా కావేరి పరివాహక ప్రాంతాలైన హాసన్, మాండ్య, మైసూర్ జిల్లాల్లో ఆందోళన ఉద్ధృతంగా ఉంది. రహదారులపై రవాణాను ఎక్కడికక్కడు రైతులు అడ్డుకుంటున్నారు. దీంతో అనేక ప్రాంతాల్లో బస్సుల రాకపోకలు నిలిచిపోయాయి. సరిహద్దు ప్రాంతాలన్నీ స్తంభించిపోయాయి. తమిళనాడు, కర్ణాటక మధ్య బస్సు సర్వీసులు పూర్తిగా నిలిపోయాయి. రైతుల ఆందోళన ఉద్ధృతం కావడంతో కృష్ణాసాగర్ వద్ద అదనపు పోలీసు బలగాలను మోహరించాయి. ఎక్కడికక్కడ సీసీ టీవీలను ఏర్పాటు చేస్తూ పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. రైతులు ఎవరూ ప్రాజెక్టుల వద్దకు వెళ్లకుండా అడ్డుకుంటున్నారు. కావేరి జలాలను విడుదల చేయాలని సుప్రీం తీర్పు నిచ్చిన నేపథ్యంలో నిరసనగా తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత దిష్టి బొమ్మలను దహనం చేశారు. రైతుల ఆందోళనకు మద్దతివ్వాలంటూ ఎంపీ అంబరీష్ దిష్టి బొమ్మను కూడా దహనం చేశారు. ఈ నేపథ్యంలో ఈ వివాదంపై ముఖ్యమంత్రి సిద్దరామయ్య న్యాయకోవిదులతో మాట్లాడనున్నారు. అనంతరం అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తారు. సాయంత్రం 6గంటలకు దీనిపై ప్రత్యేకంగా చర్చించనున్నారు. సుప్రీం తీర్పుపై మాజీ ప్రధాని దేవెగౌడ మాట్లాడారు. రైతులు శాంతియుతంగా ఆందోళన చేయాలని పిలుపునిచ్చారు. దిష్టిబొమ్మల దహనం వల్ల ప్రయోజనం ఉండదని వ్యాఖ్యానించారు. కావేరి బేసిన్‌కు చెందిన మరో మంత్రి మంత్రి డీకే శివకుమార్ కూడా రైతులకు మద్దతుగా నిలిచారు. మాండ్యాలోని సంజయ్ సర్కిల్లో రైతుల ఆందోళనను అదుపు చేయడానికి సీఆర్పీఎఫ్ పోలీసులు లాఠిఛార్జి చేశారు. దీంతో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మాండ్యా, మైసూర్ తదితర ప్రాంతాల్లో రోడ్లపై వాహన సంచారం పూర్తి నిలిచిపోయింది. ఈనెల 9న కర్ణాటక బంద్‌కు కన్నడ సంఘాలు పిలుపునిచ్చాయి.


