కశ్మీర్ అల్లర్లపై కేంద్రం ఉక్కు పాదం!
- 91 Views
- wadminw
- September 22, 2016
- అంతర్జాతీయం
శ్రీనగర్, సెప్టెంబర్ 22: అటు పాకిస్తాన్, ఇటు భారతావణిని దాదాపు దశాబ్దకాలంగా ఉక్కిరిబిక్కిరిచేస్తున్న కశ్మీర్ వేర్పాటువాద సమస్య ఈమధ్య కాలంలో మరింత తీవ్రరూపం దాల్చినట్లు కనిపిస్తోంది. రెండు దేశాలలోనూ పాలక పక్షాలు మారుతున్న ప్రతిసారీ ఈ తరహా యుద్ధవాతావరణం కమ్ముకోవడం పరిపాటే అయినా, ఎలాంటి రాజకీయ మార్పూ లేకపోయినా, ఇటీవల కాలంలో రెండు దేశాల సరిహద్దుల్లో తీవ్రమైన పోరు కొనసాగుతోంది. భారత్‌లోకి పాక్ నుంచి ఉగ్రవాదులు చొరబడుతున్నారన్న కారణంగా గత రెండున్నరేళ్లుగా సరిహద్దుల్లో భద్రత కట్టుదిట్టం చేసిన నరేంద్రమోదీ సర్కారు పాక్‌లోని నవాజ్ షరీఫ్ ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు ఊహించని ట్విస్టులే ఇస్తూ వస్తున్నారు. అటువైపు నుంచి కవ్వింపు చర్యలు ఎలా ఉన్నా ఇటు నుంచి మాత్రం తీవ్రంగానే ప్రతిస్పందించడం జరుగుతూ వస్తోంది.
ఈసారి కూడా భారత భద్రతా బలగాలు గతం కంటే కాస్త భిన్నంగానే ఉరీ ఉగ్రవాద దాడికి ప్రతికారం తీర్చుకున్నట్లు కనిపిస్తోంది. గత దశాబ్దాల కాలంగా కశ్మీర్ వేర్పాటువాదంపై దేశంలో భారీ సంచలనానే సృష్టిస్తోన్న సంగతి అందరికి తెలిసిందే. వరుసగా కశ్మీర్ ప్రాంతంలో భారత సైనికులు ఆదీనంలోకి తీసుకుని పరిస్థితులను బట్టి కర్ప్యూ లను విదిస్తున్నారు. తాజాగా మరోసారి కర్ప్యూ ను విధించి 70 రోజులు కావస్తుంది. ఈ క్రమంలో కశ్మీర్ మరోసారి యుద్దభూమిగా మారింది. అయితే కశ్మీర్‌పై అక్రమిత పాక్ హస్తం ఉందని భారత ప్రభుత్వ వాదన. వారు కశ్మీర్‌ను కైవసం చేసుకుని తమ పాకిస్థాన్‌లో కలిపేసుకోవాలని తహ తహ లాడుతుంది. ఈ క్రమంలోనే పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులతో భారత్ సైన్యంపై కవ్వింపు చర్యలకు దిగుతూ వస్తోంది. పాక్ ఐఎస్ఐ సహకారంతో లష్కర్ తోయిబా, జైష్ ఏ మహ్మద్, తదితర ఉగ్రవాద సంస్థలకు చెందిన ఉగ్రవాదులు పాక్ సైనిక స్థావరాల్లో శిక్షణ పొందుతారన్న సంగతి అందరికి తెలిసిందే. అవసరాన్ని బట్టి పాక్ సైన్యం ఉగ్రవాదులు వాడుకుంటూ వస్తోంది.
ఈ వాస్తవం గతంలో ఎన్నో సార్లు నిరూపితమైంది. ఎప్పటికప్పుడు ఉగ్రవాదుల సహకారం పాక్ దళాలకు లభిస్తూనే ఉంది. అయతే గత కొన్ని రోజులుగా కర్య్పూ నీడలో ఉన్న కాశ్మీర్ లోయలో ఇటీవలే ప్రశాంత వాతావరణం ఏర్పడుతోంది. మరోసారి ఆశాంతిని నెలకొల్పేందుకే ఉగ్రదాడి జరిగిందని వాస్తవంగా చెప్పొచ్చు! తాజాగా గత ఆదివారం తెలవారుజామున జమ్మూ కశ్మీర్ యూరీ పట్టణ సైనిక శిబిరంపై మెరుపు దాడి చేసి నిద్రిస్తున్న భారత సైనికులపైకి విచక్షణా రహితంగా కాల్పులు జరిపి మొత్తం 17 మందిని పొట్టన పెట్టుకున్నారు. భారత సైన్యంపై జరిగిన దాడుల్లో ఇంత మంది జవాన్లు ఒకేసారి మరణించటం గత దశాబ్ద కాలంలో ఇదే మొదటి సారి. అయితే తాజాగా కశ్మీర్ వేర్పాటువాదులకు మావోయిస్టులు స్పందించారు. కశ్మీర్ వేర్పాటువాదులకు పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు.
ఆంధ్రా-ఒడిశా మావోయిస్టు కమిటీ పేరుతో వారు ఓ లేఖను విడుదల చేశారు. కశ్మీర్లో రెఫరెండం జరపాలని, బుర్హాన్ వానీ ఎన్కౌంటర్ బూటకమని వారు ఆ లేఖలో పేర్కొన్నారు. 70 వేల మంది యువకులను ప్రభుత్వ కిరాయి మూకలు హత్యచేశాయని, ఆ సమయంలో లెక్కలేనన్ని అత్యాచారాలు జరిగాయని మావోయిస్టు కమిటీ లేఖలో చెప్పింది. ప్రభుత్వంపై వ్యతిరేకత నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే కశ్మీర్ సమస్యను పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదమని ప్రచారం చేస్తున్నారని ఆంధ్రా-ఒడిశా మావోయిస్టు కమిటీ ఆరోపించింది. వాస్తవానికి కశ్మీర్‌పై భారత్, చైనా, పాకిస్తాన్ దేశాల పటాలు కూడా ఒక్కో దేశంలో ఒక్కో రకంగా ఉంటాయి.
భారతదేశ పటంలో కనిపించే చాలా భాగాలు పాక్, చైనా దేశాల పటాల్లో భారత భూ భాగాలు గా ఉండవు. ఆరుణాచల్ప్రదేశ్లోని కొంత భాగం, జమ్మూ కశ్మీర్‌లోని చుమ్మార్ తదితర ప్రాంతాలన ఇప్పటికీ చైనా తమ భూభాగాలు గానే గుర్తిస్తున్నాయి. కశ్మీర్ విషయంలో భారత్, పాక్ దేశాల పట్టు మనకు తెలిసిందే. వాస్తవానికి ఒక్కప్పుడు పాకిస్థాన్ భారతదేశంలో భాగమే. కానీ అక్కడి ముస్లీంలు తమ రాజకీయ స్వార్ధాల కోసం బ్రిటిష్ పాలకుల చేతుల్లో పావులుగా మారి తమ దేశం స్వయం ప్రతిపత్తిగా ప్రకటించుకున్నాయి. ఈ క్రమంలోనే జమ్మూ కశ్మీర్ సైతం పాక్ పరిధిలోకే వస్తుందని వారి వాదన. వాస్తవానికి దేశ సరిహాద్దులను గమనిస్తే జమ్మూ కశ్మీర్ భారత దేశానికి తల కాయ లాంటిది.
ఇది నిజాన్ని దేశంలో ప్రతి ఒక్క పౌరుడికి తెలిసిందే. ఈ భూభాగం కోసం ఏండ్ల తరబడి యుద్ధాలు, ఘర్షణలు, గొడవలు జరుగుతూనే ఉన్నాయి. మూడు దేశాల్లో వేల సంఖ్యలో జవానులు మరణించారు. ఒకే యుద్ధంలో మరణించిన ఇద్దరు సైనికాధికారులకు చెరో దేశం దేశ అత్యున్నత సైనిక అవార్డులు ఇచ్చుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఏ దేశ ప్రజలకు ఆ దేశ ప్రభుత్వాలు చేసే వాదనే నిజమని అనిపించేలా ఉంటున్నాయి. ఆయా దేశాల్లోని మీడియా కూడా ప్రజలకు వాస్తవాలు చెప్పడంలేదు. ఇతర దేశాలకు సంబంధించిన వ్యవహారాల్లో ప్రభుత్వాల వాదన, రాజకీయ వాదననే మీడియా సమర్థిస్తూ వస్తున్నది తప్ప స్వతంత్ర వైఖరి తీసుకోవడం లేదు.
కొంచెం భూభాగం విషయంలో కాస్త ఇచ్చిపుచ్చుకునే ధోరణి ప్రదర్శిస్తే, ప్రజల ఆకాంక్షల మేరకు ప్రభుత్వాలు నడుచుకుం టే, ఏ ఒప్పందాల మేరకు దేశాలు ఏర్పడ్డాయో, అవి కచ్చితంగా అమలు చేసుకుంటే ఎవరికీ ఏ సమస్యా ఉండదు. అయితే ఈ క్రమంలోనే పాక్ కొంత మంది కశ్మీర్ వేర్పాటువాదులను చేసుకుని అల్లర్లను సృష్టిస్తోంది! దీనిపై భారతదేశ ప్రభుత్వాలు ముక్త కంఠంతో వ్యతిరేకిస్తున్నాయి. అప్ కోర్స్ దేశంలో ఎవ్వరైనా కశ్మీర్ విడిచి పెట్టేందుకు ఒప్పుకోరు. అయితే ఇక్కడ సమస్య యుద్దానికి యుద్దం, చావుకు చావు శాశ్వతమైన పరిష్కారాన్ని చూపజాలదు. ఈ సమస్య పై సమగ్ర కమిటీని వేసి పరిష్కార దిశగా ఆలోచించాలి. అయితే ఈ పనిని కూడా చేసింది మన ప్రభుత్వం.
కానీ సరైన దిశగా అడుగులు వేయడంలేదన్నది అక్కడి ప్రజల వాదన. అయితే తాజాగా వేర్పాటువాదుల విషయంలో కశ్మీర్ ప్రభుత్వం సున్నితంగా వ్యవహారిస్తోందని, ఇకపై కఠిన వైఖరి తప్పదనే నిర్ణయానికి కేంద్రం వచ్చింది. ఈ నేపథ్యంలోనే వేర్పాటు వాదుల విదేశీ ప్రయాణాలపై ఆంక్షలతో పాటు బ్యాంక్ ఖాతాల్ని నిశితంగా పరిశీలిస్తున్నారు. మరోవైపు, కఠిన వైఖరి అవలంభిస్తామన్న విషయం వేర్పాటువాదులకు తెలియచెప్పాల్సిన సమయం ఆసన్నమైందన్న నరేంద్ర మోడీ నిర్ణయంతో కేంద్ర హోం శాఖ ఆ దిశగా చర్యలకు సిద్దమవుతోంది. ఇదిలా ఉండగా తాజాగా కొద్ది రోజులుగా కశ్మీర్ కర్ప్యూ ఎత్తివేసే దిశగా అడుగులు వేస్తున్న క్రమంలో మరోసారి పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు యూరీ ఆర్మీ పై పంజా విసరడం ఇదే క్రమంలో మావోయిస్టు పార్టీ కశ్మీర్‌పై తమ నిర్ణయాన్ని ప్రకటించడంతో కలకం సృష్టిస్తోంది.
మరి దీనిపై భారత సర్కార్ ఏలాంటి నిర్ణయం తీసుకోనుందో చూడాలిమరి! మొత్తానికి విశ్లేషిస్తే, కశ్మీర్ రోజు రోజుకు అట్టుడికి పోతోంది. ఉగ్రవాది బుర్హాన్ వాణీని భద్రతా దళాలు కాల్చి చంపిన అనంతరం కశ్మీర్ లోయలో అల్లర్లు చెలరేగాయి. స్థానిక యువత భద్రతా దళాలపై రాళ్లు విసురుతూ అసాంఘీక కార్యకలాపాలకు పాల్పడుతున్నాయి. దీంతో గత రెండు నెలలుగా కర్ఫ్యూ కొనసాగిస్తున్నారు. దీంతో కశ్మీర్ అల్లర్లను ఆపేందుకు కేంద్రం, సైన్యం సర్వ శక్తులా ప్రయత్నిస్తోంది. కశ్మీర్ లోయలో కల్లోలం కొనసాగుతోంది. భద్రతా దళాలకు, అల్లరిమూకకు మధ్య అనునిత్యం యుద్ధ వాతావరణం కొనసాగుతోంది. దీన్ని అడ్డుకునేందుకు భద్రతా దళాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. దీనిపై కేంద్రం కూడా సీరియస్‌గా దృష్టిసారించింది. కశ్మీర్ అల్లర్లను నిలువరించేందుకు ఈ మధ్య అఖిలపక్షం లోయలో పర్యటించింది. స్థానికులతో సమావేశం అయ్యి పరిస్థితులపై ఆరాతీసింది. అల్లర్లకు గల కారణాలేంటన్నదానిపై వారిని అడిగి తెలుసుకుంది.
ఢిల్లీకి చేరిన అఖిలపక్ష నేతలు రాజ్‌నాథ్ అధ్యక్షతన మరోసారి సమావేశం నిర్వహించారు. కశ్మీర్లో అల్లర్లకు గల కారణాలు, హురియత్ నేతల వైఖరి, స్థానిక పరిస్థితులు, బుర్హాన్ వాణీ ఎన్కౌంటర్ తదితర అంశాలపై సీరియస్‌గా చర్చించారు. లోయలో శాంతి నెలకొల్పేందుకు కేంద్రం తీసుకోవాల్సిన చర్యలపై సూచనలు చేశారు. దీనికి కేంద్రం కూడా సానుకూలంగా స్పందించింది. ఇదే తరుణంలో హురియత్ నేతల వైఖరి, పాక్‌తో చర్చలపై కూడా ఈ అంశంపై చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. హురియత్ నేతలతో చర్చించడానికి కేంద్రం సానుకూలంగా ఉన్నా వారు సరిగ్గా స్పందించక పోవడంపై కేంద్రం తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. వారికి కేంద్రం సమకూరుస్తున్న భద్రత, వాహనాలు తదితర వాటిని ఉపసంహరించుకోవాలని యోచిస్తోంది కేంద్రం.
కశ్మీరీ నాయకులతో చర్చలు జరిపి ఇప్పుడున్న పరిస్థితిని సాధారణ స్థితికి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్న కేంద్రం. వేర్పాటు నేతలుగా ఉన్న గిలానీ లాంటి పలువురు కశ్మీరీ నాయకులు అఖిలపక్షం నేతల్ని ఇళ్లల్లోకి కూడా ఆహ్వానించకుండా వెనక్కి పంపేయటంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి అవమానాలు ఎదురవుతున్నా కశ్మీర్లో పరిస్థితుల్ని చక్కదిద్దేందుకు చేపట్టాల్సిన కార్యక్రమంపై పలు వర్గాలతో చర్చలు జరుపుతోంది అఖిలపక్షం. గిలానీ ఇంటికి అఖిలఫక్ష నేతలు వెళ్లిన సందర్భంగా అక్కడే ఉన్న ఆయన అఖిలపక్ష నేతల్ని ఇంట్లోకి పిలిచి మాట్లాడేందుకు అంగీకరించకపోవటం.. అక్కడే ఉన్న ఆయన మద్దతుదారులు పాకిస్థాన్ జిందాబాద్ అంటూ నినాదాలు చేసిన నేపథ్యంపై ఎంపీల బృందం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.
ఇలాంటి సమయంలోనే రాజ్‌నాథ్ బృందాన్ని కలిసిన కొందరు వేర్పాటువాదుల వైఖరిని ప్రశ్నిస్తూ దాయాది దేశాన్ని జిందాబాద్ అంటూ నినాదాలు చేసే వారితో చర్చలు జరపాల్సిన అవసరం ఏమిటంటూ వేసిన ప్రశ్న ఇప్పుడు ఆసక్తికరంగా మారటమే కాదు కశ్మీర్ సమస్య పరిష్కారంలో ఎవరికి ఎలాంటి పాత్ర ఇవ్వాలన్న అంశంపై తాజా ఉదంతం ఒక స్పష్టత ఇచ్చిందన్న వాదన వినిపిస్తోంది. నిజమే పాక్‌కు జై కొట్టే వారితో చర్చలు జరపాల్సిన అవసరం ఏముంది? అన్న ప్రశ్నను లేవనెత్తుతున్నారు. ఇలాంటి తరుణంలో కేంద్రం తీసుకునే నిర్ణయంపైనే కశ్మీర్ పరిస్థితి ఆధారపడి ఉంది.


