కశ్మీర్ శాంతి చర్చలకు భంగం!
- 92 Views
- wadminw
- September 5, 2016
- అంతర్జాతీయం
జమ్ముకశ్మీర్‌లో శాంతియుత పరిస్థితులు నెలకొల్పాలన్న ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ, కేంద్ర ప్రభుత్వ ఆలోచనకు వేర్పాటువాదుల రూపంలో భంగం కలుగుతోంది. అక్కడికి ఇప్పటికే వెళ్లిన అఖిలపక్ష బృందాన్ని కలిసి మాట్లాడి తమ సమస్యలు చెప్పేందుకు వేర్పాటువాదులు అంగీకరించడం లేదు. అసలు చర్చలకు ఒప్పుకోం అని చెబుతున్నారు. రాష్ట్రంలో సుస్థిర శాంతిపరిస్థితులు నెలకొల్పేందుకు చర్చకు రావాల్సిందిగా అఖిలపక్ష భేటీ సందర్భంగా వేర్పాటువాద నాయకులకు, ఇతర పక్షాలకు ఆహ్వానం పంపగా వేర్పాటువాదులు అందుకు ససేమిరా అంటున్నారు. వేర్పాటువాద నేతలు సయ్యద్ అలీ షా గిలానీ, మిర్వాయిజ్ ఉమర్ ఫరూక్, యాసిన్ మాలిక్ ఉమ్మడిగా ఓ ప్రకటన విడుదల చేశారు.
ముఖ్యమంత్రి ముఫ్తీది మోసపూరిత పనికిమాలిన ఆలోచన అని, ఇంతపెద్ద విషయాన్ని కేవలం చర్చల పేరిట ముందుకు తీసుకెళ్లాలనుకోవడం మూర్ఖపు ఆలోచన అని వారు తీవ్రంగా నిందించారు. అసలు ఏ ఎజెండాతో చర్చలకు వస్తున్నారో కూడా ఇప్పట వరకు తమకు అర్ధం కావడం లేదని ఆరోపించారు. ఈ చర్చలకు తాము ఏమాత్రం ఆసక్తితో లేమని మరొక వేర్పాటువాద నాయకుడు చెప్పాడు. మరోవైపు, హిజ్బుల్ ముజాహిద్దీన్ చీఫ్ సయ్యద్ సలాహుద్దీన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కశ్మీర్‌ను భారతీయ సైనికుల స్మశానంగా మారుస్తామని అన్నారు. కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆల్ పార్టీ మీట్‌కు ముందు ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం దుమారం రేపుతోంది.
ఓ ఇంగ్లీషు చానెల్‌కు ప్రత్యేక ఇంటర్వూ ఇచ్చిన సలాహుద్దీన్ కశ్మీర్‌పై చర్చలు వ్యర్ధమని అన్నారు. కేవలం మిలిటెన్సీ మాత్రమే కశ్మీర్ సమస్యకు సమాధానం ఇస్తుందని చెప్పారు. కశ్మీరీ లీడర్ షిప్, ప్రజలు, ముజాహిద్దీన్ కశ్మీర్ సమస్యకు శాంతియుత మార్గం లేదని తెలుసుకోవాలని పేర్కొన్నారు. ఆల్ పార్టీ మీటింగ్ కేవలం వ్యాలీలో శాంతియుత వాతావరణాన్ని సృష్టించడానికేనని చెప్పారు. కశ్మీర్ వ్యాలీని మిలిటెంట్ల చేతుల్లోకి తీసుకోవాలని పిలుపునిచ్చారు. జులై 8న బుర్హాన్ వానీ కాల్చివేత తర్వాత మిలిటెన్సీ ఉద్యమం కొత్త మలుపు తిరిగిందని తెలిపారు. ఆర్మీని పెద్ద ఎత్తున మోహరించడం వల్ల మిలిటెన్సీ ఉద్యమం మరింత బలపడుతుందని అన్నారు.
కశ్మీర్ సమస్యను ప్రభుత్వం గుర్తించకపోవడం వల్ల దీనిపై ప్రత్యేకంగా చర్చించాల్సిన పని లేదన్నారు. ఎన్నికల్లో రిగ్గింగ్ జరగడం కూడా తాను తుపాకీ పట్టడానికి ఒక కారణమని చెప్పారు. మరోవైపు, జమ్మూకశ్మీర్‌లో వేర్పాటువాదులు ఆదివారం మరోసారి రెచ్చిపోయారు. షోపియాన్‌లో ఆందోళనకారులు ప్రభుత్వ భవనానికి నిప్పుపెట్టారు. ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చాయి. ఆందోళనకారులు భద్రతాబలగాల పైకి రాళ్లు విసరడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
బుర్హాన్ వాని ఎన్కౌంటర్ నేపథ్యంలో చెలరేగిన అల్లర్లు 58 వ రోజుకు చేరుకోగా సుమారు 70 మంది మృతి చెందారు. కేంద్ర హోం మంత్రి రాజనాథ్ సింగ్ నేతృత్వంలో అఖిలపక్ష బృందం ఆదివారం కశ్మీర్ చేరుకున్న నేపథ్యంలో ఈ ఘర్షణలు చెలరేగడం గమనార్హం. జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి, గవర్నర్‌తో అఖిలపక్షం ఆదివారం భేటీ అయింది. అలాగే అక్కడి రాజకీయ పార్టీలతోనూ అఖిలపక్షం సమావేశం ఏర్పాటుచేసింది. కాగా జమ్మూకశ్మీర్‌లో జమ్మును ప్రత్యేక రాష్ట్రంగా గుర్తించాలనే కొత్త డిమాండ్ వినిపిస్తోంది.


