కాకినాడ ‘స్మార్ట్’ సిటీలో సమస్యల తిష్ట
- 91 Views
- wadminw
- September 9, 2016
- రాష్ట్రీయం
కాకినాడ, సెప్టెంబర్ 9 (న్యూస్‌టైమ్): దేశవ్యాప్తంగా వంద స్మార్ట్ సిటీలను కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. అందులో ఆంధ్రప్రదేశ్ నుంచి మూడు నగరాలకు అవకాశం వచ్చింది. వాటిలో కాకినాడ ఒకటి. స్మార్ట్ సిటీ కింద నగరం అభివృద్ధికి సమగ్ర వ్యూహాలు, ప్రణాళికలను రూపొందించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. ఈ పథకం కింద మొదటి విడతగా 20 నగరాలను ఎంపిక చేస్తారు. మొదటి విడతలోనే ఈ స్థానాన్ని అందిపుచ్చుకోవాలంటే పాలకులకు ప్రణాళిక, వ్యూహరచన ఎంతో అవసరం. కేంద్ర ప్రభుత్వం దేశంలోని నగరాలను ప్రపంచస్థాయిలో తీర్చిదిద్దేందుకు స్మార్ట్ సిటీల పథకాన్ని ప్రవేశపెట్టింది. అందులో భాగంగా దేశవ్యాప్తంగా 98 నగరాలను ఎంపిక చేసింది.
ఇందులో ప్రాధమికంగా నిర్వహించిన పరీక్షల్లో ప్రగతి సాధించిన నగరాలను స్మార్ట్‌సిటీల జాబితాలో చేర్చింది. మన రాష్ట్రంలో విశాఖ, తిరుపతితో పాటు కాకినాడ చోటు దక్కించుకుంది. వీటిలో ప్రతి ఏటా 20 నగరాలను కేంద్రం ఎంపిక చేసి అభివృద్ధికి నిధులు మంజూరు చేస్తుంది. ఏటా రూ.200 కోట్లు తగ్గకుండా నిధులు మంజూరు అవుతాయి. వీటిలో 50 శాతం కేంద్ర ప్రభుత్వ వాటా, రాష్ట్ర ప్రభుత్వం వాటా 20 శాతం. మిగిలిన 30 శాతం నగరపాలక సంస్థ భరించాల్సి ఉంటుంది. ఈ నిధులు కూడా ఎలా సమీకరించు కుంటుందో నిర్దేశించిన ప్రణాళికలు, వ్యూహాలతో పొందుపర్చాల్సిన అవసరం ఉంది. ఇందులో భాగంగా స్మార్ట్ సిటీల పోటీకి కొన్ని నిర్దేశించిన అంశాలపై కాకినాడ ప్రగతి సంబంధించిన ప్రణాళికలు, వ్యూహాలను నగరపాలక సంస్థ అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో సిద్ధం చేయాల్సి ఉంది.
వ్యాపారులు, దాతలు, ఎన్జిఓలు, ఉద్యోగులు, ప్రజలు ఇలా అన్ని వర్గాల వారిని భాగస్వాములుగా చేయాల్సి ఉంది. దీంతో ప్రాంతాలవారీగా సదస్సులు ఏర్పాటు చేసి ఆయా వర్గాల వారిని చైతన్యవంతులను చేయాల్సిన అవసరం ఉంది. కాకినాడ 10 కిలోమీటర్ల పరిధిలో విస్తరించి ఉంది. నగర జనాభా ప్రస్తుతం 3.80 లక్షలు. వీరికి నగరంలో 101 మురికివాడలు ఉన్నాయి. 300 కిలోమీటర్ల మేర మురుగునీటి కాలువలు ఉన్నాయి. రోజువారీగా 240 టన్నుల చెత్త సమకూ రుతుంది. మంచినీటి సరఫరా పూర్తిస్థాయిలో లేదు. మురుగునీరు నేరుగా సముద్రంలో కలుస్తోంది. దీనిని శుభ్రపరిచి, శుద్ధి చేసే పరిస్థితి లేదు. దీని వలన ప్రజలు రోగాల బారిన పడుతున్నారు.
ఈ పరిస్థితిని నివారించేందుకు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థను చేపట్టాల్సిన అవసరం ఉంది. పేద ప్రజలు ఎక్కువశాతం అద్దె ఇళ్లలో ఉంటున్నారు. వీరికి గృహ వసతి కల్పించాల్సి ఉంది. వీధి దీపాలు వినియోగానికి నెలకు రూ.40 లక్షల విద్యుత్ బిల్లులు చెల్లిస్తున్నారు. నగరంలో వీధి దీపాలుగా ఎల్ఈడీ బల్బుల వాడటంతో ఎక్కువశాతం విద్యుత్ ఆదా అవుతోంది. నగరం పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతోంది. కాకినాడలో ప్రముఖ ఎరువుల కర్మాగారాలు, పామ్ ఆయిల్ కంపెనీలు, అనేక పరిశ్రమలు ఉన్నాయి. వీటి ద్వారా ఎంతో వ్యర్ధం, వేడి వాయువులు వెలువడుతున్నాయి. పర్యావరణం పరిరక్షణ కొరకు గ్రీన్ బెల్ట్‌లు పెంచాల్సిన అవసరం ఉంది. అందుకు అనుగుణంగా మొక్కలను పెండడం లేదు.
ఇప్పట ికైనా కాకినాడలో ఖాళీ ప్రదేశాలలో మొక్కలు పెంచి పర్యావరణాన్ని కాపాడాల్సిన అవసరం ఉంది. నగరంలో జేఎన్టీయూ ఇంజనీరింగ్, రంగరాయ మెడికల్, పీఆర్ అటానమస్, పాలిటెక్నిక్ కాలేజీలు ఉన్నాయి. ప్రముఖ ప్రైవేటు, ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి. నగరంలో జనరల్ హాస్పటల్‌కు జిల్లాలోనే కాక రాష్ట్రం నలుమూలల ఖ్యాతి ఉంది. దీనిని మరింత అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. నగరం పక్కనే ఉన్న సముద్రంలో మత్స్య సంపద ఉంది. దీనిని పూర్తి స్థాయిలో అభివృద్ధి పరిచి మత్స్యకారులకు సహకారం అందిస్తేమత్స్య సంపదను ఎగుమతి చేసే వీలు కలుగుతుంది. తద్వారా నగరం మరింత అభివృద్ధి చెందుతుంది.
కాకినాడ పోర్టు ద్వారా ఎగుమతి, దిగుమతులు జరుగుతున్నాయి. దీనిని అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేస్తే కాకినాడ పోర్టు దేశంలోనే తలమానికంగా మారుతుంది. తీరప్రాంతం, హోప్ ఐలాండ్‌ను పర్యాటకంగా అభివృద్ధి చేస్తే ఆదాయాన్ని గణనీయంగా పెంచుకోవచ్చు. ఇప్పటికైనా అధికారులు, పాలకులు వీటిపై శ్రద్ధ చూపి సమన్వయంతో పనిచేసి నగరాభివృద్ధికి కృషి చేయాలని ప్రజలు కోరుతున్నారు.


