కాత్యాయనీదేవి రూపంలో బెజవాడ దుర్గమ్మ
- 79 Views
- wadminw
- October 5, 2016
- రాష్ట్రీయం
విజయవాడ, అక్టోబబర్ 5 (న్యూస్టైమ్): ‘‘చంద్రహోసోజ్వలకరా శార్దూలవరహాహనా కాత్యాయనీ శుభం ద్యాద్ధేవి దానవఘాతినీ’’ అని అనుకుంటేనే సర్వపాపాలూ పోతాయన్నది దుర్గమ్మ భక్తుల నమ్మకం. దుర్ముఖి నామ సంవత్సర దసరామహోత్సవాల్లో పుష్కర కాలం తరువాత ఇంద్రకీలాద్రిపై కొలువైన జగన్మాత దుర్గమ్మ పదకొండు అలంకారాల్లో దర్శనమీస్తోంది. తిథుల హెచ్చు తగ్గుల కారణంగా ఆశ్వయుజ శుద్ధ చవితి బుధవారం అమ్మవారిని శ్రీకాత్యాయనీదేవిగా అలంకరించారు.
పూర్వం ‘కత’ అనే మహర్షి దేవి ఉపాసనవల్ల ఒక కుమారుడు జన్మించాడు. అతడికి ‘కాత్య’ అనే పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచుకోసాగిన తరుణంలో తపశ్శక్తి సంపన్నుడు కావాలన్న కాంక్ష అతనిలో పెరిగింది. జగన్మాతనే పుత్రికగా పొందాలని తన కోరికను బయట పెట్టిన తరుణంలో అమ్మవారు కాత్యయునుడి పుత్రికగా జన్మించింది. దీంతో ఆమెకు కాత్యాయనిదేవి అని పేరువచ్చింది. మహిషాసురుని అంతమొందించిన తరువాత ముక్కోటి దేవతలు, త్రిమూర్తుల తేజస్సుల అంశతో కాత్యాయనీ దేవికి శక్తిని ప్రసాదించి లోకళ్యాణం గావించారు.
నాటి నుంచీ కాత్యయనీ దేవి భక్తుల పాలిట కల్పవల్లిగా చతుర్విధ పురుషార్ధాలు భక్తులకు ప్రసాదించే వరప్రదాయనిగా వర్ధిల్లింది. తమ కోరికలు సిద్దించేందుకు జగన్మాత ఆశీస్సుల కోసం మహిళలు ప్రత్యేకంగా కాత్యాని వ్రతం ఆచరించడం కూడా జరుగుతుంది. కాత్యాయనీదేవి రూపంలో దర్శనమిస్తున్న దుర్గమ్మను దర్శించుకునేందుకు బుధవారం తెల్లవారుజాము నుంచే భక్తులు బారుల తీరారు. కాగా, ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మను కంచి పీఠాధిపతి స్వామి జయేంద్ర సరస్వతి బుధవారం దర్శించుకున్నారు.
అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయంలో దసరా ఉత్సవాల సందర్భంగా ఏర్పాటుచేసిన అర్చక సభలో ఆయన పాల్గొన్నారు. మరోవైపు, అమ్మవారి పాదాల చెంతనే నూతన రాజధాని ఉండటం శుభసూచకమని ఏపీ అసెంబ్లీ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు తెలిపారు. దుర్గమ్మను బుధవారం ఆయన తన అనుచరులతో కలిసి దర్శించుకున్నారు. రాష్ట్ర ప్రజలకు అమ్మవారి ఆశీస్సులు ఉండాలని స్పీకర్ కోడెల అన్నారు. కాగా, దుర్గమ్మను బుధవారం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు.
ఏపీ డెప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్ప సతీసమేతంగా తరలివచ్చారు. ఆయనకు ఈవో సూర్యకుమారి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. దర్శనానంతరం వేద పండితులు ఆశీర్వచనం అందజేయగా, ఈవో అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలను అందజేశారు. ఉత్సవ ఏర్పాట్లపై డెప్యూటీ సీఎం సంతృప్తి వ్యక్తంచేశారు. దుర్గమ్మను దర్శించుకున్న బీసీసీఐ చైర్మన్ ఎంఎస్కే ప్రసాద్ దుర్గమ్మను బీసీసీఐ చైర్మన్ ఎంఎస్కే ప్రసాద్ బుధవారం దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ అర్చకులు సాదరంగా స్వాగతం పలికారు.
దర్శనానంతరం వేద పండితులు ఆశీర్వచనం, ప్రసాదాలు అందజేశారు. ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మవారి దర్శనం కోసం ఏర్పాటు చేసిన క్యూలైన్లపై భక్తుల నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. మూడు కిలోమీటర్ల మేర క్యూలైన్లు ఏర్పాటు చేసిన అధికారులు మధ్యలో అత్యవసర మార్గాలను ఏర్పాటు చేయకపోవడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. క్యూ లైన్లలోని భక్తులు ఎవరైనా అస్వస్థతకు గురైతే వారికి వైద్యం అందించడం కూడా చాలా కష్టంగా మారింది. కొద్దిసేపటి క్రితం భక్తుల తొక్కిసలాటలో ఉక్కిరిబిక్కిరై కిందపడ్డ ఓ వృద్ధురాలిని వైద్య నిమిత్తం బయటికి తీసుకురావడం చాలా కష్టమైందని భక్తులు తెలిపారు.


