కాపుల కోసం ముద్రగడ చేసిందేమిటో చెప్పాలి: అన్నం
కాపుల కోసం ముద్రగడ ఏం త్యాగం చేశారో చెప్పాలని ఎమ్మెల్సీ అన్నం సతీష్ ప్రభాకర్ డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన గుంటూరులోని జిల్లా పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ ఇన్ని సంవత్సరాల నుంచి రాజకీయాలలో ఉంటూ ఏరోజైనా ఒక్క కాపుకైనా సహాయ పడ్డావా అని ప్రశ్నించారు. కాపుల ఆత్మగౌరవం దెబ్బతీసేదిగా ముద్రగడ కార్యాచరణ ఉందన్నారు.
చిత్తశుద్ధి ఉంటే ప్రభుత్వం నియమించిన మంజునాథ కమిషన్‌కు సహకరించాలన్నారు. నిరుద్యోగ యువతకు రుణాలు, విదేశీ విద్య, సివిల్ సర్వీసెస్‌కు ఉచిత శిక్షణ వంటి కార్యక్రమాలు చేపట్టి కాపు అభివృద్ధికి ప్రభుత్వం పాటుపడుతుందని అన్నారు. రాజకీయ మనుగడ కోసం ప్రతిపక్షనేత మెప్పు కోసం కాపుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయొద్దని హితవు పలికారు. కాపులను బిసి జాబితా నుంచి తొలగించిన కాంగ్రెస్‌ను ఒక్కసారి కూడా విమర్శించని ముద్రగడ కాపులకు నాయకుడు ఎలా అవుతారని డిసిఎంస్ చైర్మన్ ఇంకుర్తి సాంబశివరావు ప్రశ్నించారు. కార్యక్రమంలో రాష్ట్ర యువ కాపునాడు అధ్యక్షుడు శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.


