కాపుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత : మంత్రి మృణాళిని
- 91 Views
- wadminw
- September 21, 2016
- రాష్ట్రీయం
విజయనగరం, సెప్టెంబర్ 21 (న్యూస్‌టైమ్): స్వయం ఉపాధి, సంక్షేమం, ఆర్థికాభివృద్ధి పథకాలకు రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇచ్చి అమలు చేస్తున్నదని రాష్ట్ర గృహ నిర్మాణ, గ్రామీణాభివృద్ధి శాఖమంత్రి డాక్టర్ కిమిడి మృణాళిని చెప్పారు. కాపు కార్పొరేషన్ (బిసి కార్పొరేషన్) ఆధ్వర్యంలో ఎంఎస్‌ఎంఐ పథకం, నైపుణ్యాభివృద్ధి, విదేశీ విద్యా దీవెన పథకాలపై స్థానిక ఐఎంఎ హాల్లో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో మంత్రి మృణాళిని ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. కాపుల అభ్యున్నతికి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేసి రూ.1000 కోట్లు నిధులు కేటాయించారని స్పష్టం చేశారు.
స్వయం ఉపాధి పథకాలను లబ్ధిదారులు సద్వినియోగపర్చుకొని అభివృద్ధి సాధించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. సూక్ష్మ, మధ్యతరహా పరిశ్రమల ఏర్పాటును ప్రోత్సహిస్తూ కాపు కార్పొరేషన్ ద్వారా యువతరానికి అవగాహన కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. స్వచ్ఛంద సంస్థలు, సాప్ట్వేర్ సంస్థలు యువతరానికి నూతన సాంకేతికతపై మరింత శిక్షణ ఇవ్వాలని మంత్రి సూచించారు. ఈ సమావేశంలో శాసనసభ్యురాలు మీసాల గీత, శాసనసభ్యులు నారాయణస్వామినాయుడు, జిల్లా ప్రజా పరిషత్ చైర్పర్సన్ శోభా స్వాతిరాణి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సంయుక్త కలెక్టర్-2 నాగేశ్వరరావు, మహారాజ ప్రభుత్వ జిల్లా కేంద్ర ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ ప్రసాదు, లీడ్ బ్యాంకు మేనేజర్ గురవయ్య, రవి ప్రకాశ్, సీతారామ్, గురునాధం తదితరులు పాల్గొన్నారు.
నేడు టెక్నీషియన్ ఉద్యోగాలకు ఎంపికలు
విజయనగరం, సెప్టెంబర్ 21 (న్యూస్‌టైమ్): జిల్లా ఉపాధి కల్పన కార్యాలయంలో ఈ నెల 22న ఫజలోనా ఫెబ్రికెటేడ్ లిమిటెడ్ హైదరాబాద్ కంపెనీలో టెక్నీషియన్ ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి రామలింగేశ్వరరావు తెలిపారు. 20 నుంచి 30 ఏళ్ల మధ్య వయసున్న పురుష అభ్యర్థులు మాత్రమే ఉద్యోగానికి అర్హులన్నారు. ఐటిఐలో ఫిట్టర్, డిజిల్ మెకానిక్, వెల్డర్ ఉత్తీర్ణులై ఉన్నవారు మాత్రమే హాజరుకావాలన్నారు. జీతం రూ.7,300, వసతి కల్పిస్తారన్నారు. ఉద్యోగం హైదరాబాద్‌లో చేయాల్సి ఉంటుందన్నారు. ఆసక్తిగల అభ్యర్థులు 22న ఉదయం 10 గంటలకు జిల్లా ఉపాధి కల్పన కార్యాలయానికి ధృవీకరణ పత్రాలతో హాజరుకావాలన్నారు. మరోవైపు, మహాకవి గురజాడ వెంకట అప్పారావు 154వ జయంతి వేడుకలు బుధవారం ఇక్కడ ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ వేడుకల్లో రాష్ట్ర సమాచారపౌర సంబంధాల శాఖ, జిల్లా ఇన్చార్జీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి, జిల్లాకు చెందిన రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖమంత్రి డాక్టర్ కిమిడి మృణాళిని, జడ్పీ చైర్పర్సన్ శోభాస్వాతిరాణి, ఎమ్మెల్యే మీసాల గీత, కలెక్టర్ వివేక్ యాదవ్ ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. కేంద్రమంత్రి అశోక్ గజపతిరాజు సాయంత్రం జరిగే కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. కాగా ఉదయం గురజాడ స్వగృహం నుంచి మూడులాంతర్లు, గంటస్తంభం మీదుగా కళాశాల వరకు పాదయాత్ర సాగింది. గురజాడ వాడిన వస్తువులను ఊరేగించారు. పలు పాఠశాలలకు చెందిన బాలబాలికలు గురజాడ గీతాలను ఆలపించారు. అనంతరం గురజాడ విగ్రహానికి ప్రముఖులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో నరసింహరాజు, ప్రకాశ్, తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్రీయ బ్రాహ్మణ సంఘటన కన్వీనర్‌గా బుచ్చిబాబు
విజయనగరం, సెప్టెంబర్ 21 (న్యూస్‌టైమ్): రాష్ట్రీయ బ్రాహ్మణ సంఘటన జిల్లా కన్వీనర్‌గా జంధ్యాల బుచ్చిబాబు నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర అధ్యక్షుడు వేమూరి ఆనంద సూర్య నియామకపత్రం అందించారు. జిల్లాలో బ్రాహ్మణులకు సేవచేసే అవకాశం కల్పించిన రాష్ట్ర అధ్యక్షుడు ఆనందసూర్య, ప్రధాన కార్యదర్శి ఈమని సూర్యనారాయణ, ఉపాధ్యక్షుడు భోగాపురపు వాయునందన శర్మకు బుచ్చిబాబు బుధవారం ఓ ప్రకటనలో కృతజ్ఞతలు తెలిపారు. కాగా, ఇక్కడి ఆయోధ్య మైదానంలో అండర్ – 14, 17, 19 విభాగంలో కత్తి యుద్ధం (పెన్సింగ్) క్రీడా ఎంపికలు బుధవారం ఉదయం ప్రారంభమయ్యాయి. వీటిని స్కూల్‌గేమ్స్ కార్యదర్శులు కోరాడ వెంకట ప్రభావతి, బి.రామారావు పర్యవేక్షిస్తున్నారు. సాయంత్రానికి ఎంపికైన క్రీడాకారుల జాబితాను ప్రకటించారు. కాగా స్కూల్‌గేమ్స్ అండర్-19 విభాగంలో ఈ నెల 22న వాలీబాల్, తైక్వాండో జిల్లాస్థాయి ఎంపికలు నిర్వహించనున్నట్లు కార్యదర్శి, పీడీ రామారావు తెలిపారు. వాలీబాల్ రాజీవ్ స్టేడియంలోను, తైక్వాండో డిఎస్ఎ మైదానంలో ఎంపికలు ఉంటాయన్నారు. అదేవిధంగా స్కూల్‌గేమ్స్ అండర్-10 అథ్లెటిక్స్ జిల్లాస్థాయి ఎంపికలు ఈ నెల 23న విజ్జీ మైదానంలో నిర్వహించనున్నట్లు కార్యదర్శి, శిక్షకులు పీడీ రామారావు తెలిపారు. కాగా ఈ నెల 25న ఖోఖో, కబడ్డీ ఎంపికలు కస్పా పాఠశాలలో ఉంటాయని అండర్-19 కార్యదర్శి బి రామారావు తెలిపారు. ఆసక్తి గల బాల, బాలికలందరు ఆ రోజు ఉదయం తొమ్మిది గంటలకు మైదానంలో తగిన పత్రాలు పట్టుకొని హాజరు కావాలన్నారు. ఈ నెల 22న నిర్వహించాల్సిన షటిల్ జిల్లాస్థాయి క్రీడా ఎంపికలు ఈ నెల 29వ తేదీకి వాయిదా వేయడం జరిగిందని స్కూల్‌గేమ్స్ కార్యదర్శి కోరాడ వెంకట ప్రభావతి తెలిపారు. క్రీడాకారులు ఈ విషయాన్ని గమనించి 29వ తేదీ ఉదయం ఎనిమిది గంటలకు ఇండోర్‌లో హాజరుకావాలన్నారు.


