కాపు ఉద్యమానికి చెక్ పెడనుందా!?
ప్రశ్నించేందుకే ఇంత కాలం పరిమితమైన జన సేనాని పవన్ కళ్యాణ్ తన పంధాను మార్చుకుని ఉద్యమబాట పట్టనున్నారు.తిరుపతి సభలో ప్రత్యేక హోదాపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని ఎండ గట్టిన పవన్ రాజకీయాల్లో తాను కూడా రాటు తేలుతున్నాననే భావనను కలిగించారు. తూర్పు, పశ్చిమ గొదావరి జిల్లాల్లో కాపు సామాజిక వర్గం ఎక్కువగా ఉండటంతో ప్రధానంగా ఈ జిల్లాల పైనే దృష్టి సారించనున్నారు. జనసేన పార్టీ ఆధినేత పవన్ కళ్యాన్ రాకతో రానురాను సమీకరణాలు కూడా మారతాయనిపిస్తున్నాయి. ఎన్నికలకు ఇంకా రెండున్నరేళ్లు గడువున్నప్పటికీ ఈ లోపు స్థిరమైన రాజకీయాలు కొనసాగాలంటే నిర్ణయాలు వేగంగా తీసుకోవాల్సి ఉంటుంది.
అందులో భాగంగానే తిరుపతి సభతో జిల్లాలో కొంత గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ముఖ్యంగా తూర్పుగోదావరి జిల్లా రాజకీయ మార్పుకు పెట్టింది పేరు. ఇక్కడే ప్రత్యేక హోదా సాధన దిశగా ప్రముఖపవన్ కళ్యాణ్ మొదటి సభను నిర్వహించే క్రమంలో తిరుపతి సభలో ప్రకటన చేశారు. దీంతో యువతలో ఉత్సాహం రెట్టింపైంది. హోదా వస్తుందో రాజకీయాల నడుమ చతికిలపడుతుందో పక్కనపెడితే ఇదే జిల్లాకు చెందిన ముద్రగడ పద్మనాభం కాపు ఐక్యగర్జన పేరిట దూసుకుపోతున్న ఉద్యమంపై పవన్ నీళ్లు చల్లుతున్నాడా అన్న అనుమానం లేకపోలేదు. అధికారికంగా, పార్టీ పరంగా రావడానికి ఇంకా సమయం ఉంది కనుక గుంభనంగా ఉండిపోయారని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
ఇంటెలిజన్స్ వర్గాల ద్వారా ఇది గ్రహించిన తెలుగుదేశం ప్రభుత్వం ఇప్పట్నుంచీ జాగ్రత్త పడాలనే ముందు చూపుతో ప్రత్యేక హోదా పేరిట పవన్ కళ్యాణ్ సభను కాకినాడలో నిర్వహించేలా జాగ్రత్త పడిందని అంటున్నారు. అందులో భాగంగానే పవన్ కాకినాడకు వస్తున్నాడా అన్న మీమాంస లేకపోలేదు. సభ పవన్ పెడుతున్నారంటే కంటే ముఖ్యమంత్రి చంద్రబాబు పెట్టిస్తున్నారన్న వాదనే బలంగా సమాజంలో విన్పిస్తోంది. చంద్రబాబును నిన్నటి సభలో పెద్దగా విమర్శించకుండానే భయపడొద్దదని హితవు పలకడం సన్నాయి నొక్కుల్లో భాగంగానే చెప్తున్నారు. దీనిని అనుకూలంగా చంద్రబాబు మలుచుకుంటారా అన్నది కాలం చెప్పాల్సిన సమాధానం కాగా కాపు ఉద్యమం మాత్రం కాస్త ఎగ ఊపిరి, దిగ ఊపిరి కింద నలుగుతుందంటున్నారు. నిజానికి పవనిజం ముందు ఎవరైనా కొంచెం కష్టమే అన్నది ప్రత్యేకంగా ప్రస్తానించనవసరం లేదు.
దీనికి తోడు తెలుగుదేశం, బీజేపీలకు మొన్నటి ఎన్నికల్లో పూర్తి మద్ధతు ఇమ్మనే తన అభిమానులను ప్రోత్సహించినట్టు పవన్ స్వయంగా చెప్పుకున్నదే. ఆ క్రమంలో ఒక్క కాపు సామాజిక వర్గమే కాక ఎస్సీ, బిసి, ఎస్టీలలో సైతం పవన్ అంటే మోకరిల్లడమే కాదు ప్రాణాలైనా ఇవ్వడానికి వెనుకాడని అభిమానులున్నారు. చంద్రబాబు ప్రభుత్వం వ్యవసాయ, డ్వాక్రా రుణాల రద్దు వంటివి పూర్తిస్థాయిలో అమలుకు నోచుకోలేదన్న సంగతిని పలువురు గ్రహిస్తే యువతకు ఉద్యోగావకాశాల కల్పన, రుణాల పంపిణీ వంటివి క్షేత్రస్థాయిలో అమలైన దాఖలా లేదన్నది జగమెరిగిన సత్యం. కొత్తగా కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేసి రుణ పంపిణీ చేశామని చెప్పుకుంటున్నా అవన్నీ రికార్డులకే పరిమితమయ్యాయి తప్ప లబ్ధిదారుకు చేరలేదని పలువురు పేర్కొంటున్నారు.
దరఖాస్తు పెట్టడం వాస్తవం, పరిశీలన వాస్తవం అయినప్పటికీ బ్యాంకులు ఆమోదించం లేదన్నది పచ్చినిజంగా ఉంటోంది. ఎందుకంటే రుణానికి హామీ లేదా 50 శాతం సబ్సిడీ సొమ్ముకు ధీటుగా బ్యాంకులో ఎఫ్డి ఉంచాలని స్పష్టంగా చెబుతున్నారు. ఇలా జాతీయ బ్యాంకులు మాత్రమే కాకుండా జిల్లా కేంద్ర సహకార బ్యాంకు సైతం తన యంత్రాంగానికి ఇదే తరహా ఆదేశాలు ఇచ్చింది. ఫలితంగా పలుకుబడి ఉన్నవారు, దబాయింపు చేసేవారు అక్కడక్కడా రుణం పొందగా మిగిలిన వారు ఎదురుచూపులే చూస్తున్నారు. ఈ నేపథ్యంలో యువత ఒకింత అసహనంగానే ఉంది. బ్యాంకింగ్ రంగాన్ని అధికార యంత్రాంగం ఏమాత్రం శాసించలేని స్థితిలోనే ఉంది.
ఎన్నికల వరకూ పవన్ కళ్యాణ్‌ను పూర్తిగా సమర్ధించి తెలుగుదేశానికి ఓటేసిన అదే యువత రికామీగా తిరుగుతూ ఏకపక్ష పోకడకు తలూపే పరిస్థితి కన్పించడం లేదు. పవన్ వరకూ చెవి కోసుకుంటారు గానీ బతుకు తెరువు కూడా అవసరం కనుక కాపులను బిసిల్లో చేర్చే అంశంలో ఆ సామాజికవర్గం అభిమానులు ఓపిక పడితే బాగుంటుందన్న ధోరణిలోనే వ్యవహరిస్తున్నారు. దీనికి తోడు ముద్రగడ కాపు జేఏసీ సారధ్యంలో మొత్తం ఉద్యమాన్ని వెనకుండి నడిపిస్తుంటే ఆయన రెండవ కుమారుడు గిరి నియోజకవర్గాల్లో తనదైన శైలిలో ఇంటింటినీ టచ్ చేస్తున్నారు.
ఇది గ్రహించిన ప్రభుత్వం కాపు ఉద్యమంపై నీళ్లు చల్లేందుకు తద్వారా హోదా అంశం తెరపైకి తెచ్చి లబ్ధి పొందాలని చూస్తున్నట్టు అనుమానిస్తున్నారు. కాపు ఉద్యమం కేవలం రిజర్వేషన్ల మీదే ఆధారపడి ముందుకు నడుస్తున్న ఉద్యమంగా ఉన్నప్పటికీ కొంత చెదురు మదురు ఇబ్బందులు తప్పేలా లేవంటున్నారు. ఇందుకు కారణం వెనుక బలమైన పవన గాలులు వీచడం వల్లనేనని చెప్పుకుంటున్నారు.


