కార్యకర్తలే పార్టీకి బలం: చంద్రబాబు
- 76 Views
- wadminw
- October 4, 2016
- రాష్ట్రీయం
గుంటూరు, అక్టోబబర్ 4 (న్యూస్‌టైమ్): పార్టీకి కార్యకర్తలే బలం, బలహీనతలని తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు. ఇక్కడి కేఎల్ వర్సిటీలో మూడ్రోజులపాటు నిర్వహించనున్న తెదేపా శిక్షణా తరగతులను మంగళవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ పార్టీ పెట్టినప్పటి నుంచి శిక్షణా తరగతులకు ప్రాధాన్యమిచ్చామని తెలిపారు. నాయకత్వ సాధికారతపై మూడ్రోజుల పాటు చర్చిస్తామని వివరించారు. వినూత్న ఫలితాలు రాబట్టేందుకు, భవిష్యత్‌లో ఎలా ముందుకెళ్లాలో ప్రణాళికలు వేసుకోవాలని సూచించారు. ప్రజాప్రతినిధుల్లో నాయకత్వ లక్షణాలు పెంపుపై సీఎం దిశానిర్దేశం చేశారు.
రాష్ట్ర విభజన అనంతర పరిణామాలు, ప్యాకేజీ వల్ల లాభాలపై నేతలకు అవగాహన కల్పించనున్నారు. నాయకత్వంపై కార్యకర్తలు ప్రజలకు నమ్మకం కలిగించాలని, ప్రజల్లోకి నేరుగా వెళ్లేది కార్యకర్తలే అని చంద్రబాబు అన్నారు. పార్టీ పెట్టినప్పటి నుంచి శిక్షణా తరగతులకు ప్రాధాన్యమిచ్చామన్నారు. నాయకత్వ సాధికారతపై నేతలకు శిక్షణ ఇస్తామని తెలిపారు. రియల్‌టైం గవర్నెన్స్‌తో మంచి ఫలితాలు సాధించవచ్చని చెప్పుకొచ్చారు. వినూత్న ఫలితాలు రాబట్టేందుకు ప్రణాళికలు అమలు చేయాలని, భవిష్యత్‌లో ఎలా ముందుకెళ్లాలో ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. విభజన అనంతరం ప్రజల్లో స్తబ్ధత నెలకొందని తెలిపారు.
రాష్ట్రాభివృద్ధి కోసమే ఎన్డీయేతో కలిసి పనిచేస్తున్నట్లు వివరించారు. విభజన చట్టంలో కొన్ని అంశాలపై స్పష్టమైన హామీ ఇచ్చారని, మరికొన్నింటిని పరిశీలిస్తామని పేర్కొన్నారని తెలిపారు. సాంకేతిక కారణాల వల్ల ప్రత్యేక హోదా ఇవ్వలేమని కేంద్రం చెబుతోందన్నారు. హోదా వల్ల వచ్చే అన్ని ప్రయోజనాలతో ప్యాకేజీ ఇస్తామందని బాబు తెలిపారు. ఇప్పటికే కొన్ని కేంద్ర సంస్థలు వచ్చాయని, మరిన్ని రావాల్సి ఉందన్నారు. కేంద్రం ఇచ్చిన సంస్థలు పూర్తి కావాలంటే రూ.10వేల కోట్లు కావాలని పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టుకు నాబార్డు ద్వారా 100శాతం నిధులు ఇస్తామని కేంద్రం ఒప్పుకుందని వివరించారు. పోలవరం పనులను వేగవంతం చేశామన్నారు.
2018 నాటికి ఎట్టి పరిస్థితుల్లో పూర్తి చేస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు. పోలవరంపై ముంపు ప్రాంతాలను ఏపీలో కలుపుతూ తొలి కేబినెట్ సమావేశంలోనే కేంద్రం నిర్ణయం తీసుకుందని బాబు అన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా ఐపాడ్, సెల్‌ఫోన్ తప్పనిసరి అని, పాస్ అయితేనే ఇక్కడి నుంచి వెళతారని, లేకపోతే మరో రెండు రోజులు ఇక్కడే ఉంటారని టీడీపీ నేతల శిక్షణా తరగతులకు హాజరైన ముఖ్యమంత్రి నాయుడు నవ్వుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. దీనివల్ల పనులు తొందరగా అవుతాయని, ఎందు కంటే టచ్ స్ర్కీన్, చదువు కూడా అవసరం లేదని బొమ్మలు చూసుకుని కొట్టుకుంటూ పోతే ఆటోమేటిక్‌గా ఏది కావాలంటే అది వస్తుందని ఆయన అన్నారు. తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గ ఇన్‌ఛార్జులు శిక్షణా తరగతుల్లో పాల్గొన్నారు.


